రెండు పార్టీల మధ్యే పోటీనా ?
తొందరలో జరగబోయే తెలంగాణా ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో పోటీ ప్రధానంగా బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యే జరగబోతోందని టాక్ పెరిగిపోతోంది.
By: Tupaki Desk | 20 Nov 2023 4:30 PM GMTతొందరలో జరగబోయే తెలంగాణా ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో పోటీ ప్రధానంగా బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యే జరగబోతోందని టాక్ పెరిగిపోతోంది. మొదట్లో బీజేపీ అభ్యర్థులు కూడా హడావిడి చేసినా తర్వాత నీరుగారిపోయారు. 119 నియోజకవర్గాల్లో ఎనిమిది చోట్ల మిత్రపక్షం జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మిగిలిన 111 చోట్ల బీజేపీ అభ్యర్ధులే పోటీ చేస్తున్నా చాలా నియోజకవర్గాల్లో పోటీలో ఉన్నామంటే ఉన్నామన్నట్లుగా మాత్రమే ఉంది పరిస్ధితి. ఎక్కడో కరీంనగర్లో బండి సంజయ్, హుజూరాబాద్, గజ్వేలులో ఈటల రాజేందర్, దుబ్బాకలో రఘునందనరావు, కామారెడ్డిలో వెంకటరమణారెడ్డి లాంటి వాళ్ళు పోటీచేస్తున్న కొన్ని నియోజకవర్గాల్లో మాత్రమే పోటీ కనబడుతోంది.
ఈ నేపధ్యంలోనే చాలా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య డైరెక్టు ఫైట్ పెరిగిపోతోందని సమాచారం. ఈ నియోజకవర్గాలు కూడా ఎక్కువగా ఉమ్మడి జిల్లాలు నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. వీటిల్లో త్రిముఖ పోటీ జరుగుతున్న నియోజకవర్గాలు చాలా తక్కువనే చెప్పాలి. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్ అత్యధిక నియోజకవర్గాలు గెలుచుకుంటుందనే ప్రచారం పెరిగిపోతోంది. ఇదే సమయంలో ఆదిలాబాద్, మహబూబ్ నగర్, మెదక్, వరంగల్ జిల్లాల్లో బీఆర్ఎస్ మెజారిటీ సీట్లు గెలుకుకుంటుందని సమాచారం.
అంటే ఉత్తర తెలంగాణాలోని ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల్లో బీఆర్ఎస్ కు ఎక్కువ అవకాశాలున్నాయి. అలాగే దక్షిణ తెలంగాణాలోని నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు ఎక్కువగా గెలుస్తారని ప్రచారం తెలిసిందే. ఇక మిగిలింది హైదరాబాద్ జిల్లా మాత్రమే. దీనిలో మిక్స్ డు అంచనాలున్నాయి. కాకపోతే బీఆర్ఎస్ కు మెజారిటి సీట్లు దక్కే అవకాశాలున్నాయట.
బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య జిల్లాల్లో విభజన కారణంగానే మధ్యలో బీజేపీ చేతులెత్తేసింది. బీఆర్ఎస్ కు పట్టున్న జిల్లాల్లో ఎన్నిసీట్లు గెలుకుంటుంది ? కాంగ్రెస్ కు పట్టున్న జిల్లాల్లో ఎన్నిసీట్లు గెలుకుంటుందన్నది కీలకమైనది. రెండు పార్టీలకు ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవి కావటంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్ధులు తమ శక్తిమేరకు పోరాడుతున్నారు. అందుకనే చాలా నియోజకవర్గాల్లో ఈ రెండుపార్టీల మధ్య పోటీ హోరాహోరీగా జరుగుతోంది.