Begin typing your search above and press return to search.

కొత్త రూల్ వచ్చేసింది.. యూకే వీసా రావాలంటే అంత జీతం ఉండాల్సిందే

యూకే వీసా ఓకే కావాలంటే అంత భారీ జీతం ఉండాల్సిందేనట అగ్ర దేశాలు తమ దేశానికి వచ్చే విదేశీయులకు బోలెడన్ని పరిమితులు పెడుతున్నాయి.

By:  Tupaki Desk   |   5 April 2024 9:30 AM GMT
కొత్త రూల్ వచ్చేసింది.. యూకే వీసా రావాలంటే అంత జీతం ఉండాల్సిందే
X

యూకే వీసా ఓకే కావాలంటే అంత భారీ జీతం ఉండాల్సిందేనట అగ్ర దేశాలు తమ దేశానికి వచ్చే విదేశీయులకు బోలెడన్ని పరిమితులు పెడుతున్నాయి. మరీ ముఖ్యంగా సంపన్న దేశాలు.. ఉపాధి అవకాశాలపై ఫోకస్ పెట్టి.. ఆయా దేశాల్ని టార్గెట్ చేయాలని భావించేవారికి వీసా అన్నది రాకుండా ఉండటమే ధ్యేయంగా అగ్రరాజ్యాలు నిబంధనల్ని మారుస్తున్నారు. తాజాగా యూకే వీసాల కోసం అప్లై చేసే వారి విషయంలో.. వారి జీతమే కీరోల్ ప్లే చేయనుంది. భారీ జీతాలు ఉన్న వారికి మాత్రమే వీసాలు పొందేలా కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చారు.

ఎక్కువ జీతభత్యాలు చెల్లించే నైపుణ్య ఉద్యోగాలకు మాత్రమే విదేశీయులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. గతంలో 26,200 పౌండ్ల వార్షిక వేతనం (రూ.27.6 లక్షలు. అంటే నెలకు రూ.2.4లక్షల వరకు) చెల్లించే ఉద్యోగాలు చేయటానికి వచ్చే విదేశీయులకు వీసాలు ఇచ్చేవారు. తాజాగా దీన్ని మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా అమల్లోకి వచ్చిన నిబంధన ప్రకారం 38,700 పౌండ్లు వార్షిక జీతంగా వచ్చే వారికి మాత్రమే వీసాలు ఇవ్వాలని నిర్ణయించారు.

అంటే.. గతంతోపోలిస్తే 48 శాతం అధిక జీతాలు పొందే ఉద్యోగులు మాత్రమే ఉద్యోగ వీసా కింద బ్రిటన్ కు వచ్చేందుకుఅ ర్హత సాధిస్తారన్న మాట. తాజాగా తీసుకున్న నిర్ణయం భారతీయులకు ప్రతికూలంగా మారుతుందని చెబుతున్నారు. బ్రిటన్ లోని వైద్య సిబ్బందితో పాటు.. టెక్ నిపుణులు.. విద్యార్థుల్లో ఎక్కువ మంది భారతీయులే. తాజా నిర్ణయంతో తక్కువ జీతాలకు పని చేసే విదేశీయులకు చెక్ పెట్టేలా పరిస్థితి మారనుంది.

తాజా నిర్ణయంతో బ్రిటన్ పౌరులకు ఉపాధి అవకాశాలు పెరిగేలా చేస్తాయని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజా నిబంధన కారణంగా గత ఏడాది బ్రిటన్ లో నైపుణ్య వీసా పొందిన 3 లక్షల మంది తాజా నిర్ణయంతో అక్కడ ఉండేందుకు అనర్హులైపోతారు. చౌకగా దొరికే విదేశీ ఉద్యోగుల కారణంగా బ్రిటన్ పౌరుల జీతభత్యాలు తగ్గిపోతున్నాయని.. అందుకే.. తాజా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. 2022 సెప్టెంబరులో ఉద్యోగ వీసాల్లో భాగంగా భారతీయుల్లో 20,360 మందికి బ్రిటన్ వీసాలు లభించగా.. 2023లో అవి కాస్తా 18,107కు తగ్గాయి. తాజా నిర్ణయంతో భారీగా కోత పడనుందన్న మాట వినిపిస్తోంది.