జగన్ చంద్రబాబులకు అందుకే భయం...ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు...!
ప్రత్యేక హోదా సహా ఏపీకి విభజన చట్టంలో పేర్కొన్న ఏ ఒక్క హామీని సాధించలేకపోయారు అని ఉండవల్లి విమర్శించారు.
By: Tupaki Desk | 19 Feb 2024 5:20 AM GMTఏపీలో రెండు ప్రభుత్వాలు ఇద్దరు ముఖ్యమంత్రులు అయినా కూడా ఏపీకి న్యాయం జరగడం లేదు. ఇదే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆవేదన. గత అయిదేళ్ళూ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు బీజేపీతో పొత్తు ఉండి కూడా కేంద్రాన్ని నిలదీయలేకపోయారు. ప్రత్యేక హోదా సహా ఏపీకి విభజన చట్టంలో పేర్కొన్న ఏ ఒక్క హామీని సాధించలేకపోయారు అని ఉండవల్లి విమర్శించారు.
ఇపుడు జగన్ కూడా అదే చేశారని ఆయన నిందించారు. అయిదేళ్ళు సీఎం గా ఉన్న జగన్ విభజన చట్టాన్ని అమలు చేయమని ఎందుకు కోరడంలేదు అని ఆయన ప్రశ్నించారు. ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. నాడు చంద్రబాబు నేడు జగన్ ఇద్దరూ కేసుల భయంతోనే భయపడుతున్నారని జనాలు అనుకుంటున్నారని అన్నారు.
కేసులు ఈ దేశంలో ఎవరి మీద లేవని ఆయన ప్రశ్నించారు. నిజయతీపరుడిని అని చెప్పుకుంటున్న కేజ్రీవాల్ మీదనే కేసులు ఉన్నాయని అన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు కి ధీటుగా మార్చిన ఆప్ మంత్రి సిసోడియాను ఏడాదికి పైగా జైలులో ఉంచారని ఆయన గుర్తు చేశారు. కేసులకు భయపడడం అన్నది తప్పు అని అన్నారు.
జైలుకు వెళ్ళిన ప్రతీవారూ గెలుస్తూనే ఉన్నారని జగన్ నుంచి రేవంత్ రెడ్డి వరకూ అందరూ సీఎంలు అయ్యారు అని ఆయన చెప్పుకొచ్చారు. చంద్రబాబు కూడా ఇపుడు జైలుకు వెళ్లారు. ఆయన కూడా గెలుస్తారు అని అంటున్నారు అని ఉండవల్లి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.
కేసులకు భయపడడం అన్నది దండుగ అని ఆయన చెప్పారు. జైలుకు వెళ్ళినా అధికారం దక్కుతోంది అన్నది రుజువు అయినపుడు కేంద్రాన్ని నిలదీసి రాష్ట్రానికి న్యాయం చేయడానికే నేతలు నిలబడాలని ఆయన సూచించారు.
ప్రజలు అవినీతిపరులను భరిస్తారు కానీ పిరికివారిని కానే కాదని ఆయన అన్నారు. అవినీతిలో తక్కువ అవినీతిపరుడుని ఎంచుకుని ఓటేస్తారు కానీ ఎన్నికలను మానేయలేరు అని ఆయన అన్నారు. అందుకే నోటాకు ఓట్లు పడడంలేదని ఆయన విశ్లేషించారు. బజారులో టమాటాలు పుచ్చిపోయినవి ఉంటే తక్కువ పుచ్చిపోయినవి ఎంచుకుంటామని అలాగే రాజకీయాలలో కూడా తక్కువ అవినీతికే ప్రజలు ఎంచుకుని ఓటేస్తున్నారు అని ఉండవల్లి తనదైన మార్క్ విశ్లేషణ వినిపించారు
అయినా సరే ప్రజలు పిరికి వారిని మాత్రం ఎప్పటికీ ఎన్నుకోరని అన్నారు. ఏపీని అన్యాయం చేశారని అంటున్న నాయకులు ఢిల్లీలోని కేంద్రాన్ని ఎందుకు నిలదీయరని ఆయన ప్రశ్నించారు. తలుపులు అన్నీ మూసేసి దారుణంగా విభజన చేశారని, ఇక విభజన చట్టం కూడా లోపభూయిష్టంగా ఉందని ఆయన విమర్శించారు. అలాంటి చట్టాన్ని కూడా కేంద్రం అమలు చేయడంలేదని, పోనీ దానిని అయినా అమలు చేయండి అని కేంద్రాన్ని అడిగేందుకు ఏపీలో అధికార ప్రతిపక్ష పార్టీల అధినేతలు సిద్ధంగా లేకపోవడం దారుణమని ఉండవల్లి అన్నారు. మొత్తానికి బాబు జగన్ ఇద్దరూ పిరికి నేతలుగా జనాలు భావిస్తున్నారు అని ఉండవల్లి తేల్చేశారు.