పవన్ బెటర్ ... షాక్ ఇచ్చిన వైఎస్సార్ మిత్రుడు
ఆయన వైఎస్సార్ కి అత్యంత సన్నిహితుడు. అంతే కాదు వైఎస్సార్ వల్లనే రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి గెలిచారు. వైఎస్సార్ ఆంతరంగీకుల్లో ఆయన ఒకరు.
By: Tupaki Desk | 20 Feb 2025 4:10 AM GMTమాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీలోకి వస్తున్నారు అని విపరీతంగా ఇటీవల కాలంలో ప్రచారం సాగింది. ఆయన వైఎస్సార్ కి అత్యంత సన్నిహితుడు. అంతే కాదు వైఎస్సార్ వల్లనే రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి గెలిచారు. వైఎస్సార్ ఆంతరంగీకుల్లో ఆయన ఒకరు.
అటువంటి ఆయన జగన్ కి ఎపుడూ ఎదురుగానే నిలిచి విమర్శలు చేస్తూ వచ్చారు. ఆయన కాంగ్రెస్ లోనే ఉంటూ జగన్ వైసీపీని స్థాపించినపుడు కూడా ఆ పార్టీ నుంచి విమర్శల బాణాలు సంధించారు. ఇక 2014 తరువాత రాజకీయాల నుంచి విరమించిన ఉండవల్లి తనదైన శైలిలో రాజకీయ విశ్లేషణలు చేస్తూ వస్తున్నారు.
ఆయన చంద్రబాబు పాలననూ విమర్శించారు, జగన్ ఏలుబడిలో లోపాలనూ చెప్పారు. ఒక విధంగా ఆయన రాజకీయ విశ్లేషకుడిగానే ఉన్నారు. ఇక ఆయన వైసీపీలోకి వస్తారని ఆయన రాకతో మంచి వాగ్దాటి కలిగిన వారి కొరత వైసీపీకి తీరుతుందని అంతా అనుకున్నారు.
అయితే ఉండవల్లి వస్తారా అన్న డౌట్ అయితే అందరిలో ఉంది. దానికి ఉండవల్లి తనదైన వ్యాఖ్యలతో జవాబు ఇచ్చారు. ఆయన ఏపీకి ఆశాజ్యోతిగా పవన్ ని పేర్కొన్నారు. పవన్ వల్లనే ఏపీ అభివృద్ధి సాధ్యపడుతుందని విభజన హామీలు కూడా ఆయనే పరిష్కరిస్తారని చెప్పారు. తనకు పవన్ మీద ఎంతో నమ్మకం ఉందని అన్నారు. ఏపీకి న్యాయం చేసే విషయంలో పవన్ లో చిత్తశుద్ధి ఉందని అన్నారు. ఆ విషయంలో చంద్రబాబు జగన్ ల కంటే కూడా పవన్ చాలా బెటర్ అని కితాబు ఇచ్చారు.
దీనిని బట్టి చూస్తే ఉండవల్లి రాజకీయాల్లో జనసేనను సపోర్ట్ చేస్తున్నారు అన్న చర్చ మొదలైంది. అదే సమయంలో వైసీపీకి ఆయన ఆమడ దూరం అన్న మాట కూడా వినిపిస్తోంది. ఇక జనసేనలో ఉండవల్లి చేరుతారు అన్నది కూడా మరో రకమైన చర్చ సోషల్ మీడియాలో మొదలైపోయింది.
అయితే ఉండవల్లి ఏడు పదులు దాటిన వయసులో ఉన్నారు. ఆయన తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాను అని చాలా కాలం క్రితమే చెప్పేశారు. ఆయన వస్తాను అంటే వైసీపీతో సహా అనేక పార్టీలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయని కూడా అంటున్నారు. ఆయన ఏపీకి విభజన వల్ల అన్యయాం జరిగిందని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపీకి పెద్దగా ఏమీ చేయలేదని కూడా ఉండవల్లి అంటున్నారు.
విభజన హామీల గురించి కోరడంలో ఏపీలోని టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు విఫలం చెందాయన్నది ఆయన భావనగా ఉంది అని అంటున్నారు. అందువల్ల పవన్ కళ్యాణ్ అయితే కచ్చితంగా ఏపీకి న్యాయం చేస్తారని ఆయన చెబుతున్నారని విశ్లేషిస్తున్నారు. మొత్తానికి ఉండవల్లి పవన్ సైడ్ తీసుకున్నారు అన్న మాట అయితే ఉంది. దాంతో ఆయన వైసీపీలో చేరేది ఉండదని స్పష్టమైందని అంటున్నారు.