జగన్ చేసిన అతి పెద్ద తప్పు అదే ?
జగన్ సీఎం నుంచి మాజీ సీఎం కావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి.
By: Tupaki Desk | 3 Sep 2024 3:31 AM GMTజగన్ సీఎం నుంచి మాజీ సీఎం కావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో చూస్తే ఎవరికి తోచినవి వారు చెబుతూ ఉంటారు. అయితే రెండుసార్లు ఎంపీగా ఉంటూ ఆ తరువాత రాజకీయ విశ్లేషకుడిగా మారి వర్తమాన రాజకీయాల మీద తనదైన శైలిలో ఎప్పటికపుడు వ్యాఖ్యానాలు చేసే ఉండవల్లి అరుణ్ కుమార్ మాత్రం ఒక విషయం చెప్పారు. జగన్ అతి పెద్ద తప్పు చేసి మాజీ అయ్యారు అని అన్నారు.
ఆ తప్పు ఏంటి అంటే చంద్రబాబుని అరెస్ట్ చేసి జైలులో పెట్టడం. చంద్రబాబు అంతటి వారిని ఆ వయసులో అరెస్ట్ చేయడం వల్లనే జగన్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలు కావాల్సి వచ్చిందని ఆయన విశ్లేషించారు. అంతే కాదు జగన్ ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కొందరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేసుకుని కేసులు పెట్టడం కూడా మంచిది కాదని అన్నారు. ఆయన ఈ సందర్భంగా ఏబీ వెంకటేశ్వరరావు విషయాన్ని కూడా ఉదహరించారు.
దీని వల్ల కూడా జగన్ దెబ్బ తిన్నారు అని ఆయన అన్నారు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ప్రభుత్వాలు చెప్పినట్లు చేస్తారు అని వారిని టార్గెట్ చేయడం ఏ ప్రభుత్వానికి మంచిది కాదని అన్నారు. అలా చేయడం వల్ల వారు డీ మోరలైజ్ అవుతారని కూడా ఉండవల్లి చెప్పుకొచ్చారు.
ఐఏఎస్ అధికారుల మీద కక్ష సాధింపు చర్యల వల్ల వారు ఏ సీఎం మాట వినే పరిస్థితి లేకుండా పోతుందని ఇది మరింత ఇబ్బందికరం అని కూడా ఆయన అన్నారు. ప్రస్తుతం చంద్రబాబు కూడా జగన్ చేసిన తప్పులు చేయకుండా ఉంటే మంచిందని ఆయన హితవు పలికారు. ముఖ్యమంత్రి అయినా చట్ట ప్రకారం పాలన చేయాలని అలాగే నడచుకోవాలని ఆయన అన్నారు. చంద్రబాబు చట్టప్రకారం పాలిస్తారు అన్నది తనకు ఉన్న నమ్మకం అని కూడా చెప్పారు.
మార్గదర్శి కేసు విషయంలో చట్టప్రకారం దాని పనిని అది చేయనిచ్చేలా చూడాలని ఉండవల్లి హితవు పలికారు. మార్గదర్శి కేసు ఇపుడు కోర్టులలో ఉందని ఈ విషయంలో రిజర్వ్ బ్యాంక్ చెప్పాల్సింది కోర్టులకు చెప్పిందని అందువల్ల ఎవరు అడ్డుకున్నా ఆగేది కాదని ఉండవల్లి అన్నారు.
ఈ సమయంలో చట్టానికి బద్ధులుగా ఉండాలని ఎంతటి వారు అయినా దానిని గౌరవించాలని ఆయన కోరారు. మార్గదర్శి కేసు ఈ నెల 11న విచారణకు వస్తోందని ఆనాటికి ఏపీ తరఫున అఫిడవిట్ వేయాలని ఉండవల్లి చంద్రబాబుకు వినతి చేశారు. అదే విధంగా రేవంత్ రెడ్డి కూడా చేయాలని ఆయన కోరారు. మొత్తం మీద ఉండవల్లి జగన్ చేసిన తప్పు ఏంటో చెప్పారు. చంద్రబాబు ఏమి చేయాలో ఏమి చేయకూడదో చెప్పారు. మరి ఈ విషయాలు మాజీ తాజా సీఎంల చెవిన పడుతోందా అన్నదే అసలు మ్యాటర్.