Begin typing your search above and press return to search.

దుబాయ్ కి మల్లెపూలు.. కోట్లలో టర్నోవర్.. కేరళ మహిళ సక్సెస్ స్టోరీ!

వివరాళ్లోకి వెళ్తే... కేరళలోని పాలక్కాడ్ కు చెందిన ఉమాశంకరికి 1997లో సేతుమాధవన్ తో వివాహం జరిగింది.

By:  Tupaki Desk   |   27 Aug 2024 2:30 PM GMT
దుబాయ్  కి మల్లెపూలు.. కోట్లలో టర్నోవర్.. కేరళ మహిళ సక్సెస్  స్టోరీ!
X

కృషీ, పట్టుదల ఉంటే.. సాధించాలనే తపన ఉంటే.. కలాం చెప్పినట్లు కలలు కంటూ, వాటిని నిజం చేయాలని పరితపిస్తే, సవాళ్లనే సోపానాలుగా చేసుకుంటే.. అనుభవాలనే ఊతంగా మలచుకుంటే... సక్సెస్ బానిస అవుతుందని అంటారు. కేరళకు చెందిన "శ్రీ వెన్ గార్డ్ ఎక్స్ పోర్ట్స్" కంపెనీ వ్యవస్థాపకురాలు ఉమాశంకరి అందుకు ఓ అద్భుతమైన ఉదాహరణ.

అవును... కేరళలోని పాలక్కాడ్ కు చెందిన ఓ మహిళ కోయంబత్తూరులో పూల వ్యాపారం చేస్తూ.. అక్కడే ఈ వ్యాపారానికి సంబంధించిన ఓనమాలు నేర్చుకుంటూ.. తమిళనాడు నుంచి పూల ఎగుమతులు ఎవరూ చేయడం లేదని తెలిసి.. అక్కడ నుంచి విదేశాలకు రకరకాల పూలను ఎగుమతి చేసే వ్యాపారం ప్రారంభించారు. ఇప్పుడు కోట్ల టర్నోవర్ తో సక్సెస్ ఫుల్ ఉమన్ గా నిలిచారు.

వివరాళ్లోకి వెళ్తే... కేరళలోని పాలక్కాడ్ కు చెందిన ఉమాశంకరికి 1997లో సేతుమాధవన్ తో వివాహం జరిగింది. అనంతరం అత్తగారి ఊరైన దిండుక్కల్ కు వచ్చేసింది ఉమాశంకరి. ఆ సమయంలో భర్త సేతు.. ఎలక్ట్రికల్ వస్తువులు విక్రయించేవారు. అయితే కొన్ని కారణాలతో ఆ వ్యాపారాన్ని కొనసాగించలేకపోయారు.

అయితే ఆ సమయంలో కోయంబత్తూరులో పూల వ్యాపారం జోరుగా సగుతుండటంతో అక్కడికి వెళ్లాలని ఈ దంపతులు నిర్ణయించుకున్నారు. అక్కడే ఈ పూల వ్యాపారం గురించి ఓనమాలు నేర్చుకున్నారు. ఈ క్రమంలో 2000వ సంవత్సరంలో రూ.5 లక్షల పెట్టుబడితో దిండుక్కల్ లో పూల ఎగుమతి వ్యాపారాన్ని ప్రారంభించారు.

ఆ సమయంలో తమిళనాడు నుంచి ఎగుమతి చేసేవారు ఎవరూ లేరు. దీంతో...దుబాయ్ లో తెలిసిన వ్యాపారస్తులు ఉండటంతో అక్కడికే నేరుగా ఎగుమతి చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా తొలుత 30 కిలోల మల్లెపూలను మాలకట్టి, వెదురుబుట్టలో పేర్చి దుబాయ్ కి పంపించేవాళ్లు.

అయితే మల్లెపూలు తొందరగా వాడిపోతాయనే సమస్య ఉండటంతో... సూర్యోదయానికి ముందు తెంపిన నాణ్యమైన మొగ్గలను రైతుల నుంచి కొని, ముందుగా సాధారణ నీటిలో నానబెట్టి, తర్వాత ఐస్ క్యూబ్స్ లలో వేసి.. వీలైనంత తాజాగా ఉండేలా గమ్యస్థానానికి చేర్చడంలో సక్సెస్ అయ్యారు.

దీంతో... మల్లెపూలతోపాటు మిగిలిన రకాల పువ్వులూ పంపాలంటూ ఆర్డర్స్ రావడం మొదలయ్యాయి. ఇందులో భాగంగా... చామంతి, సంపంగి, బొండుమల్లి, గులాబీ, తామర వంటి పూలను దుబాయ్ తోపాటు అమెరికా, మలేషియా, సింగపూర్ వంటి దేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభించారు.

ఈ క్రమంలో దుయాబ్, అమెరికాకు కలిపి వారానికి సుమారు 20-24 టనుల చొప్పున పంపిస్తున్నారు. అదేవిధంగా రైతుల వద్ద కొనడమే కాకుండా 10 ఎకరాల్లో మల్లెపూలను స్వయంగా సాగుచేస్తున్నారు. ఏడాది మొత్తం దేశవిదేశాల్లో వ్యాపారం జరుగుతూనే ఉండటంతో ప్రస్తుతం కంపెనీ టర్నోవర్ రూ.80 కోట్లకు చేరుకుంది. పార్ట్ టైంలో 100 మంది, ఫుల్ టైంగా 30 మంది ఇక్కడ పనిచేస్తున్నారు.