Begin typing your search above and press return to search.

దేశంలో ఉపాధి పరిస్థితిని బట్టబయలు చేసిన సర్వే... మోడీపై కాంగ్రెస్ నిప్పులు!

అవును... ఇటీవల కాలంలో దేశంలో నిరుద్యోగిత రేటు ఎక్కువగా పెరిగిపోయిందని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ తాజా నివేదికలో పేర్కొంది.

By:  Tupaki Desk   |   27 March 2024 4:04 PM GMT
దేశంలో ఉపాధి పరిస్థితిని బట్టబయలు చేసిన సర్వే... మోడీపై కాంగ్రెస్  నిప్పులు!
X

భారత్ లో నిరుద్యోగం పెరిగిపోయిందని.. మోడీ చెబుతున్న మాటలకు, వాస్తవాలకూ ఏమాత్రం పొంతన లేదని.. ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తాజాగా ఒక నివేదిక ఆ ఆందోళనకు బలం చేకూర్చింది. ఇందులో భాగంగా... తాజాగా నిరుద్యోగంలో భారత యువత వాటా సుమారు 83శాతం అని "ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ - 2024" పేరుతో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐ.ఎల్.వో) తాజా నివేదికలో పేర్కొంది.

అవును... ఇటీవల కాలంలో దేశంలో నిరుద్యోగిత రేటు ఎక్కువగా పెరిగిపోయిందని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ తాజా నివేదికలో పేర్కొంది. ఇదే సమయంలో... దేశంలో ఈ సమస్యను ఎదుర్కొంటున్న వారిలో 83శాతం మంది యువతేనని ఇనిస్టిట్యూట్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్ (ఐ.హెచ్.డీ) చేసిన అధ్యయనంలో వెల్లడైనట్లు తెలిపింది.

ఇదే సమయంలో... నాణ్యమైన ఉపాధి అవకాశాలు లేకపోవడంతో యువత, ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసించిన వారు అత్యధిక స్థాయిలో నిరుద్యోగంలో ఉన్నారని తాజా నివేదిక పేర్కొంది. మరోవైపు తక్కువ వేతనాలకు మహిళా శ్రామిక శక్తి అందుబాటులో ఉండటంతో... దేశ కార్మిక రంగంలో కూడా గణనీయమైన లింగ అంతరం సవాళ్లను ఎదుర్కొంటుందని తెలిపింది!

ఈ నేపథ్యంలో... ఈ నివేదిక విడుదల సందర్భంగా స్పందించిన భారత ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ మాట్లాడుతూ... ప్రభుత్వ జోక్యంతోనే ప్రతీ సామాజిక, ఆర్థిక సమస్య పరిష్కారం అవుతుందని భావించడం సరికాదని అన్నారు. ఇదే సమయంలో... నిరుద్యోగం వంటి సమస్యల విషయంలో పరిష్కారం కంటే సమస్యను గుర్తించడమే తేలికని చెప్పుకొచ్చారు. దీంతో... ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్ అయ్యింది.

ఇందులో భాగంగా... పదేళ్లలో దేశంలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రధాని మోడీ, కోట్ల మంది నిరుద్యోగ యువతకు భరోసా కల్పించలేకపోయారని కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నిప్పులు చెరిగారు. ఇదే సమయంలో... భారత ముఖ్య ఆర్థిక సలహాదారు చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యపరిచాయని.. నిరుద్యోగ సమస్యను ప్రభుత్వం పరిష్కరించలేదని చెప్పడం భయంకరమైన విషయమని కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం పేర్కొన్నారు.