ప్రత్యేకం... క్రోధి నామ సంవత్సర ఉగాది ఎలా ఉండబోతుంది!
తరతరాలుగా జగమంతా సందడి చేస్తున్న పండుగ ఉగాది వచ్చేసింది. ఈ పండుగకి "ఉగాది పచ్చడి" ఎంత ముఖ్యమో.. "పంచాంగ శ్రవణం" కూడా అంతే ముఖ్యం
By: Tupaki Desk | 9 April 2024 7:10 AM GMTతరతరాలుగా జగమంతా సందడి చేస్తున్న పండుగ ఉగాది వచ్చేసింది. ఈ పండుగకి "ఉగాది పచ్చడి" ఎంత ముఖ్యమో.. "పంచాంగ శ్రవణం" కూడా అంతే ముఖ్యం! సంవత్సరంలోని మంచి చెడులు, ఆదాయ వ్యయాలు, గ్రహాల స్థితిగతులు, వాతావరణ పరిస్థితులు... ఇలా పంచాంగ శ్రవణం ద్వారా తెలుసుకుని తగిన జాగ్రత్తలను తీసుకుంటారు. అంటే... ఈ ఏడాది అంతా ఎలా ఉండబోతోంది అనేది చెప్పేదే పంచాంగ శ్రవణం అన్నమాట!
ఇక ఈ సంవత్సరాది పండుగను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక తదితర ప్రాంతాల్లో "ఉగాది" పేరున వ్యవహరిస్తుండగా.. మహారాష్ట్రలో "గుడిపాడ్వా", తమిళులు "పుత్తాండు" అని అంటారు. మలయాళీలు "విషు" అంటే, మరికొందరు "వైశాఖీ" లేదా "బైసాఖీ" అని అంటారు. ఇలా ప్రాంతాన్ని బట్టి పేరు మారినా.. ఆ పండుగను చేసుకునే విధానం మాత్రం మారదు.
ఇక ఈ పండుగకు ప్రత్యేకమైంది షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి. ఇందులో.. తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే ఆరు రుచులు ఉంటాయి. అంటే... సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను ఉగాది పచ్చడిలోని ఆరు రుచులతో సమన్వయించుకొంటూ.. ఇంద్రియనిగ్రహంతో జీవితాన్ని సాగించాలన్నదే ఇందులోని అంతరార్థం అని చెబుతారు!
క్రోధి నామ సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూద్దా..!:
మేష రాశి: ఈ క్రోధి నామ సంవత్సరంలో మేషరాశివారికి అదృష్టయోగం 75శాతం బాగుందని చెబుతున్నారు. ధనస్థానంలో గురుగ్రహం వల్ల కీర్తి, ధన లాభం ఉంటాయని అంటున్నారు. ఇక, మే వరకూ గురుబలం తక్కువగా ఉన్నప్పటికీ.. తర్వాత చాలా బాగుంటుందనిం, ధనలాభం శుభప్రదంగా ఉంటుందని చెబుతున్నారు.
ఇదే క్రమంలో... అనారోగ్య సమస్యలు తక్కువగా ఉంటాయని.. ఎంచుకున్న రంగాల్లో విశేష కృషి చేసినట్లయితే త్వరగా కార్యసిద్ధి ఉంటుందని చెబుతున్నారు. ఫలితంగా.. సంతృప్తి, మనశ్శాంతి సంపూర్ణంగా లభిస్తాయని అంటున్నారు. ఇక... మార్చి 29నుంచి మేషరాశివారికి ఏలినాటి శని ప్రారంభమవుతుండటం వల్ల శనిధ్యానం మేలుచేస్తుందని వెల్లడిస్తున్నారు.
ఫైనల్ గా... ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3 గా ఈ ఏడాది ఉండే అవకాశం ఉంది!!
వృషభ రాశి: ఈ రాశివారికి అదృష్టయోగం 25శాతమే ఉందని చెబుతున్నారు. ఏకాదశంలో రాహుగ్రహం వల్ల ప్రభుసన్మానం, రాజగౌరవం, భోజనసౌఖ్యం, పశులాభం మొదలగు శుభఫలితాలు ఉంటాయని.. విద్య విషయంలో గురుబలం అనుకూలంగా లేదని అంటున్నారు. ఇదే సమయంలో... వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలని, వృత్తిలో కష్టపడాల్సి ఉంటుందని చెబుతున్నారు.
ఇక ఈ ఏడాది ఈ రాశివారికి గ్రహదోషం అధికంగా ఉండటం వల్ల... వ్యవసాయంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి! అవివాహితులకు కల్యాణ ఘడియలు ఆలస్యమవుతాయి! ఈ సమయంలో ఒంటెద్దు పోకడలకు పోకుండా.. సమష్టి నిర్ణయాలు తీసుకుంటూ శుభఫలితాలకై గురు, శని, కేతు శ్లోకాలు చదువుకోవాలని చెబుతున్నారు!
ఫైనల్ గా వృషభ రాశివారికి... ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3గా ఈ ఏడాది ఉండే అవకాశం ఉంది!!
మిథున రాశి: ఈ క్రోధి నామ సంవత్సరంలో మిథునరాశి వారికి 50 శాతం అదృష్టయోగముందని చెబుతున్నారు. ఇదే సమయంలో... పూర్వార్థంలో గురువు వల్ల కీర్తివృద్ధి, సర్వత్రా విజయం, శత్రువులు మిత్రులవడం జరుగుతుందని అంటున్నారు. ఈ క్రమంలో మే తర్వాత గురుబలం తగ్గుతుంది. ఇదే సమయంలో... వృత్తి నైపుణ్యంతో ఉన్నతస్థితిని సాధించడంతోపాటు, వ్యవసాయం కూడా కలిసివస్తుంది.
ఇక ధనలాభం మే వరకూ అద్భుతంగా ఉంటుంది. ఇదే సమయంలో మే వరకూ వివాహఘడియలు సానుకూలంగా ఉంటాయని, కష్టాలు తొలగుతాయని, ఆరోగ్యం బాగుంటుందని, లక్ష్యం నెరవేరుతుందని చెబుతున్నారు. మరిన్ని శుభఫలితాలకై శని, కేతు శ్లోకాలు చదవాలి.
ఈ ఏడాది మిథున రాశివారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6 గా ఉంటుంది.
కర్కాటక రాశి: కర్కాటక రాశివారి కూడా అదృష్టయోగం 50 శాతంగా ఉంది. ఏకాదశంలో గురుగ్రహం వల్ల కీర్తివృద్ధి, శత్రువులపై విజయం సిద్ధిస్తాయి. ఇక మూడోరాశిలో కేతువు వల్ల ధనలాభం, ఆరోగ్యం వంటి శుభాలు జరిగే అవకాశం ఉంది. విద్యార్థులకు విద్యాయోగం బాగుంటుంది. అయితే... వీరికి మే నుండి విశేష లాభాలుంటాయి.
ఇందులో భాగంగా ఉద్యోగులతో పాటు వ్యవసాయంలో విజయాలుంటాయి. విదేశీయానంతో పాటు తీర్థయాత్రలు చేస్తారు! మంచి జీవితభాగస్వామి లభిస్తారు. సంతాన సౌఖ్యముంది. సంతృప్తి, మనశ్శాంతి కర్కాటక రాశివారికి పుష్కలంగా ఉంటాయి. ఈ క్రమంలో... మరిన్ని శుభఫలితాలకై గురు, శని, రాహు గ్రహ శ్లోకాలు చదువుకోవాలి.
ఈ రాశివారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6 గా ఉంటుంది!
సింహ రాశి: ఈ ఏడాది సింహరాశివారికి అదృష్టయోగం 25శాతమే ఉంటుందని చెబుతున్నారు. ఈ రాశివారికి రాహు, కేతు, శని గ్రహాలు సహకరించడం లేదు కాబట్టి వారిని ధ్యానించాలి. విద్యార్థులకు, వ్యాపారులకు మే నెల వరకూ బాగుంది. ఉద్యోగపరంగా మిశ్రమ ఫలితాలుంటాయి.
ఇక వ్యవసాయంలో కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.. అవివాహితులకు మే వరకూ అనుకూలంగా ఉంటుండి. మనోధైర్యంతో కష్టాలను అధిగమిస్తూ ముందుకెళ్లాలి!
ఈ క్రమంలో ఈ రాశివారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2గా ఉంటుంది.
కన్య రాశి: ఇక కన్య రాశి విషయానికొస్తే... వీరికి గురు, శని గ్రహాల వల్ల యాభైశాతం శ్రేష్ఠమైన ఫలితాలున్నాయి. ప్రధానంగా మే నుండి బృహస్పతి అనుగ్రహం వల్ల విశేష ధనలాభం కలుగుతుంది! ఆరవ రాశిలో శని స్వక్షేత్రంలో ఉండటం వల్ల అదృష్టవంతులవుతారు. ఇదే క్రమంలో... ఉన్నతవిద్యల్లో, ఉద్యోగంలో రాణిస్తారు.
ఈ రాశివారికి పంటలు బాగా పండుతాయి. మే వరకూ కాస్త సామాన్యంగా ఉన్నప్పటికీ.. ఆ తర్వాత అద్భుతమైన లాభాలుంటాయి. వీరికి మే తర్వాత వివాహయోగం శుభప్రదం. ఈ ఏడాది మొత్తం సుఖాలే అధికంగా ఉంటాయి. ఆనందాన్నీ, మనశ్శాంతినీ పొందుతారు. మరిన్ని శుభఫలితాలకై రాహుకేతువులను ధ్యానించాలి!
వీరికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5 అవమానం 2 గా ఉంటుంది.
తుల రాశి: ఈ రాశివారికి కూడా అదృష్టయోగం యాభైశాతముంది. వీరికి మే వరకూ సప్తమంలో మేష గురువు.. రాజదర్శనం, ఆరోగ్యం వంటి శుభఫలితాలను ప్రసాదిస్తాడు. షష్ఠ స్థానంలో మీన రాహువు ధైర్యాన్నీ, శత్రువులపై విజయాన్నీ కలుగజేస్తాడు. ఉద్యోగంలో అధికార లాభం లభింఏ అవకాశం ఉంది. వ్యాపారంలో అధిక ధనలాభమున్నప్పటికీ.. వ్యవసాయంలో మిశ్రమ ఫలితాలున్నాయి. మరిన్ని శుభఫలితాలకై గురు, శని, కేతువులను ధ్యానించాలి.
వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5 గా ఉంటుంది.
వృశ్చిక రాశి: వృశ్చిక రాశి వారికి కూడా యాభై శాతం అదృష్టయోగముంది. ఉత్తరార్థంలో వృషభ బృహస్పతి.. రాజదర్శనం, ఆరోగ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఏకాదశంలో కన్యా కేతువు పశులాభాన్నీ, వస్తు ప్రాప్తినీ కలిగిస్తాడు. వ్యాపారం కలిసివస్తుంది. వృత్తిలోనూ కృషికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది.
మే తర్వాత ఆర్థిక ఇబ్బందులు తొలగడంతోపాటు భూ, గృహ, వాహన యోగాలు సానుకూల ఫలితాలనిస్తాయి. ఉత్తరార్థంలో కల్యాణఘడియలు బాగున్నాయి. కీర్తిప్రతిష్ఠలు సంపాదిస్తారు. గురు, శని, రాహువులను ధ్యానిస్తే సత్ఫలితాలుంటాయి.
ఈ రాశివారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5!
మకర రాశి: ఈ రాశివారికి కూడా అదృష్టయోగం 50 శాతం అనుకూలంగా ఉంటుంది. గురు, కేతు గ్రహాల వల్ల అనుకూల్ ఫలితాలు వస్తాయి. ఉత్తరార్థంలో గురువు... ఐశ్వర్యం, కుటుంబసౌఖ్యం కలుగజేస్తాడు. తృతీయస్థానంలో రాహువు... సౌభాగ్యం, ఆరోగ్యం తదితర ఫలితాలను ఇస్తాడు. ఉద్యోగంలో పదోన్నతులు సిద్ధిస్తాయి. పలు మార్గాల్లో అభివృద్ధిని సాధిస్తారు.
విద్య, ఉద్యోగం లలో ఆశించిన ఫలితాలొస్తాయి. విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి. లక్ష్మీకటాక్ష సిద్ధి ఉంది. అవివాహితులకు మే తర్వాత ప్రయత్నాలు ఫలించే సూచనలున్నాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. సంతృప్తి, మనశ్శాంతి బ్రహ్మాండంగా ఉన్నాయి. శని, కేతు, గురు శ్లోకాలు చదువుకుంటే మంచిది.
వీరికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1 గా ఉంటుంది!
ధనస్సు రాశి: ఈ రాశివారికి 75 శాతం అదృష్టయోగం ఉంది. దశమంలో కేతువు.. సర్వసుఖాలనూ ప్రసాదిస్తున్నాడు. బృహస్పతి అనుగ్రహం వల్ల విద్యార్థులకు మే వరకూ మంచి విద్యాయోగం ఉంది. గురు శ్లోకం చదువుకుంటే ఉత్తరార్థంలో కూడా శుభఫలితాలుంటాయి. వ్యాపారంలో మే వరకూ బ్రహ్మాండమైన లాభాలున్నాయి.
వ్యవసాయంలో మంచి పంట చేతికి అందుతుంది. మే వరకూ విశేష ఆర్థిక యోగాలున్నాయి. భూ, గృహ, వాహన యోగాలు అనుకూలిస్తాయి. వివాహ ప్రయత్నాల్లో ఉన్నవారికి మే లోపల మంచి భాగస్వామి దొరుకుతారు. మరిన్ని శుభఫలితాలకై రాహు, గురు శ్లోకాలు చదువుకోవాలి.
వీరికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5గా ఉంటుంది!
కుంభ రాశి: ఈ రాశి వారికి ఈ ఏడాది గురు, శని, రాహు, కేతు గ్రహాలు వ్యతిరేక ఫలితాలనిస్తున్నాయి! ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి. లోతుగా ఆలోచించి సమష్టి నిర్ణయాలు తీసుకోవాలి. విద్యార్థులు కష్టపడి చదువుకోవాలి. వ్యవసాయంలో పరిస్థితులు అనుకూలంగా లేవు.
ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. సంతానంతో ఇబ్బందులు ఎదురుకాకుండా శాంతంగా వ్యవహరించాలి. ఆరోగ్యం విషయం అశ్రద్ధ పనికిరాదు. మార్చి 29 నుండి కుంభరాశి వారికి ద్వితీయ స్థానంలో ఏలినాటిశని ఉంటుంది. మరిన్ని సత్ఫలితాలకై గురు, శని, రాహు, కేతు గ్రహాల ధ్యాన శ్లోకాలు చదువుకుంటే మంచిది!
వీరికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 1 గా ఉంటుంది!
మీన రాశి: మీనరాశి వారికి ధనస్థానంలో బృహస్పతి పూర్వార్థంలో రక్షిస్తున్నాడు. సుఖం, సౌభాగ్యం తదితర శుభఫలితాలనిస్తున్నాడు. విద్యాయోగం మే వరకూ అనుకూలంగా ఉండగా.. ఉన్నతవిద్యల్లో బాగా కష్టపడాలి. ఉద్యోగం సానుకూలంగా, వ్యాపారయోగం మిశ్రమంగా ఉంది. ఆరోగ్యపరంగా శ్రద్ధ అవసరం. అవివాహితులకు మే వరకూ కల్యాణ ఘడియలు బలంగా ఉన్నాయి. మార్చి 29 నుంచి మీనరాశి వారికి జన్మరాశిలో ఏలినాటి శని ఉంది. అందుకని శనిధ్యానం చేయాలి.
ఈ రాశివారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4 గా ఉంటుంది.
నోట్: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పిన వివరాల ఆధారంగా పొందుపరచబడిన కథనం ఇది! వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా పాఠకుల వ్యక్తిగతం!!