టీడీపీలోకి మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు!?
ఐప్యాక్ సర్వేలు, ప్రజల్లో బలం, సామాజిక సమీకరణాల ఆధారంగా ఆయన అభ్యర్థులను ప్రకటిస్తున్నారు.
By: Tupaki Desk | 19 Feb 2024 6:33 AM GMTఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో అధికారం సాధించడమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే ఏడు జాబితాల్లో అభ్యర్థులను ప్రకటించారు. ఐప్యాక్ సర్వేలు, ప్రజల్లో బలం, సామాజిక సమీకరణాల ఆధారంగా ఆయన అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఆయన సీట్లు నిరాకరించారు. మరికొందరిని వేరే స్థానాలకు మార్చారు.
ఇక సీట్లు దక్కించుకోలేనివారు వేరే పార్టీల్లో చేరడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్యెల్యేలు, ఎంపీలు టీడీపీ, జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఇదే కోవలో మరికొందరు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. మైలవరం, ఆలూరు ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, గుమ్మనూరు జయరాంలు కూడా పార్టీ మారే యోచనలో ఉన్నారని టాక్ నడుస్తోంది.
ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా మైలవరం వైసీపీ ఎమ్మెల్యేగా వసంత కృష్ణప్రసాద్ ఉన్నారు. ఆయన కొంతకాలంగా పలు బహిరంగ సభల్లో, కార్యకర్తల సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఆయనకు సీటు నిరాకరించారు. మైలవరం సీటును ప్రస్తుతం జెప్పీటీసీగా ఉన్న తిరుపతిరావుకు కేటాయించారు.
ఇక కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యేగా ఉన్న గుమ్మనూరు జయరాం.. జగన్ మంత్రివర్గంలో కార్మిక శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఐదేళ్లపాటు మంత్రిగా ఉన్న రికార్డును దక్కించుకున్నారు. జగన్ మొదటి, రెండో విడత మంత్రివర్గాల్లో స్థానం దక్కించుకున్న అతి తక్కువమంది నేతల్లో ఒకరిగా జయరాం నిలిచారు.
కాగా గుమ్మనూరు జయరాంను వచ్చే ఎన్నికల కోసం కర్నూలు ఎంపీ అభ్యర్థిగా జగన్ ప్రకటించారు. ప్రస్తుతం జయరాం ప్రాతినిథ్యం వహిస్తున్న ఆలూరు సీటును జెడ్పీటీసీగా ఉన్న విరూపాక్షికి కేటాయించారు. అయితే జయరాంకు పార్లమెంటుకు పోటీ చేయడంపై ఆసక్తి లేదని టాక్ నడుస్తోంది. ఆయన మళ్లీ అసెంబ్లీకే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించిననాటి నుంచి ఆయన వైసీపీ ముఖ్య నేతలకు అందుబాటులో ఉండటం లేదని అంటున్నారు.
తాజాగా అనంతపురం జిల్లా రాప్తాడులో జగన్ నిర్వహించిన సిద్ధం సభకు కూడా గుమ్మనూరు జయరాం గైర్హాజరయ్యారు. దీంతో ఆయన పార్టీ మారడం ఖాయమని గాసిప్స్ వినిపిస్తున్నాయి.
అటు వసంత కృష్ణప్రసాద్, ఇటు జయరాం ఇద్దరూ టీడీపీలో చేరతారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. టీడీపీలో చేరి యధావిదిగా ఇప్పుడు తాము ప్రాతినిధ్యం వహిస్తున్న మైలవరం, ఆలూరు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్టు టాక్ నడుస్తోంది. టీడీపీలో వీరి చేరికపై మరికొద్ది రోజుల్లోనే స్పష్టత రానుంది.