Begin typing your search above and press return to search.

హీరో, మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. కోర్టు సంచలన తీర్పు!

అయితే ఇంత జరిగినా ఉదయనిధి ఏం పట్టించుకోలేదు. పైగా తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పబోనన్నారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మరోసారి ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

By:  Tupaki Desk   |   25 Jun 2024 9:19 AM GMT
హీరో, మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. కోర్టు సంచలన తీర్పు!
X

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్‌ కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి, ప్రముఖ హీరో అయిన ఉదయనిధి చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. గతంలో సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూ, చికెన్‌ గున్యాలతో పోల్చి ఉదయనిధి స్టాలిన్‌ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఆయనపై పార్టీలకతీతంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. పలు రాష్ట్రాల్లో ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ లు కూడా దాఖలయ్యాయి. సుప్రీంకోర్టు సైతం మంత్రిగా ఉంటూ ఇవేం వ్యాఖ్యలని తలంటింది. ఉదయనిధి తల తెస్తే రూ.కోటి ఇస్తానంటూ అయోధ్య స్వామిజీ ఒకరు చేసిన ప్రకటన కాక రేపింది.

అయితే ఇంత జరిగినా ఉదయనిధి ఏం పట్టించుకోలేదు. పైగా తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పబోనన్నారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మరోసారి ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లోక్‌ సభ ఎన్నికల ప్రచారాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీపై మండిపడ్డారు.

తమిళనాడులోని రామనాథపురం, తేనిలలో జరిగిన ప్రచార సభల్లో ఉదయనిధి మాట్లాడుతూ మోదీ 28 పైసల ప్రధాని అని సెటైర్లు వేశారు.

కేంద్ర పన్నుల వాటాలో తమిళనాడు నుంచి వెళ్లే ప్రతి రూపాయిలో తిరిగి 28 పైసలు మాత్రమే కేంద్రం ఇస్తోందని ధ్వజమెత్తారు. ఇందుకే తాను ప్రధానిని 28 పైసల ప్రధాని అని విమర్శిస్తున్నానన్నారు. ఎన్నికలున్నప్పుడే తమిళనాడుకు ప్రధాని వస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా సనాతన ధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యల విషయంలో బెంగళూరు కోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. ఆయనకు న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచీకత్తుతో బెయిల్‌ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.

సనాతనధర్మంపై ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై సామాజిక కార్యకర్త పరమేష్‌ బెంగళూరు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. మంత్రిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో ఉదయనిధికి బెంగళూరు కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్‌ బెంగళూరు కోర్టు ముందు హాజరయ్యారు. లక్ష రూపాయల పూచీకత్తుతో 42వ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌.. ఉదయనిధి స్టాలిన్‌ కు బెయిల్‌ మంజూరు చేశారు. తదుపరి విచారణను కోర్టు ఆగస్టు 8కి వాయిదా వేశారు.

2023 సెప్టెంబరులో చెన్నైలో జరిగిన ఒక సమావేశంలో ఉదయనిధి మాట్లాడుతూ సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సామాజిక న్యాయం సమానత్వానికి సనాతన ధర్మం విరుద్ధమన్నారు. అంతేకాకుండా మలేరియా, డెంగ్యూలను నిర్మూలించినట్టే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్నారు.