Begin typing your search above and press return to search.

అమెరికా-ఉక్రెయిన్ సంబంధాల్లో పెరుగుతున్న ఉద్రిక్తత

అమెరికా నుండి వందల బిలియన్ డాలర్ల సహాయం పొందినా జెలెన్‌స్కీకి కృతజ్ఞత లేదని ఆరోపించారు.

By:  Tupaki Desk   |   11 March 2025 3:00 AM IST
అమెరికా-ఉక్రెయిన్ సంబంధాల్లో పెరుగుతున్న ఉద్రిక్తత
X

అగ్రరాజ్యపు అధినేతతోనే తొడగొట్టిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఇప్పుడు అనుభవిస్తున్నాడు. అటు ట్రంప్, ఇటు మస్క్ అన్నీ ఉక్రెయిన్ కు కట్ చేస్తుండడంతో ఏంచేయాలో పాలుపోక దిక్కులు చూస్తున్నాడు. ఒక్కొక్కటిగా సాయం నిలిచిపోతుండడంతో ఇంకా ఎన్ని రోజులు జెలెన్ స్కీ ఒంటరిగా యుద్ధం చేస్తాడన్న ప్రశ్న తలెత్తుతోంది.

ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. అమెరికా నుండి వందల బిలియన్ డాలర్ల సహాయం పొందినా జెలెన్‌స్కీకి కృతజ్ఞత లేదని ఆరోపించారు. ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్, జెలెన్‌స్కీ అమెరికా నిధులను "పసిబిడ్డ నుంచి చాక్లెట్ లాక్కొన్నంత సులభంగా" తీసుకుంటున్నారని ఆరోపించారు.

అంతేకాదు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో తనకు మంచి సంబంధాలున్నప్పటికీ, రష్యాపై అత్యంత కఠినంగా వ్యవహరించిన నేత తానేనని, తన హయాంలో ఆంక్షలు విధించానని ట్రంప్ గుర్తుచేశారు.

-ఎలాన్ మస్క్ హెచ్చరికలు

స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కూడా ఉక్రెయిన్‌పై ఒత్తిడి పెంచారు. తన కంపెనీ అందిస్తున్న స్టార్‌లింక్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తే ఉక్రెయిన్ సైన్యం తీవ్రంగా దెబ్బతింటుందని హెచ్చరించారు. ఉక్రెయిన్ ఓటమి తప్పదని, యుద్ధాన్ని ఆపేందుకు చర్చలు జరపడం అనివార్యమని మస్క్ హెచ్చరికలు జారీ చేశారు.

ఇటీవల ఖనిజాల ఒప్పందం కోసం అమెరికా వెళ్లిన జెలెన్‌స్కీ, శ్వేతసౌధంలో జరిగిన వాగ్వాదం కారణంగా ఎలాంటి ఒప్పందం చేసుకోకుండా తిరిగి వెళ్లాల్సి వచ్చింది. ఈ సంఘటన అనంతరం అమెరికా, ఉక్రెయిన్‌కు అందించే సైనిక , ఇంటెలిజెన్స్ సహాయాన్ని నిలిపివేయగా, రష్యా దాడులను మరింత ముమ్మరం చేసింది.

- ట్రంప్ హయాంలో రష్యాపై ఆంక్షలు

తన అధ్యక్షత్వ కాలంలో రష్యా గ్యాస్ పైప్‌లైన్‌పై ఆంక్షలు విధించానని ట్రంప్ తెలిపారు. ఈ పైప్‌లైన్ ద్వారా రష్యా, జర్మనీకి గ్యాస్ సరఫరా చేస్తుంది. ట్రంప్ చర్యలు అమెరికా-రష్యా సంబంధాలపై ప్రభావం చూపగా ఈ వ్యవహారం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

అమెరికా-ఉక్రెయిన్ సంబంధాల్లో మార్పులు

ట్రంప్ వ్యాఖ్యలు, మస్క్ హెచ్చరికలు, అమెరికా సహాయం నిలిచిపోవడం వంటి పరిణామాలు అమెరికా-ఉక్రెయిన్ సంబంధాల్లో తీవ్ర మార్పులకు దారితీస్తున్నాయి. జెలెన్‌స్కీపై ట్రంప్ చేసిన ఆరోపణలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచేలా కనిపిస్తున్నాయి.

ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో అమెరికా, రష్యా, ఉక్రెయిన్ మధ్య సంబంధాలు మరింత క్లిష్టంగా మారుతున్నాయి. ట్రంప్, మస్క్ వంటి ప్రముఖుల వ్యాఖ్యలు ఈ సంక్షోభాన్ని మరింత సంక్లిష్టం చేస్తుండగా, భవిష్యత్తులో ఈ పరిణామాలు ఎలా మలుపు తిరుగుతాయో వేచి చూడాల్సిందే.