Begin typing your search above and press return to search.

ఏపీది దశాబ్ది ఘోష ...జగన్...బాబు అలా !

రాజమండ్రిలో మీడియా సమావేశం పెట్టి ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

By:  Tupaki Desk   |   3 Jun 2024 12:30 AM GMT
ఏపీది దశాబ్ది ఘోష ...జగన్...బాబు అలా !
X

తెలంగాణాలో జూన్ 2న తెలంగాణా ఏర్పడిన తరువాత దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. అదే సమయంలో సాటి తెలుగు రాష్ట్రం ఏపీ పరిస్థితి ఏంటి అంటే ఇది దశాబ్ది ఘోష అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అంటున్నారు. రాజమండ్రిలో మీడియా సమావేశం పెట్టి ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ఏపీ 2014 నుంచి 2014 మధ్యలో తీవ్రంగా నష్టపోయింది అని అన్నారు దానికి చంద్రబాబు జగన్ ప్రభుత్వాలే కారణం అన్నారు. ఏపీని అడ్డగోలుగా విభజించారు కానీ విభజన చట్టంలో పెట్టిన ఏ ఒక్క హామీని ఈ రోజుకీ తీర్చలేదని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేదని, పోలవరం పూర్తి కాలేదని, తాజాగా ఏపీ ప్రభుత్వం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో పేర్కొన్న మేరకు పోలవరం కేవలం 48 శాతం మాత్రమే పూర్తి అయింది అని ఆయన అన్నారు.

ఇకా 52 శాతం పూర్తి కావాల్సి ఉందని అయినా కేంద్రం 2014 లెక్కల ప్రకారం తాము అంతా ఇచ్చేశామని కేవలం 500 కోట్లు ఇస్తే సరిపోతుందని చెబుతున్నారని ఉండవల్లి మండిపడ్డారు. అసలు పోలవరం ప్రాజెక్ట్ ని ఏపీకి కేంద్రం ఎందుకు ఇచ్చిందని దానికి సంబంధించి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా ఎక్కడ ఉందని ఆయన ప్రశ్నించారు.

ఇక షెడ్యూల్ 9 10 ప్రకారం ఉమ్మడి ఆస్తులు అన్నీ హైదరాబాద్ లో ఉండిపోయాయని 2023 నాటికి వాటి విలువ ఒక లక్షా 42 వేల కోట్ల పై మాట అన్నారు. అందులో ఏపీకి 58 శాతం వాటాగా కనీసంగా 90 వేల దాకా నిధులు రావాల్సి ఉందని అన్నారు. తెలంగాణా ఏర్పాడిన కొత్తలో ఏపీ నుంచి విద్యుత్ ఇచ్చామని ఆ బకాయి ఆరున్నర వేల పైగా ఉన్నా కనీసం ఇంతవరకూ ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు.

ఇక ఉమ్మడి ఏపీని విడగొట్టినపుడు హైదరాబాద్ లాంటి రాజధానిని కోల్పోతున్న ఏపీకి రీసోర్స్ గ్యాప్ కింద నిధులు ఇస్తామని కేంద్రం చెప్పిందని, విభజన చట్టంలో పేర్కొన్నారు అని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు తొలి సీఎం ఏపీకి అయ్యాక 2015లో ఏకంగా 36 వేల దాకా రిసోర్స్ గ్యాప్ నిధులు రావాలని కేంద్రానికి పూర్తి వివరాలతో ఇచ్చారని కానీ కేంద్రం ఇచ్చినది మాత్రం అక్షరాలా అయిదు వేల కోట్ల రూపాయలు మాత్రమే అని ఆయన వివరించారు

ఇక బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజ్ ని ఏపీలో రాయలసీమ నాలుగు జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రాలోని మూడు జిల్లాలకు కలిపి పాతిక వేల కోట్ల దాకా ఇవ్వాలని కానీ కేంద్రం మాత్రం ఇప్పటిదాకా ఇచ్చింది కేవలం 1750 కోట్ల రూపాయలు మాత్రమేనని ఆయన అన్నారు.

ఇలా అనేక విషయాలలో కేంద్రం పదేళ్ళుగా అన్యాయం చేస్తున్నా ఏపీని పాలించిన బాబు జగన్ ఇద్దరూ నోరెత్తకపోవడమే అతి పెద్ద తప్పు అని ఆయన అన్నారు. అదే విధంగా చూస్తే ఏపీ తెలంగాణాల మధ్య కృష్ణా జలాల విషయంలో వివాదాలు అవుతున్నా ఏపీకి ఈ నదిని ఉపయోగించుకో నీయకుండా చేస్తున్నా కూడా సరైన వాదన వినిపించలేకపోతున్నామని అన్నారు.

ఏపీకి ఈ పదేళ్ళు ఇబ్బందిగానే గడచాయని ఏపీలో రాజకీయంగా ఎదగలేమని తెలంగాణాలో అవకాశాలు ఉన్నాయని భావించే బీజేపీ ఏపీ విభజన సమస్యలను పట్టించుకోవడం లేదని ఏపీ ముఖ్యమంత్రులు కూడా అడగడం లేదని అన్నారు. ఇప్పటికైనా జూన్ 4 తరువాత ఏర్పడే కొత్త ప్రభుత్వం అయినా ఏపీ సమస్యల మీద విభజన హామీల మీద కేంద్రం మీద ఒత్తిడి పెట్టి సాధించుకుని రావాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. లేకపోతే ఏపీ మరింతంగా ఇబ్బందులలో పడుతుందని భావి తరాలు క్షమించవని ఆయన హెచ్చరించారు.