Begin typing your search above and press return to search.

రాత్రి వేళ ఉక్రెయిన్ పై రష్యా బాంబుల వర్షం.. ఎంత భారీ అంటే?

సుదీర్ఘంగా సా..గుతున్న రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్దంలో మరో పరిణామం చోటు చేసుకుంది.

By:  Tupaki Desk   |   30 Dec 2023 4:07 AM GMT
రాత్రి వేళ ఉక్రెయిన్ పై రష్యా బాంబుల వర్షం.. ఎంత భారీ అంటే?
X

సుదీర్ఘంగా సా..గుతున్న రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్దంలో మరో పరిణామం చోటు చేసుకుంది. యుద్ధం మొదలైన తర్వాత ఇప్పటివరకు ఎప్పుడూ లేని విధంగా గురువారం రాత్రి రష్యా పెద్ద ఎత్తున దాడులకు పాల్పడింది. ఈ రెండు దేశాల మధ్య సాగుతున్న యుద్దం పాతబడిన వేళ.. సరికొత్తగా విరుచుకుపడిన వైనంతో ఒక్కసారిగా ఉద్రికత్తలు పెరిగిపోయిన పరిస్థితి. ఉక్రెయిన్ లోని కీలక లక్ష్యాలపై ఏకంగా 112 క్షిపణులు.. 36 డ్రోన్లను ప్రయోగించి తీవ్రమైన దాడులకు తెర తీసింది. ఈ నేపథ్యంలో దాదాపు 24 మంది సాధారణ ప్రజలు మరణించినట్లుగా చెబుతున్నారు.

దాదాపు 18 గంటల పాటు నాన్ స్టాప్ గా జరిగిన దాడుల నేపథ్యంలో 130 మంది వరకు గాయపడ్డారని.. ఉక్రెయిన్ - రష్యా మధ్య మొదలైన యుద్దంలో ఒక రోజులో ఇదే అతి పెద్ద వైమానికి దాడులుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. రష్యా సైన్యం ప్రయోగించిన బాలిస్టిక్.. క్రూయిజ్ క్షిపణులు.. షాహెద్ డ్రోన్లలో చాలావరకు తాము కూల్చేసినట్లుగా ఉక్రెయిన్ వెల్లడించింది.

2022 ఫిబ్రవరిలో ఈ రెండు దేశాల మధ్య మొదలైన యుద్దం తొలుత వారాల్లో ముగుస్తుందని భావించినా.. నెలల పోయి.. సంవత్సరాలుగా మారుతున్న పరిస్థితి. వచ్చే ఫిబ్రవరికి ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మొదలై రెండేళ్లు కానుందని చెప్పాలి. మొదట్లో రష్యా అంచనా వేసినంత సింఫుల్ గా ఉక్రెయిన్ ను లొంగదీసుకోవటం కష్టమన్న విషయం రష్యాకు అర్థమైంది. ఇటీవల రెండు దేశాల మధ్య దాడులు తగ్గిన వేళలో.. అందుకు భిన్నంగా గురువారం రాత్రి చోటు చేసుకున్న భారీ దాడితో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరగటం ఖాయమని చెప్పక తప్పదు.