షర్మిలకు ఊహించని షాక్.. వైఎస్సార్ టీపీ నేతల ఫైర్
ఇప్పటి వరకు వైసీపీపైనా.. సీఎం జగన్ పైనా తీవ్రస్తాయిలో రెచ్చిపోయిన షర్మిలకు.. ఇప్పుడు భారీ సవాలే ఎదురైంది.
By: Tupaki Desk | 28 Jan 2024 10:56 AM GMTఏపీలో కాంగ్రెస్ పార్టీ పీసీసీ పగ్గాలు చేపట్టిన వైఎస్ షర్మిలకు ఊహించని షాక్ తగిలింది. ఇప్పటి వరకు వైసీపీపైనా.. సీఎం జగన్ పైనా తీవ్రస్తాయిలో రెచ్చిపోయిన షర్మిలకు.. ఇప్పుడు భారీ సవాలే ఎదురైంది. తెలంగాణలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ(వైఎస్సార్ టీపీ) పేరుతో ఆమె పార్టీ పెట్టినప్పుడు.. ఆమె వెంట నడిచిన నాయకులు.. ఇప్పుడు ఏపీలోకి అడుగు పెట్టారు. తాజాగా షర్మిలపై వారు నిప్పులు చెరిగారు. తమను షర్మిల నమ్మించి మోసం చేసిందని అన్నారు.
``షర్మిలను నమ్మినం. ఆమె పార్టీ పెడితే.. ఆమె వెంటే నడిచినం. పాదయాత్ర చేస్తే.. డబ్బులు కూడా ఖర్చు పెట్టాం. అప్పులు చేసి మరీ తీసుకువచ్చి.. ఇచ్చాం. ఎన్నికల్లో పోటీ చేస్తామని.. టికెట్ ఇస్తామని చెబితే.. షర్మిలను నమ్ముకున్నాం. కానీ, మాకు ఏమాత్రం వాల్యూ ఇవ్వకుండా.. కనీసం మాకు మాట మాత్రం కూడా చెప్పకుండానే ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకొన్నామని ప్రకటించేసింది. ఆ తర్వాత.. పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేసింది. మరి మా పరిస్థితి ఏంది? ఇది మోసం కాదా? `` అని వైఎసార్ టీపీలో కీలక రోల్ పోషించి న నాయకుడు తమ్మాలి బాలరాజు ప్రశ్నించారు.
తాజాగా ఆయన విజయవాడకు వచ్చి.. ప్రెస్ మీట్ పెట్టారు. షర్మిల పక్కా మోసకారి అని వ్యాఖ్యానించారు. అసలు తెలంగాణలో ఉన్నప్పుడు.. ఏపీకి నీళ్లు చుక్క కూడా ఇచ్చేది లేదని, ఏపీ విషయంలో కఠినంగానే ఉండాలని, నాగార్జున సాగర్‌పై జరిగిన వివాదంపై తీవ్రంగా స్పందించారని, ఏపీ ప్రజలను అవమానించా రని.. అలాంటి షర్మిలను ఏపీలోకి ఎందుకు అడుగు పెట్టనిచ్చారని బాలరాజు ప్రశ్నించారు. త్వరలోనే ఆమె చేస్తున్న ప్రచారానికి కౌంటర్ ప్రచారం చేస్తామని బాలరాజు తెలిపారు.
అదేసమయంలో కాంగ్రెస్ అంటే.. వైఎస్ రాజశేఖరరెడ్డికి ఎంతో మక్కువనేది నిజమేనని, కానీ, కాంగ్రెస్ మాత్రం ఎప్పుడో ఆయనను వదిలించుకుందని బాలరాజు అన్నారు. అందుకే ప్రస్తుతం షర్మిల చేస్తున్న ప్రచారంలో ఉన్న కాంగ్రెస్ జెండాల్లో కానీ.. పార్టీ కార్యాలయాల్లో కానీ.. కనీసం వైఎస్ చిత్రపటం లేదని విమర్శించారు. ఇలాంటి పార్టీకి షర్మిల కొమ్ముకాయడం ఏంటని ప్రశ్నించారు. తాము ప్రచారం మొదలు పెడితే.. షర్మిల తట్టుకోలేరని అన్నారు.