మనకు భిన్నంగా బ్రిటన్ లో వారానికి 4 రోజులే పని
ఎలాంటి వేతనం కోత లేకుండా శాశ్వతంగా వారానికి నాలుగు రోజులు మాత్రమే పని దినాలుగా ఈ 200 కంపెనీలు డిసైడ్ చేశాయి.
By: Tupaki Desk | 28 Jan 2025 6:56 AM GMTపని మీద ఫోకస్ మరింత పెంచండి. ఇంట్లో పెళ్లాల్ని అదే పనిగా ఎందుకు చూస్తుండటం.. ఆఫీసుకు వెళ్లి గంటల తరబడి పని చేయాలంటూ మన దేశంలోని కార్పొరేట్ పెద్దలు కొందరు వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆఫీసుల్లో పని గంటల మీద ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ.. అందుకు పూర్తి భిన్నంగా వారానికి నాలుగు రోజులు మాత్రమే పని చేసేలా.. అది కూడా శాశ్వతంగా పేర్కొంటూ బ్రిటన్ లో 200 కంపెనీలు తీసుకున్న తాజా నిర్ణయం ఆసక్తికరంగా మారింది.
ఎలాంటి వేతనం కోత లేకుండా శాశ్వతంగా వారానికి నాలుగు రోజులు మాత్రమే పని దినాలుగా ఈ 200 కంపెనీలు డిసైడ్ చేశాయి. ఇందులో పలు ఛారిటీలు. మార్కెటింగ్.. టెక్నాలజీ సంస్థలు ఉన్నాయి. 4 డే వీక్ ఫౌండేషన్ చేపట్టిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. వారానికి నాలుగు రోజులు మాత్రమే పని నిర్ణయానికి కంపెనీలు ఒప్పుకోవటం వల్ల దాదాపు 5 వేల మంది ఉద్యోగులు లబ్థి పొందనున్నారు. నైన్ టు ఫైవ్.. వారానికి ఐదు రోజుల పని అన్నది వందేళ్ల క్రితం నాటి విధానాలని.. ప్రస్తుత అవసరాలకు ఇవేమీ పని చేయవంటున్నారు 4 డే వీక్ ఫౌండేషన్ క్యాంపెయిన్ డైరెక్టర్ జో రైల్.
అప్డేట్ కావాల్సిన టైం వచ్చేసిందని.. వారానికి నాలుగు రోజుల పని విధానంతో ఉద్యోగులకు ఎక్కువ ఖాళీ సమయం అందుబాటులోకి వస్తుందని.. దాని వల్ల సంతృప్తికరమైన జీవితాల్ని గడిపేందుకు స్వేచ్ఛ లభిస్తుందని పేర్కొన్నారు. ఈ రిపోర్టు మరిన్ని ఆసక్తికర అంశాల్ని వెల్లడించింది. వారానికి నాలుగు రోజుల పని విధానాన్ని బ్రిటన్ లోని 30 మార్కెటింగ్ అడ్వర్టైజింగ్.. ప్రెస్ రిలేషన్స్ సంస్థలు స్టార్ట్ చేశాయి. ఆ తర్వాత 29 ఛారిటీలు.. 24 టెక్నాలజీ.. ఐటీ.. సాఫ్ట్ వేర్ సంస్థలు.. 22 మేనేజ్ మెంట్.. కన్సెల్టింగ్ సంస్థలు ఉన్నాయి. ఈ కంపెనీల్లో బ్రిటన్ రాజధాని లండన్ లో అత్యధికంగా (59) ఉన్నట్లుగా తేల్చారు.