Begin typing your search above and press return to search.

తెలుగు కొత్త సంవత్సరం వేళ ఏం చేయాలి? ఏం చేయొద్దు?

ప్రాశ్చాత్య దేశాల వారి కొత్త సంవత్సరం జనవరి ఒకటితో మొదలైతే.. తెలుగోళ్ల కొత్త ఏడాది ఉగాది రోజు నుంచి ఆరంభం అవుతుంది.

By:  Tupaki Desk   |   30 March 2025 5:50 AM
తెలుగు కొత్త సంవత్సరం వేళ ఏం చేయాలి? ఏం చేయొద్దు?
X

ప్రాశ్చాత్య దేశాల వారి కొత్త సంవత్సరం జనవరి ఒకటితో మొదలైతే.. తెలుగోళ్ల కొత్త ఏడాది ఉగాది రోజు నుంచి ఆరంభం అవుతుంది. శాస్త్రీయంగా చూస్తే.. ఉగాదిని కొత్త సంవత్సరంగా ఎందుకు నిర్ణయించారు? అన్నది చూస్తే.. లాజికల్ గా ఉంటుంది. కానీ.. ఆంగ్లేయుల ప్రభావంతో జనవరి ఒకటిన కొత్త సంవత్సరంగా జరుపుకోవటం కొన్ని వందల ఏళ్ల నుంచి అలవాటు కావటంతో దాన్నే నూతన సంవత్సరంగా జరుపుకోవటం రివాజైంది. ఇంతకీ తెలుగోళ్ల కొత్త ఏడాది ఆరంభాన్ని ఎలా జరుపుకోవాలి? అలానే ఎందుకు? అన్న సందేహాలు రావొచ్చు. దానికో లెక్క ఉందని చెబుతారు పండితులు.

పురాణాల ప్రకారం చైత్రశుద్ధ పాడ్యమినాడే ఈ సృష్టి ప్రారంభమైందన్నది ఒక నమ్మకం. శాలివాహన శకం మొదలైంది కూడా ఉగాది రోజు నుంచే. అందుకే ఈ రోజును ఉగాదిగా కొత్త సంవత్సర ఆరంభంగా భావిస్తూ పండుగగా జరుపుకుంటారు. ఉగాదిని ఒక్క తెలుగోళ్లు మాత్రమే కాదు.. ఇరుగున ఉండే కర్ణాటక ప్రజలు.. మహారాష్ట్ర.. గోవాల్లోనూ గుడిపడ్వా పేరుతో కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తుంటారు. ఉగాదిని యుగాది అని కూడా పిలుస్తారు. యుగాది అంటే.. ఆరంభం అని అర్థం.

ఇక.. ఈసారి తెలుగోళ్లు జరుపుకుంటున్న ఉగాదిని ఈ రోజు (మార్చి 30)న జరుపుకుంటున్నాం. తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాదిని శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఇంగ్లిషు కొత్త సంవత్సరాన్ని అంకెల్లో చెప్పుకుంటే.. తెలుగోళ్ల కొత్త ఏడాదికి ఒక పేరు ఉంటుందన్న విషయం తెలిసిందే. జనవరి ఒకటిన ఏం చేయాలి? ఎలా సెలబ్రేట్ చేసుకోవాలన్న దానికి ఒక పద్దతి అంటూ లేదు. కానీ.. తెలుగోళ్ల కొత్త ఏడాదిని ఎలా జరుపుకోవాలన్న దానికి మాత్రం శాస్త్రీయంగా లెక్క ఉండటం గమనార్హం.

ఇంతకూ ఉగాదిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలంటే.. వేకువజామునే నిద్ర లేవటం.. ఇళ్లు.. వాకిళ్లను శుభ్రం చేసుకోవాలి. ఇంటిల్లిపాదీ తలస్నానం చేసి.. కొత్త దుస్తులు ధరిస్తారు. ప్రతి తెలుగు లోగిలి మామిడి తోరణాలతో కళకళలాడుతూ ఉంటుంది. ఇష్టదేవతలకు పూజలు చేసి.. రకరకాల పిండివంటకాలు చేసుకొని ఉగాది పర్వదినాన్ని ఉల్లాసంగా.. సంతోషంగా గడుపుతారు. ఇష్టదేవతలకు పూజలతో పాటు.. ప్రసాదంగా రకరకాల పిండివంటలు చేసుకోవటం తెలిసిందే.

అన్నింటికి మించి ఉగాది పచ్చడిని ఈ రోజు మొదట తిన్న తర్వాత మాత్రమే.. మిగిలిన ఆహారాన్ని తీసుకుంటారు. ఉగాది పచ్చడిలోని షడ్రుచులు (6 రుచులు) జీవితంలో ఎదురయ్యే వివిధ అనుభవాలకు సంకేతాలు. కొత్త ఏడాదిలో అడుగుపెట్టిన తర్వాత మంచి, చెడు ఇలా ప్రతి అనుభవాన్ని సమానంగా స్వీకరిస్తూ ముందుకెళ్లాలనేదే ఉగాది పచ్చడి తినడం వెనక ఉన్న పరమార్థం. మామిడికాయ, చింతపండు, బెల్లం, వేపపువ్వు, ఉప్పు, కారం కలిపి ఉగాది పచ్చడిని తయారు చేస్తారు.ఈ పచ్చడిని కుటుంబ సభ్యులతో కలిసి తినాలని చెబుతారు. ఈ మాట వెనుక.. కుటుంబ అనుబంధాన్ని చెప్పకనే చెప్పేస్తుందని చెప్పాలి. ఉగాది రోజున కుటుంబ సమేతంగా పంచాంగ శ్రవణం వినటం ఆనవాయితీగా వస్తుందన్న సంగతి తెలిసిందే.