ఉండవల్లి పిటిషన్ "నాట్ బిఫోర్ మీ"... జడ్జి కారణం ఇదే!
అయితే బెంచ్ చివరి నిమిషంలో తమ నిర్ణయం మార్చుకుంది. "నాట్ బిఫోర్ మీ" అంశంతో మరో బెంచ్ కు మార్చడంతో విచారణ వాయిదా పడింది.
By: Tupaki Desk | 27 Sep 2023 3:17 PM GMTఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం స్కిల్ డెవలప్ మెంట్ స్కాం మినహా మరో మాట వినిపించడం లేదన్నా అతిశయోక్తి కాదేమో. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండటం, మరోపక్క ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇప్పుడు రాజకీయాలు మొత్తం స్కిల్ స్కాం చుట్టునే తిరుగుతున్నాయి! ఈ రసవత్తర సమయంలో స్కిల్ స్కాం లోకి ఎంటరయ్యారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఈ సందర్భంగా ఆయన వేసిన పిటిషన్ లో ఒక చిన్న ట్విస్ట్ జరిగింది.
అవును... చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఎంటరయ్యారు. సీబీఐ ఎంక్వైరీని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అక్రమాస్తుల కేసులో జగన్ కు ప్రభుత్వానికి మధ్య వాదనలు జరుగుతున్నప్పుడు... జగన్ కు వ్యతిరేకంగా నాడు టీడీపీ నేతలు ఎలా రిట్ పిటిషన్ లు వేశారో ఆ విధంగా అన్నట్లుగా ఉంది అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పటికే టీడీపీ నేతలు ఉండవల్లిపై విమర్శలు మొదలుపెట్టేశారు!
ఆ సంగతి అలా ఉంటే... స్కిల్ స్కాంపై సీబీఐ విచారణ కోరుతూ ఉండవల్లి దాఖలు చేసిన పిటీషన్ పై చివరి నిమిషంలో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ పిటీషన్ పై విచారణకు సిద్ధపడిన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి రఘునందన్ రావు బెంచ్ కు వెళ్లింది. అయితే బెంచ్ చివరి నిమిషంలో తమ నిర్ణయం మార్చుకుంది. "నాట్ బిఫోర్ మీ" అంశంతో మరో బెంచ్ కు మార్చడంతో విచారణ వాయిదా పడింది.
వివరాళ్లోకి వెళ్తే... ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకు సంబంధించిన మొత్తం దర్యాప్తును సీబీఐతో జరిపించాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిల్ ను లిస్టింగ్ చేసిన ఏపీ హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టాల్సి ఉండగా... ఈ కేసు విచారణపై జస్టిస్ రఘునందన్ రావు విముఖత వ్యక్తం చేశారు. "నాట్ బిఫోర్ మీ" అని అన్నారు.
దానికి బలమైన కారణం ఉందని తెలుస్తుంది. ఉండవల్లి అరుణ్ కుమార్ పేర్కొన్న ప్రతివాదుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఈడీ, చంద్రబాబు నాయుడు, డిజైన్ టెక్, సీమెన్స్, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఉన్న సంగతి తెలిసిందే. దీంతో... గతంలో ఈ ప్రతివాదుల్లో కొందరి తరపున తాను మరో కేసు వాదించి ఉన్నందున ఈ కేసు తన ముందుకు రావడం మంచిది కాదని జస్టిస్ రఘునందన్ రావు అభిప్రాయపడ్డారు.
కేసును మరో బెంచ్ కు బదిలీ చేసిన తరువాత విచారణ తేదీ నిర్ణయిస్తారు. అప్పటి వరకూ కేసు విచారణ వాయిదా పడింది. కాగా... 44 మందిని ప్రతివాదులుగా చేరుస్తూ ఉండవల్లి పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ లో ప్రతివాదులుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, సీబీఐ, ఈడీ, చంద్రబాబు, అచ్చెన్నాయుడు తదితరులు ఉన్నారు.