మార్గదర్శి కేసు... బాబు కోర్టులో బంతి వేసిన ఉండవల్లి!
ఈ సమయంలో తాజాగా ఈ విషయాలపై స్పందించిన ఉండవల్లి అరుణ్ కుమార్... ఈ వ్యవహారంపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచీ కనీస స్పందన లేదని.
By: Tupaki Desk | 21 Aug 2024 10:02 AM GMTరెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యంత ఆసక్తికరమైన చర్చల్లో మార్గదర్శి కేసు ఒకటనే సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఎవరు కలిసి వచ్చినా, ఎవరు కలిసి రాకున్నా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాత్రం తన పోరాటం తాను సాగిస్తున్నారనే చెప్పాలి. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన కీలక విషయాలు వెల్లడిస్తూ ఏపీ సీఎం చంద్రబాబుకి ఓ సూచన చేశారు! ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
అవును... మార్గదర్శి కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా ఈ విషయాలపై స్పందించిన ఉండవల్లి అరుణ్ కుమార్... ఈ వ్యవహారంపై రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచీ కనీస స్పందన లేదని.. కనీసం హైకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలోనైనా ఏమైనా స్పందిస్తారేమో చూడాలని అన్నారు.
గతంలో జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ కేసులో ఇంప్లీడ్ కావడం వల్ల బలాన్నిచ్చిందని.. ఇప్పుడు చంద్రబాబు ఏమి చేస్తారో చూడాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే... సుప్రీంకోర్టు ఉత్తర్వ్యుల మేరకు తెలంగాణ హైకోర్టు ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించిందని.. మార్గదర్శి తరుపున సిద్ధార్థ్ లూద్రా వాదనలు వినిపించారని అన్నారు.
ఈ సందర్భంగా తమకు రెండు వారాల సమయం కావాలని కోరారని తెలిపారు. తాము ఎవరెవరికి డబ్బు చెల్లించిందీ 70వేల పేజీల్లో వివరాలను మార్గదర్శి సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేసిందని తెలిపారు. ఈ సమయంలోనే ప్రతీ ఒక్కరికీ వడ్డీతో సహా డబ్బు అందిందో లేదో పరిశీలించమని ఓక జ్యుడీషియరీ అడ్వైజర్ ను హైకోర్టులో నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని వెల్లడించారు.
ఈ సమయంలోనే సెప్టెంబర్ 11కి వాయిదా ఉందని.. ఈ విచారణ ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నా ఇటు రేవంత్, అటు చంద్రబాబు ప్రభుత్వాలు ఇప్పటివరకూ స్పందించలేదని ఉండవల్లి తెలిపారు. గతంలో జగన్ ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరుపున ఇంప్లిడ్ కావడంతో కేసులో కాస్త బలం వచ్చిందని తెలిపారు. అయితే... చంద్రబాబుకు రామోజీకి ఉన్న సన్నిహిత సంబంధాల మేరకు ఎలా స్పందిస్తారో చూడాలని అన్నారు.
వ్యక్తిగత సంబంధాల సంగతి కాసేపు పక్కనపెడితే... ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తేనే గౌరవం నిలబడుతుందని చెప్పిన ఉండవల్లి.. కానిపక్షలో కోర్టులో ఆలస్యం అవుతుందే తప్ప అన్యాయం మాత్రం జరగదని అన్నారు. రామోజీతో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ.. సీఎం హోదాలో బాబు విచారణకు సహకరించాలని.. రెండు ప్రభుత్వాలు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని ఉండవల్లి కోరారు.