కీలకమైన జిల్లాలో వైసీపీకి ఇద్దరు ఎమ్మెల్యేల తలపోటు!
సిట్టింగులకు టికెట్ ఇవ్వనిచోట కొత్త ముఖాలకు చోటు ఇస్తున్నారు.
By: Tupaki Desk | 10 Jan 2024 5:04 AM GMTఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ పలు నియోజకవర్గాల్లో మార్పులుచేర్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొందరిని మారుస్తున్న ఆయన.. వారిని వేరే నియోజకవర్గాలకు బదిలీ చేస్తున్నారు. మరికొందరికి పూర్తిగా టికెట్ ను నిరాకరిస్తున్నారు. సిట్టింగులకు టికెట్ ఇవ్వనిచోట కొత్త ముఖాలకు చోటు ఇస్తున్నారు.
ఈ మార్పులు చేర్పులు నచ్చనివారు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీరిని బుజ్జగించడానికి సీనియర్ నేతలు రంగంలోకి దిగుతున్నారు. ముఖ్యంగా కీలకమైన ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు వైసీపీని వీడుతారని ప్రచారం జరుగుతోంది.
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు జగన్ సీటు నిరాకరించారు. విజయవాడ సెంట్రల్ సీటును ప్రస్తుతం విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యేగా ఉన్న వెలంపల్లి శ్రీనివాసరావుకు కేటాయించారు. విష్ణుకు సీటు లేదని చెప్పేశారు. దీంతో ఆయన కాంగ్రెస్ వైపు చూస్తున్నారని టాక్ నడుస్తోంది. 2009లో విజయవాడ సెంట్రల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచిన మల్లాది విష్ణు 2014లో ఓడిపోయారు. 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరి అదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు.
ఇప్పుడు తనకు సీటు నిరాకరించడంతో ఆయన కాంగ్రెస్ లోకి వెళ్తారని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్లు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మర్రి రాజశేఖర్ ఆయనతో మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. స్వయంగా సీఎం జగన్ వద్దకు విష్ణును తోడ్కొని వెళ్లినట్టు చెబుతున్నారు. పార్టీని వీడొద్దని పార్టీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ సీటు ఇస్తామని విష్ణుకు ఆఫర్ ఇచ్చినట్టు టాక్ నడుస్తోంది. అయితే ఈ ప్రతిపాదనకు మల్లాది విష్ణు అంగీకరించలేదని సమాచారం.
ఇక కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి పరిస్థితి ఇలాగే ఉంది. ఇటీవల తన నియోజకవర్గంలో నిర్వహించిన వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర సందర్భంగా ఆయన బహిరంగంగానే జగన్ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజలు తనను గుండెల్లో పెట్టుకుంటున్నా జగన్ గుండెల్లో మాత్రం తాను లేనని హాట్ కామెంట్స్ చేశారు. వాస్తవానికి మంత్రివర్గ విస్తరణ జరిగిన రెండుసార్లు ఆ పదవికి కొలుసు పార్థసారధి పేరు వినిపించింది. అయినప్పటికీ చివరకు ఆయనకు అవకాశం రాలేదు.
వచ్చే ఎన్నికల్లో పార్థసారధిని మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీ చేయాలని జగన్ సూచించినట్టు సమాచారం. అయితే ఎంపీగా పోటీ చేయడం తనకు ఇష్టం లేదని.. పెనమలూరు నుంచే తాను పోటీ చేస్తానని ఆయన చెప్పినట్టు చెబుతున్నారు. ఇప్పటికే పార్థసారధి తాను పెనమలూరు నుంచే పోటీ చేస్తానని బహిరంగంగా ప్రకటించడం విశేషం. అయితే వైసీపీ అధిష్టానం ఆయనను ఎంపీగా పోటీ చేయమనడంతో ఆయన పార్టీని వీడి టీడీపీలో చేరడానికి సిద్ధమవుతున్నారని టాక్ నడుస్తోంది. జనవరి 18న ఇందుకు ముహూర్తం కూడా ఖరారయ్యిందని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో పార్థసారధిని కూడా వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్లు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్ కలిసి తొందరపడొద్దని సూచించారు. అయినప్పటికీ కొలుసు మెత్తబడకపోవడంతో ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ రుహుల్లా కూడా పార్థసారధి కార్యాలయానికి వచ్చి ఆయనను బుజ్జగించారు.
అయినప్పటికీ పార్థసారధి వైఖరిలో ఏ మార్పు లేకపోవడంతో సీఎంవో నుంచి ఆయనకు ఫోన్ వచ్చింది. దీంతో పార్థసారధి సీఎం జగన్ ను కలిశారు. మచిలీపట్నం నుంచి ఎంపీగా పోటీ చేయాలని జగన్ కూడా చెప్పడంతో పార్థసారధి ఏం మాట్లాడకుండానే బయటకు వచ్చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొలుసు పార్థసారధి, మల్లాది విష్ణు వైసీపీని వీడటం ఖాయమని గాసిప్స్ వినిపిస్తున్నాయి.