Begin typing your search above and press return to search.

సరే.. తప్పుకొంటా.. అదొక్క డిమాండ్ తీర్చండి.. జెలెన్ స్కీ కీలక మెలిక

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగి సరిగ్గా మూడేళ్లు. ఈ కాలంలో ఆ దేశం సర్వ నాశనం అయింది. యూరప్ సరిహద్దులోని ప్రాంతం మినహా మిగతా అన్నిచోట్ల రష్యా దాడులు చేసింది.

By:  Tupaki Desk   |   24 Feb 2025 6:46 AM GMT
సరే.. తప్పుకొంటా.. అదొక్క డిమాండ్ తీర్చండి.. జెలెన్ స్కీ కీలక మెలిక
X

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగి సరిగ్గా మూడేళ్లు. ఈ కాలంలో ఆ దేశం సర్వ నాశనం అయింది. యూరప్ సరిహద్దులోని ప్రాంతం మినహా మిగతా అన్నిచోట్ల రష్యా దాడులు చేసింది. దీంతో ఉక్రెయిన్ ఇప్పట్లో కాదు.. ఎప్పటికి కోలుకుంటుందో కూడా చెప్పడం కష్టంగా మారింది. మరోవైపు యుద్ధానికి మూల కారణమైన ఉక్రెయిన్ ను నాటో సభ్యత్వం ఇంతవరకు దక్కనే లేదు.

నార్త్ అట్లాంటిక్ ట్రిటీ ఆర్గనైజేషన్ (నాటో).. ఇది అమెరికా, బ్రిటన్ తదితర దేశాల సారథ్యంలోని సైనిక కూటమి. నాటో సభ్య దేశాలు 32. ఈ కూటమిలోని ఒక దేశంపై వేరే దేశం ఏదైనా దాడిచేస్తే నాటో సైన్యం రంగంలోకి దిగుతుంది. ఇది నాటో నియమం. ఉక్రెయిన్ ను గనుక నాటోలో చేర్చుకుంటే అది ప్రాంతీయ అస్తిత్వానికే ముప్పు అని రష్యా అధ్యక్షుడు పుతిన్ భావించారు. అందుకే వెనుకాముందు చూడకుండా ఉక్రెయిన్ ను ‘నిస్సైనీకరణ చేస్తామంటూ’ యుద్ధానికి దిగారు. సైనిక లక్ష్యాలని చెప్పినా.. చివరకు ప్రజా వసతులు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆఖరుకు ఆస్పత్రులపైనా దాడికి దిగారు.

ట్రంప్ రాకతో మారిన లైన్

నాటో సభ్యత్వం ఆశ చూపి ఉక్రెయిన్ ను అమెరికా పైకి రెచ్చగొట్టిన పాశ్చాత్య దేశాలు.. కావాల్సిన సైనిక ఆయుధాలు అందించి యుద్ధాన్ని ఎగదోశారు. తీరా.. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలిచాక ‘నాటో’ సభ్యత్వం లేదు పొమ్మంటున్నారు.

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని ట్రంప్ తీవ్రంగా దూషిస్తున్నారు. ఒకప్పుడు సినిమాల్లో హాస్య నటుడైన ఆయన నేపథ్యాన్ని ఉదహరిస్తూ ‘హాస్యగాడు’ అంటున్నారు. జెలెన్ స్కీకి 5 శాతం ప్రజా మద్దతు కూడా లేదని.. ఆయనో నియంత అని విమర్శించారు.

తాజా పరిస్థితుల నేపథ్యంలో జెలెన్ స్కీ నోరు విప్పారు. శాంతి నెలకొంటుందంటే అధ్యక్ష పదవి నుంచి వైదొలిగేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. దీనికి బదులుగా నాటో సభ్యత్వం కల్పించాలని కోరారు. తాను నియంతను కాదంటూ ట్రంప్ నకు కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి ఉక్రెయిన్ లో ఎన్నికలు జరిపించి అధ్యక్షుడు మారితే యుద్ధం ఆగేలా చేసేందుకు ఏదో ప్రయత్నం కనిపిస్తోంది.