Begin typing your search above and press return to search.

మూడో వంతు ఉక్రెయిన్ భూమి రష్యాకు పోయినట్లే.. శాంతి కావాలంటే అంతే

తాజాగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ శాంతి ఒప్పందం కోసం 2014 తర్వాత రష్యా ఆక్రమించుకొన్న భూమిపై ఉక్రెయిన్‌ ఆశలు వదులుకోవాల్సిందేనని తేల్చిచెప్పారు.

By:  Tupaki Desk   |   12 March 2025 3:00 AM IST
మూడో వంతు ఉక్రెయిన్ భూమి రష్యాకు పోయినట్లే.. శాంతి కావాలంటే అంతే
X

11 ఏళ్ల కిందటే ఉక్రెయిన్ మీద దాడి చేసి దానికి చెందిన అత్యంత కీలకమైన క్రిమియా ద్వీపకల్పాన్ని ఆక్రమించేసింది రష్యా.. ఇది జరిగింది 2014లో. ఆ తర్వాత 2022లో డైరెక్ట్ గా ఉక్రెయిన్ రాజధాని కీవ్ మీదనే అటాక్ మొదలుపెట్టింది. అనేక ప్రాంతాల్లోకి చొచ్చుకొచ్చింది. ఇందులో ముఖ్యమైనది డాన్ బాస్ (డొనెట్స్క్, లుగాన్స్క్). పారిశ్రామికంగా కీలకమైన డాన్ బాస్.. క్రిమియాకు కూడా సమీపం. ఈ ప్రాంతం అంతా ఇప్పుడు రష్యా ఆధీనమే. ఇక్కడ రెండేళ్ల కిందట ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇటు నల్ల సముద్రం తీరాన ఉన్న ఒడెసా వరకు రష్యా చేతులో ఉన్నట్లే.

సరిగ్గా యుద్ధం మొదలై మూడేళ్లు. ఇప్పుడు చూసుకుంటే ఉక్రెయిన్ దాదాపు మూడో వంతు భూభాగాన్ని రష్యాకు కోల్పయింది. ఇప్పటికే క్రిమియాను కలిపేసుకున్న రష్యా నుంచి మిగతా భూమి కూడా తిరిగి రావడం కష్టమే.

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ పై కారాలు మిరియాలు నూరుతున్నారు. పూర్తిగా రష్యా పక్షం వహిస్తూ ఉక్రెయిన్ ను కార్నర్ చేస్తున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని శత్రువులా చూస్తున్నారు. కీలకమైన ఖనిజాల తవ్వకానికి ఒప్పందం కుదరకపోవడంతో ఉక్రెయిన్ సైనిక, ఆర్థిక సాయం ఆపేశారు.

తాజాగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాట్లాడుతూ శాంతి ఒప్పందం కోసం 2014 తర్వాత రష్యా ఆక్రమించుకొన్న భూమిపై ఉక్రెయిన్‌ ఆశలు వదులుకోవాల్సిందేనని తేల్చిచెప్పారు. అప్పుడే సంధి జరిగి యుద్ధం ఆగుతుందని పేర్కొన్నారు. శాంతి చర్చల కోసం ఉక్రెయిన్‌ అధికారులతో మాట్లాడేందుకు ఆయన సౌదీ అరేబియా రాజధాని జెడ్డా వచ్చారు.

ట్రంప్‌-జెలెన్‌ స్కీల మధ్య వాగ్వాదం జరిగిన 10 రోజుల తర్వాత ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ కూడా జెడ్డా వచ్చారు. సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ తో భేటీ అయ్యారు. అమెరికా తీరుపై జెలెన్ స్కీ ఏమంటారో చూడాలి.

పారిశ్రామికంగా కీలకమైన డాన్ బాస్, క్రిమియా, ఒడెసా తదితర ప్రాంతాలు రష్యా చేతిలో ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఉక్రెయిన్ భూభాగంలో 30 శాతంపైనే ఉంటాయి.