2 పరిణామాలు.. ప్రపంచానికి కొత్త టెన్షన్
రష్యాకు చెందిన రెండు కమాండ్ విమానాల్ని తాజాగా ఉక్రెయిన్ కూల్చేసింది. ఉక్రెయిన్ కూల్చిన ఈ రెండు కమాండ్ విమానాలు అత్యంత విలువైనవిగా.. రష్యాకు తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని కలిగించేవిగా చెబుతున్నారు.
By: Tupaki Desk | 16 Jan 2024 4:43 AM GMTఎవరి వాదనలు వారివి. వారెవరూ మిగిలిన వారిని పట్టించుకోరు. వారి ప్రయోజనాలు మాత్రమే ముఖ్యమన్నట్లుగా మారుతున్న తీరు.. ప్రపంచానికి కొత్త టెన్షన్లుగా మారుతున్నాయి. ఒకేరోజులో చోటు చేసుకున్న రెండు వేర్వేరు అంశాలు ఆసియా ఖండంతో పాటు.. ప్రపంచానికి కొత్త ఉద్రిక్తలకు కారణమయ్యేలా మారాయి. అందరిని ఆందోళనకు గురి చేసే ఈ పరిణామాల ప్రభావం రానున్న రోజుల్లో మరింత తీవ్రంగా మారుతుందని మాత్రం చెప్పక తప్పదు.
వారం.. మహాఅయితే రెండు వారాల్లో ముగుస్తుందని భావించిన రష్యా - ఉక్రెయిన్ మధ్య పోరు నెలలు దాటి ఏళ్ల దిశగా అడుగులు వేస్తోంది. మొదట్లో రష్యా అధిక్యత కనిపించినప్పటికీ.. ఉక్రెయిన్ సైతం తక్కువేం కాదన్న విషయం ప్రపంచానికి తెలిసేలా చేసింది. తాజాగా ఉక్రెయిన్ చర్య రష్యా మరింత దూకుడుగా దాడులకు పాల్పడేలా మారిందన్న మాట వినిపిస్తోంది. అయితే.. తమను నాశనం చేసిన రష్యాకు సరైన సమయంలో సరైన దెబ్బ కొట్టి.. వారి ఆత్మస్థైర్యం సడిలేలా చేయటంలో ఉక్రెయిన్ విజయం సాధించిందన్న మాట వినిపిస్తోంది.
ఇంతకూ జరిగిందేమంటే.. రష్యాకు చెందిన రెండు కమాండ్ విమానాల్ని తాజాగా ఉక్రెయిన్ కూల్చేసింది. ఉక్రెయిన్ కూల్చిన ఈ రెండు కమాండ్ విమానాలు అత్యంత విలువైనవిగా.. రష్యాకు తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని కలిగించేవిగా చెబుతున్నారు. ఉక్రెయిన్ కూల్చిన రెండు విమానాల్లో ఒకటి ఏ650 రాడార్ డిటెక్షన్ ఫ్లైట్ కాగా.. రెండోది.. ఐఎల్ 22 కంట్రోల్ సెంటర్ ఫ్లైట్.
రష్యా వైమానిక దళంలో అత్యంత విలువైన ఈ రెండు విమానాల్ని కూల్చేయటం ద్వారా ఉక్రెయిన్ తన సత్తాను చాటినట్లుగా చెబుతున్నారు. ఈ రెండు విమానాల్ని తమ గగనతల రక్షణ వ్యవస్థ కూల్చేసినట్లుగా ఉక్రెయిన్ పేర్కొనగా.. రష్యా మాత్రం దీనిపై స్పందించలేదు.ఈ రెండు విమానాల ఖరీదు కొన్ని మిలియన్ డాలర్లుగా చెబుతున్నారు. తమ వైమానిక దళం పక్కా ప్రణాళికతో ఈ ఆపరేషన్ ను పూర్తి చేసినట్లుగా ఉక్రెయిన్ ఆర్మీ చీఫ్ వలెరీ జలుజ్ని పేర్కొన్నారు. అజోవ్ సముద్రం మీదుగా వెళుతున్న ఈ రెండు విమానాల్ని ఆకాశంలోనే ఉక్రెయిన్ కూల్చేసింది.
మరో ఉదంతంలో.. హౌతీ రెబెల్స్ తాజాగా మరోసారి చెలరేగిపోయి.. యెమెన్ తీరంలోని అమెరికాకు చెందిన రెండు కంటెయినర్ షిప్ గిబ్రాల్టర్ ఈగల్ పై మిస్సైల్స్ తో దాడి చేశారు. దీంతో షిప్ లో మంటలు చెలరేగినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ ఉదంతంలో నౌకలోని సిబ్బందికి కానీ.. షిప్ నకు కానీ ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని చెబుతున్నారు. గల్ఫ్ ఆఫ్ ఎడెన్ మార్షల్ ఐలాండ్ జెండాతో కంటెయినర్ షిప్ తన జర్నీని కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు.
యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాల్ని టార్గెట్ చేసుకున్న అమెరికా.. బ్రిటన్ వరుసగా దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ దేశంపై దాడికి దిగిన అమెరికా.. బ్రిటన్ కు చెందిన యుద్ధ నౌకల్ని తాము శత్రులక్ష్యాలుగా చూస్తామని హౌతీ రెబెల్స్ పేర్కొంటున్నారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా కొన్ని రోజులుగా హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకల్ని టార్గెట్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే.