Begin typing your search above and press return to search.

రెండు జాతీయ పార్టీలు : రెండు ప్రాంతీయ పార్టీలను మింగేస్తాయా ...?

అయినా ఈ విలీనాల ప్రచారం దేనికి అంటే జాతీయ పార్టీలు బలోపేతం కావడం కోసం ప్రాంతీయ పార్టీలను మింగేయాలని చూస్తున్నాయా అన్న ప్రచారం కూడా ఉంది.

By:  Tupaki Desk   |   20 Aug 2024 3:45 AM GMT
రెండు జాతీయ పార్టీలు :  రెండు ప్రాంతీయ పార్టీలను మింగేస్తాయా ...?
X

దేశంలో పొలిటికల్ పోలరైజేషన్ సాగుతోంది. అది సౌత్ నుంచే ఆరంభం అవుతోంది. ముఖ్యంగా సౌత్ ఒకనాడు ప్రాంతీయ పార్టీలకు పుట్టినిల్లు. తమిళనాడులో ద్రవిడ మున్నేట్ర కజగం పేరుతో ఇప్పటికి ఎనిమిది దశాబ్దాల క్రిత్రం ప్రాంతీయ రాజకీయం మొదలైంది. ఆతరువాత మరాఠాలో శివసేన ప్రాంతీయ పార్టీగా అవతరించి ఆరు దశాబ్దాలు అయింది.

ఇక జమ్మూ కాశ్మీరులో నేషనల్ కాన్ఫరెన్స్ చరిత్ర కూడా సుదీర్ఘ దశాబ్దాలదే. అలా ఉత్తర దక్షిణాదిలో ప్రాంతీయ పార్టీల హవా పెద్ద ఎత్తున సాగింది. ఇపుడు చూస్తే సీన్ రివర్స్ లో సాగుతోంది. ప్రాంతీయ పార్టీలను తగ్గించడం, వీలైతే తమతో కలిపేసుకోవడం ద్వారా పూర్తి రాజకీయ ఆధిపత్యం చలాయించాలని జాతీయ పార్టీలు చూస్తున్నాయి.

ఈ విషయంలో కాంగ్రెస్ కి బీజేపీ ఏమీ తీసిపోవడం లేదు. పైగా నాలుగాకులు ఎక్కువ చదివింది కూడా. దాంతో బీజేపీ కాంగ్రెస్ ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల మీద కన్నేశాయని అంటున్నారు. గత ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలు అయింది. ఈ ఏడాదిలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో ఒక్క సీటూ సంపాదించలేకపోయింది.

దాంతో బీఆర్ఎస్ విలీనం అంటూ గత కొన్ని నెలలుగా వార్తలు వస్తున్నాయి. మేము విలీనం కాము మొర్రో అని ఆ పార్టీ నేతలు మొత్తుకుంటున్నా ఈ వార్తలు ఆగడం లేదు. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం అని బీజేపీ వారు అంటూంటే లేదు బీజేపీలోనే బీఆర్ఎస్ విలీనం అని కాంగ్రెస్ పెద్దలు గట్టిగా బల్లగుద్ది మరీ చెబుతున్నారు.

ఇంతకీ బీఆర్ఎస్ విలీనం ఏ పార్టీతో అన్న డౌట్లు అయితే తెలంగాణా జనాలలో వస్తున్నాయి. మొత్తానికి బీఆర్ఎస్ ని విలీనం పేరుతో రాజకీయంగా ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఇపుడు ఏపీలో కూడా వైసీపీకి ఇదే రకమైన పరిస్థితి ఉంది అని అంటున్నారు. బీజేపీలో వైసీపీ విలీనాన్ని మేము వ్యతిరేకిస్తామని ఆ పార్టీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు కీలక ప్రకటన చేశారు.

బీజేపీలో వైసీపీ విలీనం అన్నది ఎవరికీ ఊహకు కూడా అందని విషయం. కానీ బీజేపీ ఎమ్మెల్యే చెప్పారు కాబట్టి దీని మీద అంతా చర్చిస్తున్నారు. మరో వైపు చూస్తే కాంగ్రెస్ లో వైసీపీ విలీనం అవుతుంది అన్న పుకారులు ఉన్నాయి. ఈ విషయంలో తెర వెనక చర్చలు జరుగుతున్నాయని కూడా అంటున్నారు.

ఇవన్నీ ప్రచారంలో ఉన్న మాటలే. అయితే వీటిలో నిజం ఎంత అన్నది తెలియకపోయినా ఈ ప్రచారంతో వైసీపీతో పాటు ఏపీ ప్రజలలో వివిధ రాజకీయ పార్టీలలో చర్చ సాగుతోంది. నిజానికి ఓటములు గెలుపులు అన్నవి రాజకీయ పార్టీలకు సాధారణం. ఒక ఎన్నికల్లో ఓటమి చెందితే మరో ఎన్నికల్లో గెలిచి తీరుతారు. ఆ విశ్వాసం కూడా అధినేతలకు ఉంటుంది.

అయితే 2014 నుంచి 2019 దాకా విపక్షంలోనే వైసీపీ ఉంది. మరి అలాంటి పార్టీకి అపుడు లేని రాని విలీన ప్రచారం ఇపుడు రావడం అంటే చిత్రమే అని అంటున్నారు. అలాగే కేసీఅర్ అంటేనే పోరాట యోధుడు. తెలంగాణా రాష్ట్రం అన్న కలను ఆయన సాకారం చేశారు. పదేళ్ల పాటు అధికారం చలాయించారు. అపర చాణక్యుడు అని పేరు.

అలాంటి కేసీఆర్ పార్టీకి పాతికేళ్ల పాటు నడిపి ఇపుడు విలీనం వైపు వెళ్తారా అన్నది కూడా అందరికీ కలిగే డౌట్. ఇక జగన్ అయినా కేసీఆర్ అయినా ఏటికి ఎదురీదే రకాలు. పట్టుదలకు మారు పేరుగా చెబుతారు. ఏమైనా కానీ తమ నిర్ణయాలను మార్చుకోకుండా ముందుకు సాగే తెగింపు ఉన్న నేతలు. బీఆర్ఎస్ లో కేటీఆర్ హరీష్ రావు కీలక నేతలుగా కేసీఆర్ కి బాసటగా ఉన్నారు.

వైసీపీలో జగన్ ఇంకా యువ నాయకుడిగానే ఉన్నారు. మరింత కాలం పాటు రాజకీయం చేసే నేర్పూ ఓర్పూ ఆయనకు ఉన్నాయి. అయినా ఈ విలీనాల ప్రచారం దేనికి అంటే జాతీయ పార్టీలు బలోపేతం కావడం కోసం ప్రాంతీయ పార్టీలను మింగేయాలని చూస్తున్నాయా అన్న ప్రచారం కూడా ఉంది. చూడాలి మరి ఈ ప్రచారాలే నిజం అవుతాయా లేక ఈ పార్టీల ఆలోచనలు ఏ కొత్త రూపు తీసుకుంటాయన్నది.