రేప్ కేసులో అబార్షన్లకు ఓకే.. యూఏఈ సంచలన నిర్ణయం..
మహిళల కట్టుబాట్లకు, కఠిన చట్టాలకు పేరుమోసిన అరబ్ దేశాలు క్రమంగా మారుతున్నాయి
By: Tupaki Desk | 21 Jun 2024 4:30 PM GMTమహిళల కట్టుబాట్లకు, కఠిన చట్టాలకు పేరుమోసిన అరబ్ దేశాలు క్రమంగా మారుతున్నాయి. డ్రైవర్లుగా పనిచేసే అవకాశంతో పాటు అంతరిక్ష ప్రయాణంలోనూ వారికి చోటిస్తున్నాయి. ఇప్పటికే సౌదీ అరేబియా పర్యటకులకు ఆకర్షించేందుకు పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కూడా అదే బాటలో నడిచింది.
కఠిన బంధనాల నుంచి..
అరబ్ దేశాలంటే మహిళలకు కఠిన నిబంధనలు విధించేవి గానే గుర్తొస్తాయి. సంప్రదాయానికి వారు ఇచ్చే విలువగానే దీనిని చూడాలి. అయితే, ఇప్పుడు కాలంతో పాటు కొంత మారుతున్నారు. యూఏఈ అయితే, మహిళల హక్కులు, సాధికారత కోసం సంస్కరణలు తీసుకొస్తోంది.
తాజాగా అబార్షన్ పై యూఏఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అత్యాచారం, అక్రమ సంబంధం వంటి కేసుల్లో అబార్షన్లకు అనుమతిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. దీనిప్రకారం.. మహిళలు.. అత్యాచారం లేదా వివాహేతర సంబంధం కారణంగా గర్భం దాల్చితే దానిని తొలగించుకోవచ్చు. అయితే, గర్భం దాల్చిన విషయాన్ని బాధితులు తక్షణమే అధికారులకు ఫిర్యాదు చేయాలి. దాన్ని నిరూపించే నివేదికను పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుంచి తీసుకోవాలి.
120 రోజుల్లోపు..
బాధితుల గర్బ విచ్ఛిత్తికి అనుమతి ఇచ్చినా.. మహిళల ఆరోగ్యం రీత్యా 120 రోజుల వ్యవధి విధించారు. ఆలోపు గర్భాన్ని మాత్రమే తొలగించేందుకు అనుమతి ఇస్తారు. ఇది కూడా మహిళ ప్రాణానికి ముప్పు రాదని నిర్ధరించిన తర్వాతే. స్థానికతనూ కూడా దీనికి జోడించారు. యూఏఈలో కనీసం సంవత్సరం నుంచి నివాసం ఉంటున్న మహిళలకు మాత్రమే కొత్త నిబంధనలు వర్తిస్తాయి.
కఠిన చట్టాలున్నా..
అత్యాచారం, అక్రమ సంబంధం కేసుల్లో నిందితులను శిక్షించేందుకు యూఏఈలో అనేక చట్టాలున్నాయి. కానీ, గర్భధారణ సమస్యను పరిష్కరించేందుకు చట్టాలు లేవు. ఇప్పుడున్న చట్టాల ప్రకారం.. అత్యాచార కేసుల్లో నేరం నిరూపణ అయితే.. నిందితుడికి జీవిత ఖైదు విధిస్తారు. బాధితురాలు 18 ఏళ్లలోపు అమ్మాయి లేదా దివ్యాంగురాలైతే నిందితులకు ఏకంగా మరణశిక్షనే విధిస్తున్నారు.