కొడుకుని డిప్యూటీ సీఎంను చేస్తున్న ముఖ్యమంత్రి!
దేశంలో తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ విభిన్నమే. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో డీఎంకే అధికారంలో ఉంది.
By: Tupaki Desk | 9 Jan 2024 7:13 AM GMTదేశంలో తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ విభిన్నమే. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో డీఎంకే అధికారంలో ఉంది. ఆ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరోవైపు ఆయన తనయుడు, ప్రముఖ సినీ నటుడు అయిన ఉదయనిధి స్టాలిన్ క్రీడా యువజన, సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయనిధి స్టాలిన్.. చెన్నై నగర పరిధిలోని చెపాక్ – తిరువల్లికేని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
డీఎంకే తరఫున వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ ఉదయనిధి స్టాలిన్ నాయకుడిగా ఎదుగుతున్నారు. తన తాత కరుణానిధిలానే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ముందుంటున్నారు. ఇటీవల సనాతన ధర్మంపైన ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారానికి దారితీశాయి. సనాతన ధర్మం ఎయిడ్స్, డెంగ్యూ, మలేరియా కంటే ప్రమాదకరమైంది అంటూ ఉదయనిధి పెద్ద కలకలమే సృష్టించారు.
ఈ నేపథ్యంలో ఉదయనిధి వ్యాఖ్యలపై పలు పార్టీల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యకు చెందిన స్వామీజీ ఒకరు ఉదయనిధి తల తెచ్చి తనకిస్తే రూ.10 కోట్లు ఇస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉదయనిధి వ్యాఖ్యలపై పలు రాష్ట్రాల్లోని పోలీస్ స్టేషన్ లలో కేసులు కూడా నమోదయ్యాయి. మరోవైపు ఉదయనిధి ఎక్కడా తగ్గలేదు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేది లేదని, క్షమాపణ చెప్పబోనని తేల్చిచెప్పారు.
కాగా ప్రస్తుతం క్రీడా మంత్రిగా ఉన్న తన కుమారుడిని డిప్యూటీ సీఎంను చేయాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
వచ్చే నెల ఫిబ్రవరిలో స్టాలిన్ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో తన బాధ్యతలను ఎవరికో ఒకరికి ఇచ్చి వెళ్లాల్సి ఉంది. ఈ క్రమంలో తన కుమారుడు ఉదయనిధికి డిప్యూటీ సీఎం హోదా కల్పించనున్నారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయిు. జనవరి 21న సేలంలో జరగనున్న పార్టీ యూత్ వింగ్ సమావేశం తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నాయి.
కాగా ఉదయనిధి పార్టీలో చాలా చురుకుగా ఉంటారని డీఎంకే ఆర్గనైజేషనల్ సెక్రటరీ ఎళంగోవన్ తెలిపారు. ఆయనకు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వడంలో ఎలాంటి తప్పులేదని చెప్పారు.
మరోవైపు ఉదయనిధిని ఉప ముఖ్యమంత్రిగా చేస్తున్నారనే వార్తలపై ప్రతిపక్ష అన్నాడీఎంకే తీవ్ర విమర్శలు చేసింది. ఉదయనిధికి ఎన్నికల్లో టికెట్ ఇచ్చారు.. ఆ తర్వాత మంత్రిగా అవకాశం ఇచ్చారని గుర్తు చేసింది. ఇప్పుడు ఏకంగా ఉపముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తున్నారని మండిపడింది.
ఇక 2026లో ఉదయనిధిని ముఖ్యమంత్రిని కూడా చేయాలనుకుంటారని అన్నాడీఎంకే ఎద్దేవా చేసింది. డీఎంకే కుటుంబ పార్టీ అని.. ఒకే కుటుంబం ఆ పార్టీలో వేళ్లూనుకుందని విమర్శించింది. కరుణానిధి, ఆయన కుమారులు అళగరి, ఎంకే స్టాలిన్, మేనల్లుడు మరసోలి మారన్, మనుమడు దయానిధి మారన్, కుమార్తె కనిమొళి... ఇలా డీఎంకే అంతా కరుణానిధి కుటుంబ సభ్యులే హవా చెలాయిస్తున్నారని విమర్శించింది. వీరు చాలరన్నట్టు ఇప్పుడు మళ్లీ స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనుకోవడం సిగ్గుచేటని మండిపడింది.