Begin typing your search above and press return to search.

జైలులో నిద్రపట్టకుండా మరో కుట్ర... ఉమ సంచలన ఆరోపణలు!

ఈ నేపథ్యంలో... టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబుని జైల్లో నిద్రపోనివ్వడం లేదని అన్నారు.

By:  Tupaki Desk   |   16 Sep 2023 10:08 AM GMT
జైలులో నిద్రపట్టకుండా మరో కుట్ర... ఉమ సంచలన ఆరోపణలు!
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. జైలులో చంద్రబాబుకు సకల సౌకర్యాలు కల్పించామని, ఇంకా ఏమైనా కావాలంటే అడగొచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ సమయంలో దేవినేని ఉమ సంచలన ఆరోపణలూ చేశారు.

అవును... చంద్రబాబుకు జైల్లో సకల సౌకర్యాలు అందుతున్నాయని, ఇంటి నుంచి భోజనం తెప్పించుకోవడానికి అనుమతులు కూడా ఇచ్చామని, 24/7 సెక్యూరిటీ భారీగా ఉందని అధికారులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబుని జైల్లో నిద్రపోనివ్వడం లేదని అన్నారు.

జైలులో చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించిన భువనేశ్వరికి ములాఖత్‌ కు అనుమతి ఇవ్వడం లేదని.. వారంలో కేవలం రెండుసార్లు మాత్రమే ములాఖత్‌ కు అనుమతి ఇస్తామని జైలు అధికారులు చెప్పడం దారుణం అని చెప్పుకొచ్చిన ఉమ... ప్రభుత్వం ఎన్ని విధాలుగా కుట్రలు చేయాలో అన్ని విధాలుగా చేస్తోందని అన్నారు.

ఇందులో భాగంగా... రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును నిద్రపోకుండా చేయాలని ప్రభుత్వం చూస్తుందని... అందులో భాగంగా తరచూ శబ్దాలు చేయాలని అక్కడి సిబ్బందికి జగన్ ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయని దేవినేని ఉమా ఆరోపించారు. విజిల్స్ వేయడం, జైలు ఊచలను లాఠీలతో కొట్టడంతో ఆ శబ్దాలకు నిద్రలేకుండా బాబు బాధపడుతున్నారని అన్నారు.

ఇదే సమయంలో నిద్రలేకుండా బాధపడుతున్న చంద్రబాబును సీసీ కెమెరాలలో చూసి జగన్ ఆనందం పొందుతున్నారని దేవినేని ఉమ తీవ్రస్థాయిలో విమర్శించారు. జగన్ నిద్రపోకుండా ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరిని హింసించాలి అనే విషయాల గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటాడని ఉమ్మ విమర్శించారు.

ఇక, అధికారంలోకి రాగానే తొలి రెండేళ్లలో జేసీబీలతో పాలన ప్రారంభించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఇప్పుడు అక్రమ అరెస్టులతో పాలన కొనసాగిస్తున్నారని దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలు చేపట్టిన మేము సైతం నిరాహార దీక్షల్లో పాల్గొన్న సందర్భంగా ఉమ ఈ ఆరోపణలు చేశారు.

అనంతరం ట్విట్టర్ వేదికగా మరిన్ని ఆరోపణలు చేసిన దేవినేని ఉమ... జెడ్ కేడర్‌ లో ఉన్న నేతను క్రిమినల్స్ ఉన్న సెంట్రల్ జైల్లో ఉంచటం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. దీంతో... జైల్లో క్రిమినల్సే ఉంటారు - స్వామీజీలు ఉండరు అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.