ఉండవల్లి ఆసక్తికర వ్యాఖ్యలు... లక్ష్మీపార్వతి వల్లే ఎన్టీఆర్...!
లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ చాటుగా పెళ్లి చేసుకోలేదని.. అందరి సమక్షంలో బహిరంగ వేదిక మీద పెళ్లి చేసుకున్నారని ఉండవల్లి క్లారిటీ ఇచ్చారు
By: Tupaki Desk | 29 Aug 2023 4:33 AM GMTగత రెండు రోజులుగా ఎన్టీఆర్ 100 రూపాయల నాణెం విడుదల.. దాని తెరవెనుక రాజకీయం జరిగిందంటూ వస్తున్న కథనాలు.. హస్తిన వేధికగా ఏపీలో పొత్తుల చర్చల కథనాలు.. మరోవైపు తనకు అవమానం జరిగిందంటూ లక్ష్మీపార్వతి ఆవేదనతో కూడిన వార్తలు హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఈ విషయాలపై ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు.
అవును... ఆంధ్రప్రదేశ్ లో తాజా రాజకీయ పరిస్థితులపై సీనియర్ పొలిటీషియన్, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ఎన్టీఆర్ రూ.100 నాణెం విడుదల కార్యక్రమానికి.. లక్ష్మీపార్వతిని ఆహ్వానించకపోవడం సరైంది కాదని స్పష్టం చేశారు! ఇదే సమయంలో ఎన్టీఆర్ - లక్ష్మీ పార్వతి పెళ్లిపై కూడా ఆయన స్పందించారు.
లక్ష్మీపార్వతిని ఎన్టీఆర్ చాటుగా పెళ్లి చేసుకోలేదని.. అందరి సమక్షంలో బహిరంగ వేదిక మీద పెళ్లి చేసుకున్నారని ఉండవల్లి క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో... ఆమె వల్లే తాను బతికానని అప్పట్లో ఎన్టీఆర్ చెప్పారని ఉండవల్లి గుర్తు చేశారు. ఈని తెలిసీ... ఆ కార్యక్రమానికి లక్ష్మీపార్వతిని ఆహ్వానించకపోవడం సరికాదని అన్నారు.
ఇదే సమయంలో 1946 ఎన్నికల నుంచి కేవలం రెండు సామాజికవర్గాల మధ్యే రాజకీయం నడుస్తుందని గుర్తు చేసిన ఉండవల్లి... డబ్బులు తీసుకుని ఓటు వేసే సంస్కృతి పోవాలని, అందుకు అందరూ కలిసి పని చేయాలని సూచించారు. ఇదే సమయంలో చిరంజీవి ప్రజారాజ్యం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చిరంజీవి పార్టీ పెడితే ఈ రాష్ట్రంలో 16శాతం ఓట్లు వచ్చాయని తెలిపిన ఉండవల్లి... ఆ సమయంలో తాను అసెంబ్లీలో చిరంజీవిని కలుసుకుని కంగ్రాట్స్ చెప్పినట్లు తెలిపారు. అయితే ఓడిపోయినందుకు కంగ్రాట్స్ చేయడం కాదు.. దానికి వెనుక ఉన్న స్టోరీ వేరని ఉండవల్లి క్లారిటీ ఇచ్చారు.
ఇందులో భాగంగా 1991 నుంచి చిరంజీవి పార్టీ పెట్టిన 2009 వరకూ దేశంమొత్తం మీద కొత్తగా పెట్టిన ఏ పార్టీకీ కూడా 3శాతం కంటే ఎక్కువ ఓట్లు రాలేదు అని ఉండవల్లి చిరంజీవికి తెలిపారట. ఇదే సమయంలో పార్టీని జాగ్రత్తగా కాపాడుకొమ్మని చిరంజీవికి సూచించినట్లు ఉండవల్లి తెలిపారు.
ఇదే సమయంలో తాను కాంగ్రెస్ వాడిని అయ్యుండి కూడా... చిరంజీవి ప్రజారాజ్యాన్ని విలీనం చేయడానికి అయిష్టత చూపించినట్లు తెలిపారు. బయట నుంచి మద్దతు ఇవ్వండి తప్ప... విలీనం చేయొద్దని అడిగానని తెలిపారు. అయితే అప్పటికే అంతా అయిపోయినట్లుగా చిరు చెప్పారని ఉండవల్లి తెలిపారు. రాజకీయాలంటే కేవలం అధికారం అనుకోవడం కరెక్ట్ కాదని ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
కాగా... విజయవాడలో జరిగిన ఆంధ్రప్రదేశ్ లోక్ సభ, శాసన సభలో ఎవరెవరు? పుస్తక సమీక్ష కార్యక్రమంలో ఉండవల్లి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన.. మండలి బుద్ధప్రసాద్ తో కలిసి పుస్తకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఉండవల్లి అరుణ్ కుమార్ పై వ్యాఖ్యలు చేశారు.