బై బై బాబు... తెలంగాణలో కాసానికి రెండు ఆఫర్లు?
నిన్నమొన్నటివరకూ తెలంగాణ టీడీపీకి జవసత్వాలు తెచ్చి.. కాస్త గాడిలో పెడుతూ.. కచ్చితంగా ఈ ఎన్నికల్లో ఎంతో కొంత ప్రభావం చూపించేలా పనిచేస్తున్నారు అని పేరు సంపాదించుకున్న కాసాని జ్ఞానేశ్వర్ గురించి ఇలాంటి కథనాలు ఎందుకు వస్తున్నాయనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా ఉంది.
By: Tupaki Desk | 27 Oct 2023 6:17 AM GMTతెలంగాణలో టీడీపీ ఎన్నికల్లో పోటీ చేయబోతోందని కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఎన్టీఆర్ భవన్ లో పార్టీ నేతలతో చర్చించిన టి.టీడీపీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్ ఈ మేరకు అభ్యర్థుల లిస్ట్ కూడా సిద్ధం చేశారని.. తెలంగాణలో 119 స్థానల్లోనూ 30 స్థానాలు వదిలేసి, మిగిలిన 89 నియోజకవర్గాల్లోనూ పోటీ చేయాలని టీడీపీ భావిస్తోందని కథనాలొచ్చిన సంగతి తెలిసిందే.
ఇదే సమయంలో... పోటీచేయాలని అనుకుంటున్న ఈ 89 స్థానాల కోసం ఏకంగా 189 మంది పోటీలో ఉన్నారని.. ఆ లిస్ట్ ను చంద్రబాబు ఫైనల్ చేయడమే తరువాయని.. అదే జరిగితే ఇక రంగంలోకి దిగడమే అని కథనాలొచ్చాయి. ఇదే సమయంలో తెలంగాణ టీడీపీకి నందమూరి బాలకృష్ణ స్టార్ క్యాంపైనర్ గా ఉంటారని.. అందుకే ఏపీలో ఓదార్పు యాత్ర భువనేశ్వరికి అప్పగించారని రకరకాల ఊహాగాణాలు వెలువడుతున్నాయి.
ఈ సమయంలో తెలంగాణ టీడీపీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ మారబోతున్నారని.. ఆయన త్వరలో కారెక్కబోతున్నారని కథనాలు రావడం స్టార్ట్ అయ్యింది. దీంతో ఈ విషయం అటు టీడీపీలోనూ ఇటు పొలిటికల్ సర్కిల్స్ లోనూ హాట్ టాపిక్ గా మరింది.
ముదిరాజ్ సామాజికవర్గమే లక్ష్యంగా కేసీఆర్ స్కెచ్?:
తెలంగాణలో అధికార బీఆరెస్స్ (ముదిరాజ్) ఆపరేషన్ ఆకర్ష కంటిన్యూ చేస్తుందని అంటున్నారు. ఇటీవల ఉద్యోగ సంఘాల నేత మామిళ్ల రాజేందర్ కు వీఆర్ఎస్ ఇచ్చి మరీ పార్టీలో చేర్చుకుంది. అదే సామాజికవర్గానికి చెందిన అంబర్ పేట్ శంకర్ కు కూడా కండువా కప్పేసింది! ఇదే సమయంలో ముదిరాజ్ సామాజికవర్గానికే చెందిన కళాకారుడు బిత్తిరి సత్తి అలియాస్ చేవెళ్ల రవికుమార్ త్వరలో బీఆరెస్స్ లో చేరేందుకు రంగం సిద్ధమైందని తెలుస్తుంది.
ఇదే సమయంలో ముదిరాజ్ సామాజికవర్గంతో పాటు తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన వారు బీఆరెస్స్ తో కలిసి పనిచేయాలని కేటీఆర్, హరీష్ కోరినట్లు తెలుస్తుంది. ఈ సమయంలో తెలంగాణలోని ముదిరాజ్ సామాజికవర్గంలో బలమైన నేతల్లో ఒకరైన కాసాని జ్ఞానేశ్వర్ కి కూడా బీఆరెస్స్ గాళం వేస్తుందనే కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో బలంగా వినిపిస్తున్నాయి. పైగా గత రెండు మూడు రోజులుగా ఈ చర్చ మరింత వైరల్ వుతుంది.
ఇందులో భాగంగా... చంద్రబాబుని నమ్ముకుంటే రాజకీయంగా భవిష్యత్ ఉండదని, అది ముగిసిన అధ్యాయమని, బీఆరెస్స్ లో చేరితే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ చేస్తున్నారని గాసిప్స్ హల్ చల్ చేస్తున్నాయి. అలా కానిపక్షంలో... మల్కాజ్ గిరీ ఎంపీ సీటు ఇవ్వడానికి అయినా అధికార పార్టీ సిద్ధంగా ఉందని కూడా కాసానికి ఆఫర్స్ వస్తున్నాయని కథనాలు హల్ చల్ చేస్తున్నాయి! దీంతో... ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
మరోపక్క కాంగ్రెస్ పార్టీ కూడా కాసానికి కబురు పంపించిందని అంటున్నారు. ఇందులో భాగంగా కాసాని కాంగ్రెస్ లో చేరితే ఆయనతో పాటు ఆయన సూచించిన మరొకరికి కూడా సీటు స్పాట్ లో కేటాయిస్తామని ఆఫర్ ఇచ్చారని చెబుతున్నారు. దీంతో... కాసాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది అసక్తిగా మారింది!
ఈ ఊహాగాణాలకు ఏమిటి కారణం?:
నిన్నమొన్నటివరకూ తెలంగాణ టీడీపీకి జవసత్వాలు తెచ్చి.. కాస్త గాడిలో పెడుతూ.. కచ్చితంగా ఈ ఎన్నికల్లో ఎంతో కొంత ప్రభావం చూపించేలా పనిచేస్తున్నారు అని పేరు సంపాదించుకున్న కాసాని జ్ఞానేశ్వర్ గురించి ఇలాంటి కథనాలు ఎందుకు వస్తున్నాయనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా ఉంది. అయితే అందుకు కారణం చంద్రబాబే అనే సమాధానం కూడా తదనుగుణంగా వెలువడుతుంది!
తెలంగాణలో కనీసం 89 స్థానాల్లో పోటీ చేయాలని కాసాని ఫిక్సయ్యారని అంటున్నారు. ఇందులో భాగంగా.. ఆయన పక్కాగా ప్లాన్ చేసుకుని, అభ్యర్థుల జాబితాను సిద్ధం చేశారని చెబుతున్నారు. అయితే... తెలంగాణలో పోటీకి టీడీపీ అధినేత చంద్రబాబు ఒప్పుకోలేదని ఊహాగాణాలు వెలువడుతున్నాయి.
ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక ఓటుకు తెలంగాణలో గట్టిపోటీ ఉన్నందున.. టీడీపీ పోటీ చేస్తే కాంగ్రెస్ కు నష్టం అని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. ఫలితంగా.. పరోక్షంగా రేవంత్ రెడ్డి మేలు కోరే బాబు ఈ నిర్ణయం తీసుకున్నారని కథనాలొస్తున్నాయి. దీంతో.. కాసాని హర్ట్ అయ్యారని.. మరో రెండు మూడు రోజుల్లో ఏదో ఒక కీలక నిర్ణయం తీసుకుంటారని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తుంది.
కొట్టిపారేస్తున్న కాసాని వీరేశం!:
తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పార్టీ మారుతున్నారని.. అతి త్వరలో ఆయన బీఆరెస్స్ లో చేరబోతున్నారని.. ఈ ఎన్నికల్లో టీడీపీ అసలు పోటీలో కూడా ఉండటం లేదని వస్తున్న వార్తల్లో నిజం లేదని... టీడీపీ రాష్ట్ర నాయకుడు కాసాని వీరేశం స్పందించారు! టీడీపీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇలాంటి వార్తలు పుట్టిస్తున్నారని చెప్పుకొచ్చారు!
అయితే.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని, ఇప్పటికే అభ్యర్థుల లిస్టును సైతం రెడీ చేశామని, చంద్రబాబు ఆమోదం ఒకటి రెండ్రోజుల్లో వస్తుందని ఈయన చెప్పడం గమనార్హం!