జగన్ కు ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక సూచనలు.. అలా చేస్తే...!!
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. మరోపక్క ఎన్నికల ఫలితాలపై ఇంకా పలు విశ్లేషణలు సాగుతున్నాయి.
By: Tupaki Desk | 14 Jun 2024 10:17 AM GMTఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. మరోపక్క ఎన్నికల ఫలితాలపై ఇంకా పలు విశ్లేషణలు సాగుతున్నాయి. ప్రధానంగా ఈ ఘోర ఓటమిపై వైసీపీ సమీక్షలు నిర్వహించుకుంటుంది. మరోపక్క మండలిలోనూ, స్థానిక సంస్థల్లోనూ ఉన్న నేతలు ప్రలోభాలకు లొంగొద్దని సూచిస్తుంది. ఈ సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... ఏపీలో వైసీపీ ఘోర పరాజయం అనంతరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా స్పందించారు. ఇందులో భాగంగా... వైఎస్ జగన్ కు కీలక సూచనలు చేశారు. తమిళనాడులో గతంలో జరిగిన విషయాలను గుర్తు చేస్తూ కాస్త ధైర్యం చెప్పే ప్రయత్నాలు కూడా చేసినట్లు కనిపించారు! ఈ సందర్భంగా... ఓటమిపై సమీక్ష చేసుకుని తిరిగి పార్టీని నిలబెట్టుకోవాలని ఉండవల్లి సూచించారు.
వాస్తవాలు మాట్లాడుకోవాలంటే... వైసీపీకి జగన్ ఉన్నాడు, ఓటర్లు ఉన్నారు మధ్యలో వాలంటీర్లు ఉన్నారని. పక్కన మరో పార్టీ వాళ్లు జీతం 10వేలు చేస్తామని చెబుతుంటే వైసీపీ కోసం వాలంటీర్ ఎందుకు పనిచేస్తాడని ప్రశ్నించిన ఉండవల్లి... ఏపీలో వైసీపీ అనే పార్టీయే లేదని.. పార్టీ నిర్మాణమే జరగలేదని.. ఈ ఐదేళ్లు అయినా పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని సూచించారు!
ఆ విధంగా ఈ ఐదేళ్లలో అయినా పార్టీ నిర్మాణం జరగాలని జగన్ కు సూచించిన ఉండవల్లి... అధికార ప్రతినిధులను నియమించుకోవాలని.. వారికి ఎలా మాట్లాడాలో ట్రైనింగ్ ఇవ్వాలని తెలిపారు. పార్టీ స్పోక్స్ మేన్స్ అంటే బూతులు మాట్లాడటం కాదని కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలోనూ, బయటా బూతులే అంటే జనాలు హర్షించరని స్పష్టం చేశారు.
అసలు రాజకీయ పార్టీల నేతలకు సరిహద్దు గొడవలు ఏమైనా ఉంటాయా అన్నట్లుగా స్పందించిన ఆయన... ఎక్కడబడితే అక్కడ బూతులు మాట్లాడటం సరికాదని అన్నారు. అసలు గౌరవంగా మాట్లాడుకుంటే తప్పేమిటని ప్రశ్నించారు. ఈ సందర్భంగా... ప్రజలకు ప్రభుత్వానికి మధ్య పార్టీ ఉండాలి తప్ప వాలంటీర్లు కాదని జగన్ కు ఉండవల్లి సుత్తిలేకుండా సూటిగా చెప్పారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో తమిళనాడు తరహా రాజకీయాలు మొదలయ్యాయని చెప్పిన ఉండవల్లి... గతంలో కరుణానిధికి ఏడు స్థానాలు, జయలలితకు నాలుగు స్థానాలే వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అయినప్పటికీ వారు సక్రమంగా ప్రతిపక్ష పాత్ర పోషించడం వల్ల తిరిగి అధికారంలోకి వచ్చారని అన్నారు. ఇప్పుడు ఈ సూచనలు వైరల్ గా మారాయి!