వీరెంత లక్కీ గురూ..మినిస్టర్ బెర్తులు కన్ ఫర్మ్ !?
ఇలా రెండు పార్టీలలో కూడా గెలుపు పోటలు పక్కన పెట్టి మరీ మంత్రులు అయ్యే లక్కీ వీరికే ఉంది అంటున్నారు.
By: Tupaki Desk | 20 May 2024 3:47 AM GMTఏపీలో కొందరు నాయకుల హవా అలా ఉంటుంది. వారికి గెలుపు ఓటములతో సంబంధం లేదు. అదే విధంగా వారు ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరమూ లేదు. అవన్నీ లాంచనమే. వారు ఉంటున్న పార్టీ అధికారంలోకి వస్తే చాలు వారు అలా మంత్రులు అయిపోతారు. ఇదంతా జస్ట్ సింపుల్ గా జరిగిపోతుంది. దానికి కారణం అధినేతలతో వారికి ఉన్న సాన్నిహిత్యం. అలాగే వారికి ఉన్న రాజకీయ పట్టు అవసరం ఇత్యాది కారణాలు వల్లనే ఇలా జరుగుతుంది అని అంటున్నారు.
ముందుగా అధికార వైసీపీ గురించే మాట్లాడుకుంటే రేపటి రోజున అన్నీ కలసి వచ్చి వైసీపీ రెండోమారు అధికారం చేపడితే కొందరికి కచ్చితంగా మంత్రి పదవులు ఖాయమని అంటున్నారు. ఆ లిస్ట్ లో ఫస్ట్ పేరు వంగా గీత. ఆమె పిఠాపురంలో జనసేన అధినేత పవన్ మీద పోటీ చేస్తున్నారు.
ఆమె గెలిస్తే ఎటూ డిప్యూటీ సీఎం పదవిని జగన్ ఆఫర్ చేసి ఉన్నారు. ఒకవేళ ఆమె ఓడి వైసీపీ పవర్ లోకి వచ్చినా ఆమెకు అదే పదవిని జగన్ ఇస్తారు అని అంటున్నారు. అంటే ఆమెను ఎమ్మెల్సీ చేసి అయినా ఆ పదవి కట్టబెడతారు అని అంటున్నారు. దానికి కారణం పిఠాపురంలో పవన్ హవాను అడ్డుకోవడం కోసం అని అంటున్నారు. అంతే కాకుండా తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాను అని జనాలకు చెప్పుకోవడం కోసం అని అంటున్నారు.
ఇక ఉమ్మడి క్రిష్ణా జిల్లాలో ఇద్దరు నానీలకు జగన్ మంత్రి పదవులు రెడీ చేసి ఉంచారు అని అంటున్నారు. అందులో ఒకరు కొడాలి నాని. గుడివాడలో ఈసారి ఆయనకు గెలుపు రేఖలు ఎలా ఉన్నాయన్నది చర్చకు వస్తోంది. ఒకవేళ సీన్ రివర్స్ అయి ఆయన ఓటమి పాలు అయినా ఎమ్మెల్సీ ఇచ్చి అయినా కొడాలి నానిని జగన్ మినిస్టర్ గా తీసుకుంటారు అని అంటున్నారు. బలమైన కమ్మ సామాజిక వర్గం నుంచి నాని జగన్ కి ఫుల్ సపోర్ట్ గా ఉన్నారు.
ఆ జిల్లా రాజకీయ సామాజిక సమీకరణల వల్ల ఆయన అవసరం ఉంది అని అంటున్నారు. ఇక పేర్ని నానికి కూడా బెర్త్ కన్ ఫర్మ్ అని అంటున్నారు. ఆయన ఈసారి పోటీ చేయలేదు. కుమారుడిని పోటీకి పెట్టారు. కొడుకు గెలిచినా ఓడినా పేర్నికి మంత్రి పదవి ఇచ్చి బలమైన సామాజిక వర్గం నుంచి పార్టీ ప్రభుత్వ గొంతుకగా ఆయన్ని ఉంచుకుంటారు అని అంటున్నారు. అదే విధంగా చూస్తే విడదల రజనీకి బీసీ సామాజిక వర్గం నుంచి గుంటూరు జిల్లాలో తప్పక మరోసారి మంత్రి పదవి దక్కుతుందని అంటున్నారు.
ఇక టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే టీడీపీ నుంచి తునికి చెందిన సీనియర్ నేత ప్రస్తుత ఎమ్మెల్సీఎ సీనియర్ మోస్ట్ నేత అయిన యనమల రామక్రిష్ణుడికి ఆర్ధిక మంత్రి పదవి రిజర్వ్ చేసి ఉంచారు అని అంటున్నారు. ఆయనను మించిన ఆర్ధిక మంత్రి కూడా ఎవరూ లేరు అని ఆయనకే ఆ బాధ్యత అని అంటున్నారు.
అదే విధంగా నారా లోకేష్ మంగళగిరిలో గెలుపు గుర్రం మీద ఉన్నట్లుగా అంచనాలు ఉన్నాయి. ఒకవేళ ఆయన పరిస్థితి ప్రతికూలంగా మారి ఓటమి పాలు అయినా కూడా బాబు మంత్రి వర్గంలో కచ్చితంగా మంత్రిగా ఆయనను తీసుకుని కీలక శాఖలు అప్పగిస్తారు అని అంటున్నారు.
ఇక పిఠాపురంలో చూస్తే పవన్ కోసం తన సీటునే త్యాగం చేసి జనసేనను గెలిపించేందుకు విశేష కృషి చేసిన వర్మకు కూడా ఎమ్మెల్సీ ఇచ్చి మరీ మంత్రిగా చేయడానికి టీడీపీ అధినాయకత్వం సిద్ధంగా ఉందని అంటున్నారు. అలాగే ఉత్తరాంధ్రా నుంచి అచ్చెన్నాయుడుకు కూడా బెర్త్ కన్ ఫర్మ్ అని అంటున్నారు. ఇలా రెండు పార్టీలలో కూడా గెలుపు పోటలు పక్కన పెట్టి మరీ మంత్రులు అయ్యే లక్కీ వీరికే ఉంది అంటున్నారు.