రూ.2718 కోట్లు కట్టండి.. ఉబెర్ కు ఆ దేశ కోర్టు దిమ్మ తిరిగే షాక్!
అమెరికాకు చెందిన ఈ సంస్థపై తాజాగా నెదర్లాండ్స్ కు చెందిన కోర్టు ఒకటి భారీ ఎత్తున జరిమానా విధించింది.
By: Tupaki Desk | 27 Aug 2024 4:08 AM GMTఉబెర్ కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యే సీన్ ఒకటి ఎదురైంది. అమెరికాకు చెందిన ఈ సంస్థపై తాజాగా నెదర్లాండ్స్ కు చెందిన కోర్టు ఒకటి భారీ ఎత్తున జరిమానా విధించింది. దాని విలువ అక్షరాల మన రూపాయిల్లో రూ.2718 కోట్లు. ఇంత భారీ జరిమానాను ఉబెర్ కు ఎందుకు విధించింది? అంత పెద్ద తప్పు ఏం చేసింది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఉబెర్ మీద ఇంత భారీ ఫైన్ కు కారణం డ్రైవర్ సమాచారాన్ని రక్షించటంలో ఉబెర్ ఫెయిల్ అయ్యిందని.. డ్రైవర్ సమాచారాన్ని చేరవేయటం యూరోపియన్ యూనియన్ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ ప్రకారం తీవ్రమైన ఉల్లంఘనగా పేర్కొన్నారు.
అమెరికాకు బదిలీ చేసిన సమాచారానికి (డేటా) సంబంధించి జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ ప్రకారం తీవ్రమైన ఉల్లంఘనగా పేర్కొంటున్నారు. ఇలాంటి డేటాను బదిలీ చేసే సమయంలో పాటించాల్సిన నిబంధనల్ని ఉబెర్ పాటించలేదని.. ఇది తీవ్రమైన తప్పుగా పేర్కొంటున్నారు. అంతేకాదు.. యూరోపియన్ డ్రైవర్లకు సంబంధించిన టాక్సీ లైసెన్స్ లు.. లొకేషన్ డేటా.. ఫోటోలు.. చెల్లింపు వివరాలు.. గుర్తింపు పత్రాలు కూడా సేకరించటాన్ని తప్పు పట్టింది.
కొన్ని సందర్భాల్లో డ్రైవర్ల క్రిమినల్.. మెడికల్ డేటాను సైతం ఉబెర్ సేకరించిందని.. వీటికి సంబంధించిన సరైన నిబంధనలు పాటించకుండా రెండేళ్ల వ్యవధిలో ఉబెర్ ఈ సమాచారాన్ని అమెరికాలోని తమ హెడ్డాఫీసుకు చేరవేసినట్లుగా ఆరోపించింది. కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఉబెర్ స్పందించింది. ఈ ఫైన్ పై అప్పీలు చేస్తామని చెప్పింది. సదరు నిర్ణయం తప్పని.. అసాధారణ జరిమానా పూర్తిగా అన్యాయమైనదిగా ఉబెర్ చెబుతోంది. మన దగ్గర డేటా విషయంలో పెద్దగా పట్టింపులు ఉండవు కానీ.. పశ్చిమ దేశాలు మరింత కచ్ఛితంగా ఉంటాయన్న మాటను చెబుతున్నారు. మొత్తంగా ఉబెర్ కు తాజా పరిణామం షాకిచ్చేదిగా అభివర్ణిస్తున్నారు. మున్ముందు ఏం జరుగుతుందన్నది చూడాలి.