ఉబర్ ఇండియాకు రూ.54వేల ఫైన్.. ఎందుకో తెలుసా?
దీనికి ఫలితంగా వినియోగదారుల కోర్టు ఫిర్యాదుదారుకు ఊరట కలిగించే ఆదేశాల్ని జారీ చేశారు.
By: Tupaki Desk | 5 Jan 2025 6:15 AM GMTఉబర్ ఇండియాకు వినియోగదారుల కోర్టు ఫైన్ షాకిచ్చింది. వినియోగదారులకు అందించాల్సిన సేవల్లో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించినందుకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ తరహాలో నిత్యం పలువురికి సమస్యలు ఎదురవుతున్నా.. చాలామంది పట్టించుకోరు. కానీ.. అందుకు భిన్నంగా ఒకరు మాత్రం ఈ ఇష్యూను సీరియస్ గా తీసుకున్నారు. దీనికి ఫలితంగా వినియోగదారుల కోర్టు ఫిర్యాదుదారుకు ఊరట కలిగించే ఆదేశాల్ని జారీ చేశారు. అసలేం జరిగిందంటే..
సౌత్ ఢిల్లీకి చెందిన ఒక డాక్టర్ 2021 నవంబరు 29న ఇండోర్ వెళ్లేందుకు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకున్నారు. ఉదయం 3.15 గంటలకు ఎయిర్ పోర్టు వెళ్లేందుకు ఉబర్ క్యాబ్ బుక్ చేసుకున్నారు. ఎంతసేపటికి క్యాబ్ రాకపోవటంతో డ్రైవర్ కు ఫోన్ చేశారు. కానీ.. డ్రైవర్ రియాక్టు కాలేదు. దీంతో ఉబర్ కస్టమర్ కేర్ కు కంప్లైంట్ చేసినా ఫలితం లేకపోయింది.
దీంతో మరో క్యాబ్ బుక్ చేసుకొని ఎయిర్ పోర్టుకు చేరుకోగా.. అప్పటికే ఫ్లైట్ వెళ్లిపోయింది. దీంతో తనకు జరిగిన నష్టం గురించి వినియోగదారుల కోర్టులో కేసు వేశారు. దీనిపై విచారణ చేసిన కోర్టు.. ఉబర్ ఇండియాకు రూ.54 వేలు జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరో ఫ్లైట్ టికెట్ కోసం పెట్టిన రూ.24 వేలు.. మానసిక క్షోభకు గురి చేసినందుకు రూ.30 వేలుచెల్లించాలని ఉబర్ ను ఆదేశించింది. ఈ తరహాలో క్యాబ్ ఆపరేటర్ల కారణంగా చేదు అనుభవాలు ఎదురైతే.. ఎవరికి వారు బాధపడే కన్నా వినియోగదారుల కోర్టును ఆశ్రయించటం మంచిది.