Begin typing your search above and press return to search.

ఆ ఎంపీలు జైలు నుండి లోక్ సభకు వస్తారా ?

జైలు నుంచి ఎన్నికైనప్పటికీ వీరిద్దరూ ప్రమాణ స్వీకారం చేయడానికి రాజ్యాంగం అవకాశం కల్పిస్తుందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   6 Jun 2024 7:14 AM GMT
ఆ ఎంపీలు జైలు నుండి లోక్ సభకు వస్తారా ?
X

కరడుగట్టిన ఖలిస్థానీ వేర్పాటువాది అమృత్‌పాల్‌ సింగ్‌, ఉగ్రవాదులకు నిధులను చేరవేశాడన్న ఆరోపణలతో జైలు శిక్ష అనుభవిస్తున్న షేక్‌ అబ్దుల్‌ రషీద్‌ ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీలుగా విజయం సాధించారు. జైలు నుంచే లోక్‌సభకు ఎన్నికైన వీరు ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేయవచ్చా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.

జైలు నుంచి ఎన్నికైనప్పటికీ వీరిద్దరూ ప్రమాణ స్వీకారం చేయడానికి రాజ్యాంగం అవకాశం కల్పిస్తుందని రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు. అమృత్‌పాల్‌, రషీద్‌ ఎంపీలుగా ప్రమాణ స్వీకారం చేయాలంటే ముందుగా వారు జైలు అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. ఆ తర్వాత వారిని భద్రతాధికారులే పార్లమెంటుకు తీసుకువస్తారని, ప్రమాణ స్వీకారం అనంతరం ఇద్దరూ తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంటుందని చెబుతున్నారు.

వారు లోక్‌సభ కార్యకలాపాలకు హాజరు కాలేని పరిస్థితులలో అందుకు గల కారణాలను వివరిస్తూ స్పీకర్‌కు లేఖ రాయాల్సి ఉంటుందని, పార్లమెంటు ఉభయసభల కార్యకలాపాల్లో పాల్గొనే వెసులుబాటు వారికి ఉండదని అంటున్నారు. ప్రస్తుతం జైల్లో ఉన్న వీరిద్దరికి రెండేళ్ల కంటే ఎక్కువ జైలు శిక్ష పడితే వారి లోక్‌సభ సభ్యత్వం దానంతట అదే రద్దవుతుంది.

అమృత్‌పాల్‌ పంజాబ్‌లోని ఖడూర్‌ సాహిబ్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి కుల్బీర్ సింగ్ జీరాపై 1,97,120 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. జమ్ముకాశ్మీర్ లోని బారాముల్ల లోక్ సభ స్థానం నుండి షేక్ అబ్దుల్ రషీద్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అద్బుల్లా మీద ఏకంగా 204142 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం విశేషం.