ఉగాది ముహూర్తం.. ఆ రెండు చేయని చంద్రబాబు!
మరో రెండు విషయాల్లో ఉగాది నుంచి అమలు అవుతాయని చూసిన వారు నిరాశ చెందుతున్నారు.
By: Tupaki Desk | 29 March 2025 10:30 AMఏపీలో ఉగాది ఉత్సవాలను ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం పక్కనే ఉగాది ఉత్సవాల నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు గేమ్ ఛేంజర్ గా చెబుతున్న పీ4 పథకం ఉగాది నుంచే అమలు చేయనుంది. సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్న పది శాతం మంది అట్టడుగు వర్గాల్లో 20 శాతం మందిని దత్తత తీసుకోవాలనేది ఈ స్కీం ఉద్దేశం. ప్రభుత్వానికి పెద్దగా ఖర్చు కాకుండా, సీఎస్ఆర్ నిధుల నుంచి పేదల ఆర్థిక పురోగతికి ఆసరాగా నిలవడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. అయితే ఈ పథకం ఎంతవరకు సక్సెస్ అవుతుందని ఉత్కంఠ రేపుతుండగా, మరో రెండు విషయాల్లో ఉగాది నుంచి అమలు అవుతాయని చూసిన వారు నిరాశ చెందుతున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాడానికి ప్రధాన కారణమైన సూపర్ సిక్స్ హామీల్లో అత్యంత కీలకమైనది మహిళలకు ఉచిత ప్రయాణం. ఈ ఉగాది నుంచే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అందుబాటులోకి వస్తుందని సంక్రాంతికి ముందు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి. కానీ, ఈ ఉగాది సంబరాల్లో ఈ పథకం ఊసే వినిపించడం లేదని అంటున్నారు. ఇప్పటికే ఢిల్లీ, తెలంగాణ, కర్ణాటక, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో అమలు అవుతున్న ఈ పథకంపై ఏపీ అధికారులు అధ్యయనం చేశారు. రాష్ట్రంలో ఏ విధంగా అమలు చేస్తే ఫలితాలు ఉంటాయనేది నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక సమర్పించి చాలా కాలమవుతున్న ప్రభుత్వం మాత్రం ఉచిత ప్రయాణంపై పెదవి విప్పలేదని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
తెలుగు వారి నూతన ఏడాది ఉగాది సందర్భంగా కొత్త కార్యక్రమాలు చేయడం ఆచారంగా వస్తుంది. కూటమి ప్రభుత్వం కూడా ఉగాది పర్వదినాన్ని బాగా సెలబ్రేట్ చేస్తుందని ప్రజలు ఆశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాధాన్యమిస్తున్న పీ4 స్కీమ్ ఇందుకోసమే ప్రారంభిస్తున్నారు. అయితే చంద్రబాబు నాలుగో సారి సీఎం అవ్వడానికి తారకమంత్రంగా పనిచేసిన మహిళలకు ఇచ్చిన హామీని నెరవేర్చకపోవడంపై నిరాశ వ్యక్తమవుతోందని అంటున్నారు.
ఇక కూటమి అధికారంలోకి రాడానికి ప్రధాన పాత్ర పోషించిన జనసేన విషయంలోనూ ఉగాదికి అమలు చేస్తామన్న ఓ హామీ నెరవేరలేదని చర్చ జరుగుతోంది. జనసేన నుంచి ప్రస్తుతం 21 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ముగ్గురు మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక అధికారంలోకి వచ్చాక జనసేనకు రెండు ఎమ్మెల్సీలు ఇచ్చారు. జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే నాగబాబును మంత్రిగా తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. సంక్రాంతికి ముందే ఈ ప్రకటన చేసినా, అప్పట్లో నాగబాబు చట్టసభలో సభ్యుడు కాకపోవడంతో ఇంతవరకు పెండింగు పెట్టారు. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ అవ్వడంతో మంత్రి పదవికి లైన్ క్లియర్ అయినట్లేనని భావించారు. ఈ ఉగాదికి మంచి ముమూర్తం ఉందని మంత్రివర్గాన్ని విస్తరించి నాగబాబును మంత్రిని చేస్తారని అంతా అనుకున్నారు. జనసేన శ్రేణులు సైతం సంబరాలుకు సిద్ధమని సంకేతాలిచ్చాయి. అయితే ఉగాదికి మంత్రివర్గం విస్తరించే చాన్స్ లేకపోవడంతో జనసైనికులు కూడా నిరాశలో మునిగిపోయారు. ఇలా రెండు కీలక విషయాలు ఉగాదికి ఆనందం పంచుతాయని ఆశించగా, అవి నెరవేరలేదని టాక్ వినిపిస్తోంది.