మరో సంచలనం.. ఆ హీరోని చెప్పుతో కొడితే రూ.10 లక్షలు!
ఈ నేపథ్యంలో ఉదయనిధి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు, హిందూ సంస్థలు, సంఘాలు, పీఠాధిపతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు
By: Tupaki Desk | 7 Sep 2023 8:21 AM GMTతమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ వ్యవహారం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు. ఒకరికి పోటీగా మరొకరు సంచలన ప్రకటనలు చేస్తున్నారు.
సనాతన ధర్మం.. డెంగ్యూ, మలేరియా, కరోనా లాంటిదని.. దాన్ని నియంత్రించడం కాకుండా నిర్మూలించాలంటూ డీఎంకే ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉన్న ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు దేశంలో తీవ్ర దుమారానికి కారణమయ్యాయి.
ఈ నేపథ్యంలో ఉదయనిధి వ్యాఖ్యలపై బీజేపీ నేతలు, హిందూ సంస్థలు, సంఘాలు, పీఠాధిపతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యకు చెందిన పరంధాస్ ఆచార్య అనే స్వామిజీ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ తల నరికి తనకు తెచ్చి ఇస్తే రూ. 10 కోట్లు ఇస్తానని కలకలం రేపారు. ఈ సందర్భంగా ఒక చేతిలో ఉదయనిధి ఫోటో, మరో చేతిలో అతడి తలను నరుకుతున్న వీడియోను స్వామజీ పరంధాస్ ఆచార్య చూపించారు. ఈ పని మీరు త్వరగా చేస్తే రూ. 10 కోట్లు ఇస్తాను అంటూ పేర్కొన్నారు.
ఈ వివాదం కొనసాగుతుండగానే తమిళనాడులోని నామ్ తమిళర్ కట్చి సమన్వయకర్త సీమాన్ కూడా తగ్గేదే లే అంటూ ఆయన కూడా రంగంలోకి దిగారు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలన్న మంత్రి ఉదయనిధి స్టాలిన్ తలకు రూ.10 కోట్లు ప్రకటించిన అయోధ్య సాధువు తల తెచ్చిచ్చేవారికి రూ.100 కోట్లు అందిస్తామని సీమాన్ సంచలన ప్రకటన చేశారు. దీంతో వివాదం ఇంకా పెద్దదైంది.
మళ్లీ ఇంతలోనే ఉదయనిధిని చెప్పుతో కొట్టినవారికి రూ.10 లక్షలు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ లో ఒక సంస్థ ప్రకటించింది. ఈ మేరకు జనజాగరణ సమితి వెల్లడించింది. ఇందుకు సంబంధించిన బ్యానర్లు ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో కలకలం రేపాయి. ఈ బ్యానర్ లో ఉదయనిధి ఫొటోతోపాటు అతడి ముఖంపై చెప్పు కూడా ఉండటం గమనార్హం.
'సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని బలుపెక్కి మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్ ను చెప్పుతో కొట్టినవారికి రూ.10 లక్షల నగదు బహుమతి ఇవ్వబడును' అని ఆ బ్యానర్ లో రాసి ఉంది. బ్యానర్ కింద 'జనజాగరణ సమితి' అనే పేరుతోపాటు ఒక మొబైల్ నంబర్ కూడా రాసి ఉంది. ఇప్పుడీ అంశం హాట్ టాపిక్ గా మారింది.
మరోవైపు ఇంత వివాదం రేగుతున్నా ఉదయనిధి మాత్రం తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పబోనని ప్రకటించారు. తాను కులవివక్షకు కారణమవుతున్న సనాతన ధర్మాన్ని మాత్రమే నిర్మూలించాలని చెబుతున్నానని తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. హిందూ మతంపై తానెలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు.