Begin typing your search above and press return to search.

ఎంపీ సీట్ల కోసం దోస్తీ కటీఫ్.. బీజేపీ సీఎం అనూహ్య రాజీనామా!

మంత్రి మండలి సభ్యులు కూడా రాజీనామాలను సమర్పించారు.

By:  Tupaki Desk   |   12 March 2024 7:38 AM GMT
ఎంపీ సీట్ల కోసం దోస్తీ కటీఫ్.. బీజేపీ సీఎం అనూహ్య రాజీనామా!
X

ఉత్తరాది రాష్ట్రం హరియాణలో ఏదో జరుగుతోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అనూహ్యంగా రాజీనామా చేశారు. దీంతో ఎందుకింత నిర్ణయం తీసుకున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. హరియాణలో బీజేపీ ప్రభుత్వమే ఉంది. దీని పొరుగున ఉండే హిమాచల్ ప్రదేశ్ లో వాస్తవానికి రాజకీయ సంక్షోభం నెలకొంది. అక్కడ కాంగ్రెస్ సర్కారు ఉండడం, ఇటీవల ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. ఇంతలోనే హరియాణ సీఎం రాజీనామా చేశారు. మంత్రి మండలి సభ్యులు కూడా రాజీనామాలను సమర్పించారు. ఈ రోజే కొత్త ముఖ్యమంత్రిని ఎన్నుకోనున్నారు.

ఖట్టర్ విఫలమయ్యారా?

హరియాణ సీఎంగా రెండోసారి కొనసాగుతున్నారు మనోహర్ లాల్ ఖట్టర్. 10 ఏళ్లుగా ఆయన పీఠంపై ఉన్నారు. రెండుసార్లు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సీట్లు తగ్గినా ఖట్టర్ పై నమ్మకం ఉంచి మరోసారి సీఎంను చేశారు. అయితే, లోక్ సభ ఎన్నికల ముంగిట రాష్ట్రంలో అనూహ్య పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. కాగా, హరియాణాలో బీజేపీ, దుష్యంత్ చౌతాలా నాయకత్వంలోని జన నాయక్ జనతా పార్టీ (జేజేపీ)తో అధికారం పంచుకుంటోంది. లోక్‌ సభ ఎన్నికల సీట్ల పంపకంపై ఈ కూటమిలో విభేదాలు తలెత్తాయి. దీంతోనే బీజేపీ కటీఫ్ చెప్పినట్లు తెలుస్తోంది. సీఎం ఖట్టర్ తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌ కు సమర్పించారు. మంత్రిమండలి సభ్యులు కూడా రాజీనామా చేశారు.

సొంతంగానే సర్కారు..

జేజేపీని వదిలించుకుని బీజేపీ హరియాణలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధం అవుతోంది. ఆ రాష్ట్ర అసెంబ్లీలో 90 మంది సభ్యులున్నారు. ప్రభుత్వ ఏర్పాటకు 46 సీట్లు అవసరం. 2019లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. బీజేపీ (41)కి మెజారిటీ తక్కువ సీట్లు రావడంతో జేజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. వీరికి ఆరుగురు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతు ఉంది. జేజేపీకి 10 మంది, కాంగ్రెస్‌ కు 30 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇప్పుడు స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. మంగళవారమే బీజేపీఎల్పీ సమావేశం నిర్వహించి తదుపరి సీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సీఎం రేసులో నయబ్‌ సైనీ ఉన్నట్లు సమాచారం.

లోక్ సభ బరిలో సీఎం

హరియాణ సీఎంగా రాజీనామా చేసిన ఖట్టర్ కర్నాల్ నుంచి లోక్ సభకు పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, జేజేపీ అధినేత దుష్యంత్ చౌతాలా బీజేపీ అగ్ర నేత అమిత్ షాను మంగళవారం కలవనున్నారు. దీనికిముందే ఆ పార్టీతో అవసరం లేనట్లుగా బీజేపీ తెగదెంపులు చేసుకోవడం గమనార్హం.