విశాఖకు ఏమైంది ?
ఇందులో ఎందరు మళ్ళీ బయటకు వచ్చి తన దైనందిన జీవితాన్ని ప్రారంభిస్తారో ఎవరికీ తెలియదు.
By: Tupaki Desk | 24 Aug 2024 12:30 AM GMTఈ నగరానికి ఏమైంది అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఒక రోజు తేడాలో రెండు సెజ్ లలో భారీ ప్రమాద ఘటనలు జరిగాయి. అచ్యుతాపురం సెజ్ లో జరిగిన ఘటలో అయితే ఏకంగా 19 మంది మరణించారు. మరో యాభై నుంచి అరవై మంది దాకా గాయపడ్డారు. ఇందులో ఎందరు మళ్ళీ బయటకు వచ్చి తన దైనందిన జీవితాన్ని ప్రారంభిస్తారో ఎవరికీ తెలియదు.
అచ్యుతాపురం ఘటన అలా కళ్ల ముందు ఉండగానే మరో దుర్ఘటన విశాఖ జిల్లాలో జరిగింది. అదే పరవాడ దుర్ఘటన. ఈ ఘటనలో నలుగురు కార్మికులకు తీవ్రంగా గాయాలు అయ్యాయి. దాంతో వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. సెజ్ లలలో వరసబెట్టి ఈ ఘటనలు చోటు చేసుకోవడంతో అంతా భయపడిపోతున్నారు.
రసాయనాలతో నిండిన రియాక్టర్లు లీక్ కావడంతో గాలిలో ప్రాణాలు కలసిపోతున్నాయి. అదే సమయంలో భద్రతాపరమైన ప్రమాణాలు పాటించడం సంస్థలు చేయడం లేదు అన్న విమర్శలు ఉన్నాయి. అధికారుల స్థాయిలో తనిఖీలు కూడా మొక్కుబడిగా సాగుతున్నాయి. మరో వైపు ఉన్నతాధికారులు ఎవరికీ సెజ్ లు ఎక్కడ ఉన్నాయో కనీస మాత్రంగా తెలియని పరిస్థితి ఉందని అంటున్నారు.
ఈ సెజ్ లతో సంబంధించిన అధికార శాఖలు చాలా మామూలుగా మామూళ్ళ మత్తులో మునిగి తేలుతూండడంతో అందులో పనిచేసే కార్మికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని గడపాల్సి వస్తోంది. ఒకసారి కనుక భారీ ప్రమాదం సంభవిస్తే మరణాల రేటు అధికంగా ఉంటుంది. దాంతోనే సెజ్ లను ఏర్పాట్లు చేయవద్దు అని మొదట్లో చాలా ఉద్యమాలు జరిగాయి.
కానీ వాటిని ఏర్పాటు చేస్తామని ఉన్నత ప్రమాణాలతో నడిపించేలా చూస్తామని పెద్దలు చెబుతూ వాటిని జనవాసాల మధ్య ఏర్పాటు చేయించారు ఇపుడు అవే గుండెల మీద కుంపటి మాదిరిగా మారి కూర్చున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో సెజ్ లు ఎక్కువ. అలాగే ఫార్మా కంపెనీలు కూడా ఉన్నాయి.
అక్కడ మంట అంటుకుంటే చాలు ఇక అగ్గి రాజుకుంటుంది. క్షణాలలో ప్రాణాలు హారతి కర్పూరం అవుతాయి. ఒకసారి ప్రమాదం జరిగినపుడు రాజకీయ పార్టీల నుంచి ప్రభుత్వాల దాకా అంతా హడావుడి చేయడం ఆ తరువాత అంతా సైలెంట్ కావడం షరా మామూలు వ్యవహారంగా ఉంటోంది.
దీంతోనే సెజ్ లలో మరణ మృదంగాలు మోగుతున్నా అవి కూడా సర్వ సాధారణమైన వ్యవహారంగా మారిపోతున్నాయి. ఇక ఉమ్మడి విశాఖ జిల్లాలో ఇటీవల కాలంలో అనేక దుర్ఘటనలు జరిగాయి. ఈ మధ్యనే కైలాస పట్నం లో ఒక హాస్టల్ లో కలుషిత ఆహారం తిని ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఏ మాత్రం తనిఖీలు లేవు. రిజిస్టేషన్లు ఉండవు. అయినా నిర్వహిస్తూ ప్రాణాలను హరిస్తున్న ఇలాంటి సంస్థల విషయంలో చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇలా జరుగుతోంది అని అంటున్నారు.
ఇలా ఇటీవల కాలంలోనే పదుల సంఖ్యలో ప్రాణాలు పోతూ విశాఖ జిల్లా శోకానికి మారుపేరు గా ఉంది. విశాఖనా లేక విశోకమా అని కూడా అంటున్నారు. విశాఖ అంటే అహ్లాదానికి మారు పేరు అని ఉండేది. ఇపుడు హాహాకారాలకు అసలైన పేరుగా మారిపోతోంది.
సెజ్ ల పని తీరు విషయంలో కానీ ఇతరత్రా వ్యవహాలలో కానీ సరైన పర్యవేక్షణ ఉండాలని కోరుతున్నారు. ప్రజల ప్రాణాలు అంటే తేలికగా తీసుకోరాదని పరిహారంతో సరిపెట్టడంతో చేతులు కడుక్కోవద్దని కోరుతున్నారు. ప్రజల ప్రాణాలు అన్నవి రాజ్యాంగం కల్పించిన తొట్ట తొలి హక్కు. వాటిని కాపాడలేని విధంగా ఉంటే ఇక ఏమి లాభం అన్న నిర్వేదం అయితే వ్యక్తం అవుతోంది.