ఉమ సంచలన ఆరోపణలు.. వైసీపీ ఎమ్మెల్యే లీగల్ నోటీసులు!
ఈ మేరకు వసంత కృష్ణప్రసాద్ తరఫున ఆయన లాయర్లు దేవినేని ఉమాకు లీగల్ నోటీసు జారీ చేశారు.
By: Tupaki Desk | 8 Jan 2024 6:51 AM GMTటీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ లీగల్ నోటీసు ఇచ్చారు. దేవినేని ఉమా తనపై అసత్య, తప్పుడు ఆరోపణలు చేశారని నోటీసులో పేర్కొన్నారు. ఇందులో ఒక్క నిజం కూడా లేదని తెలిపారు. ఉమా తాను చేసిన ఆరోపణలకు సంబంధించి తనకు బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రూ.10 కోట్లకు పరువునష్టం దావా వేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు వసంత కృష్ణప్రసాద్ తరఫున ఆయన లాయర్లు దేవినేని ఉమాకు లీగల్ నోటీసు జారీ చేశారు.
గత ఏడాది నవంబరు 22న మైలవరం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దేవినేని ఉమా మాట్లాడుతూ వసంత కృష్ణప్రసాద్ పై హత్య, ఆర్థిక నేరాలను మోపుతూ ఆరోపణలు చేశారు. దీంతో తన పరువుకు భంగం వాటిల్లిందని వసంత కృష్ణప్రసాద్ లీగల్ నోటీసులు ఇచ్చారు.
దేవినేని ఉమా తనపై చేసిన 14 తప్పుడు ఆరోపణల్లో ఒక్కటి కూడా నిజం లేదని కృష్ణప్రసాద్ తరఫు న్యాయవాదుల బృందం లీగల్ నోటీసులో పేర్కొంది. వీటికి బహిరంగ క్షమాపణ చెప్పకపోతే రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించింది.
కాగా 2019 ఎన్నికల్లో మైలవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన దేవినేని ఉమాపై వైసీపీ తరఫున పోటీ చేసిన వసంత కృష్ణప్రసాద్ గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్.. ఆయనకే సీటు కేటాయించారని చెబుతున్నారు. స్థానచలనం కలిగిస్తే ఆయనకు ఎన్టీఆర్ జిల్లాలోనే జగ్గయ్యపేట స్థానాన్ని కేటాయిస్తారని అంటున్నారు. లేదంటే మైలవరం నుంచే వైసీపీ నుంచి వసంత కృష్ణప్రసాద్ బరిలోకి దిగుతారని చెబుతున్నారు.
మరోవైపు టీడీపీ తరఫున దేవినేని ఉమా పోటీ చేయడం ఖాయమంటున్నారు. గతంలో నాలుగు పర్యాయాలు నందిగామ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దేవినేని ఉమా 2014లో మైలవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. నాడు చంద్రబాబు ప్రభుత్వంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
ఈ నేపథ్యంలో కీలకమైన ఎన్నికల ముంగిట అధికార, ప్రతిపక్ష నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు, లీగల్ నోటీసులతో మైలవరం నియోజకవర్గంలో వేడి రాజుకుంది. వసంత కృష్ణప్రసాద్ లీగల్ నోటీసుల నేపథ్యంలో దేవినేని ఉమా ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.