నరేంద్ర మోదీ.. 28 పైసల పీఎం!
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి అయిన ఉదయనిధి చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి
By: Tupaki Desk | 24 March 2024 7:30 AM GMTతమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి అయిన ఉదయనిధి చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఇటీవల సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యాలతో పోల్చి ఉదయనిధి స్టాలిన్ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆయనపై పార్టీలకతీతంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. పలు రాష్ట్రాల్లో ఆయనపై ఎఫ్‌ఐఆర్ లు కూడా దాఖలయ్యాయి. సుప్రీంకోర్టు సైతం మంత్రిగా ఉంటూ ఇవేం వ్యాఖ్యలని తలంటింది. ఉదయనిధి తల తెస్తే రూ.కోటి ఇస్తానంటూ అయోధ్య స్వామిజీ ఒకరు చేసిన ప్రకటన కాక రేపింది.
అయితే ఇంత జరిగినా ఉదయనిధి ఏం పట్టించుకోలేదు. పైగా తన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పబోనన్నారు. తాజాగా మరోసారి ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా లోక్ సభ ఎన్నికల ప్రచారాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీపై మండిపడ్డారు.
తమిళనాడులోని రామనాథపురం, తేనిలలో జరిగిన ప్రచార సభల్లో ఉదయనిధి మాట్లాడుతూ మోదీ 28 పైసల ప్రధాని అని సెటైర్లు వేశారు.
కేంద్ర పన్నుల వాటాలో తమిళనాడు నుంచి వెళ్లే ప్రతి రూపాయిలో తిరిగి 28 పైసలు మాత్రమే కేంద్రం ఇస్తోందని ధ్వజమెత్తారు. ఇందుకే తాను ప్రధానిని 28 పైసల ప్రధాని అని విమర్శిస్తున్నానన్నారు. ఎన్నికలున్నప్పుడే తమిళనాడుకు ప్రధాని వస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మధురైలో ఎయిమ్స్ నిర్మాణం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉందని ఉదయనిధి స్టాలిన్ మండిపడ్డారు. జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ) తీసుకువచ్చి తమిళనాడు విద్యార్థుల భవిష్యత్తును కేంద్రం నాశనం చేస్తోందని ఫైర్ అయ్యారు. నీట్ పై నిషేధంతో పాటు ప్రతి అంశంలోనూ తమిళనాడుపై ప్రధాని మోదీ వివక్ష చూపుతున్నారని విమర్శించారు.
ఈ నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. ఆయన ప్రధానిపై చేసిన తాజా వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. కాగా, తమిళనాడులోని 39 ఎంపీ సీట్లకు గాను ఏప్రిల్ 19న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.