ఏఐ ఎఫెక్ట్ : భారత్‌లో 2 వేల ఉద్యోగాలు హాంఫట్.. అమెరికా సంస్థ సంచలన నిర్ణయం
దీనిలో భారతీయ ఉద్యోగులు కూడా.. రెండు వేల మంది ఉన్నారని సమాచారం.
By: Tupaki Desk | 16 Feb 2024 1:30 AM GMTమొన్న కరోనా.. నిన్న ఆర్థిక మాంద్యం.. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(ఏఐ).. ఇలా కారణం ఏదైనా .. ఐటీ ఉద్యోగుల నెత్తిపై కత్తి వేలాడింది. దీంతో వారు ఎన్నో ఆశలతో సంపాయించుకున్న ఉద్యోగాలు మూడునాళ్ల ముచ్చటగానే మారుతున్నాయి. తాజాగా ఏఐ ప్రవేశం కారణంగా.. కీలకమైన, ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన `సిస్కో సిస్టమ్స్` సంస్త.. ఏకంగా 4 వేల మంది ఉద్యోగులకు లేఆఫ్ ప్రకటించింది. దీనిలో భారతీయ ఉద్యోగులు కూడా.. రెండు వేల మంది ఉన్నారని సమాచారం.
ఏం జరిగింది?
అమెరికాకు చెందిన ప్రముఖ నెట్‌వర్కింగ్ సంస్థ సిస్కో. సంస్త కంప్యూటర్ నెట్‌వర్కింగ్ ఎక్విప్‌మెంట్‌ల ను తయారుచేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సంస్థకు బ్రాంచీలు ఉన్నాయి. ఈ సిస్కో సంస్థలో 85 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దీనిలో 5 శాతం ఉద్యోగులను తొలగించాలని కంపెనీ తాజాగా నిర్ణ యించింది. టెల్కో, కేబుల్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి ఆశించిన స్థాయి డిమాండ్ లేకపోవడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దీంతో సుమారు 4 వేల మంది ఇంటి ముఖం పట్టనున్నారు.
అసలు కారణం ఇదీ..
అయితే.. సిస్కో కంపెనీ నిర్ణయం వెనుక.. ఏఐ ఉందని అంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు సంస్థలు దృష్టి పెడుతున్న నేపథ్యంలో ఎన్‌విడియాతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం.