Begin typing your search above and press return to search.

రష్యాతో యుద్ధం... మాల్దీవుల్లో ఫ్యామిలీతో ఉక్రెయిన్ ఎంపీ!

అవును... రష్యాతో యుద్ధంతో ఉక్రెయిన్ వణికిపోతుంటే... అరిస్టోవ్ అనే ఉక్రెయిన్ ఎంపీ... జూన్ 5 నుండి 22 జూలై వరకు విదేశాల్లో ఉన్నారని

By:  Tupaki Desk   |   28 July 2023 3:57 AM GMT
రష్యాతో యుద్ధం... మాల్దీవుల్లో ఫ్యామిలీతో ఉక్రెయిన్ ఎంపీ!
X

ఒకపక్క ప్రపంచం మొత్తం చూస్తున్న రష్యా - యుక్రెయిన్ యుద్ధం జరుగుతోంది. ఉక్రెయిన్ ప్రజలు భయాందోళనలమధ్య బ్రతుకీడుస్తున్నారు. మరో పక్క అధ్యక్షుడు నిత్యం రష్యా వ్యతిరేక దేశాలతో టచ్ లో ఉంటున్నారు. మద్దతు కోసం అర్ధిస్తున్నారు. ఈ సమయంలో ఉక్రెయిన్ ఎంపీ ఒకరు హాలిడేస్ లో ఉన్నారని తెలుస్తుంది!

అవును... రష్యాతో యుద్ధంతో ఉక్రెయిన్ వణికిపోతుంటే... అరిస్టోవ్ అనే ఉక్రెయిన్ ఎంపీ... జూన్ 5 నుండి 22 జూలై వరకు విదేశాల్లో ఉన్నారని.. ఈ సమయంలో అతను పోలాండ్‌ కు మూడు రోజుల వ్యాపార పర్యటనను ప్రారంభించారని.. దీనికి ముందు ఉక్రేనియన్ మీడియా మాల్దీవుల్లో ఆయన జాడలు గుర్తించిందని అంటున్నారు.

అతను జూలై మధ్యలో ప్రైవేట్ ద్వీపంలోని విలాసవంతమైన 5-నక్షత్రాల వాల్డోర్ఫ్ ఆస్టోరియా మాల్దీవ్స్ హోటల్‌ లో మొదటిసారి కనిపించాడని.. ఉక్రేనియన్ అవుట్‌ లెట్ ద్వారా జరిపిన విచారణలో, హోటల్ ధృవీకరించిన తర్వాత అరిస్టోవ్ నిజంగా మాల్దీవుల రిసార్ట్‌ కు అతిథిగా వచ్చినట్లు వెల్లడించిందని చెబుతున్నారు.

దీంతో ఉక్రెయిన్ ప్రభుత్వం సీరియస్ అయినట్లు సమాచారం. ఇలా మాల్దీవులకు కుటుంబ సమేతంగా సెలవు తీసుకుని.. పార్లమెంటు సభ్యుడు చట్టాన్ని ఉల్లంఘించారా అనే విషయాన్ని నిర్ధారించేందుకు ఉక్రెయిన్ అధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. కారణం... ఈ ఏడాది జనవరిలో, ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రభుత్వేతర ప్రయోజనాల కోసం అధికారులు విదేశాలకు వెళ్లకుండా నిషేధం విధించారు.

ఇదే సమయంలో పార్లమెంటు సభ్యుడు యూరీ అరిస్టోవ్ అధికారులకు తప్పుడు సమాచారం అందించాడో లేదో నిర్ధారించడానికి భద్రతా సేవ క్రిమినల్ కేసును ప్రారంభించింది. నేరం రుజువైతే సదరు ఎంపీకి కనీసం మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

అయితే ఇప్పటికి ఉన్న రూల్స్ ప్రకారం ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరైనా విదేశాలకు వారి వ్యక్తిగత ప్రయోజనాలకోసం, వ్యక్తిగత పనుల కోసం వెళ్లకూడదు. అలా వెళ్లాలనుకునేవారు వారి వారి ఉద్యోగాలకు, వారి వారి పదవులకూ రాజినామాలు చేసి వెళ్లాలి.

ఈ సమయంలో ... అరిస్టోవ్ దేశం విడిచి వెళ్లడానికి దరఖాస్తు చేస్తున్నప్పుడు తప్పుడు సమాచారం అందించారని ఆరోపణలు వస్తున్నాయి. అతను కుటుంబ విహారయాత్రకు మాల్దీవులకు వెళ్లినట్లు తెలుస్తున్న సమయంలో... తాను అనారోగ్య సెలవుపై వెళ్తున్నట్లు ఎంపీ అధికారులకు తెలిపినట్లు సమాచారం. అయితే అరిస్టోవ్.. తన భార్య, పిల్లలతో జూలై మధ్యలో మాల్దీవులలోని ఇథాఫుషి అనే ప్రైవేట్ ద్వీపంలో ఉన్నట్లు పరిశోధనలు కనుగొన్నాయని తెలుస్తోంది.

దీంతో... స్టేట్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ అతనిపై క్రిమినల్ కేసును ప్రారంభించాయి. విచారణలో ఇది నిజం అని తేలితే అతనికి మూడేళ్ల జైలు శిక్ష పడనుంది!