Begin typing your search above and press return to search.

ఇజ్రాయెల్‌కు ఊహించని పరిణామం.. ప్రధాని లక్ష్యంగా..

దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతూనే ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ వాతావరణం కనిపిస్తూనే ఉంది.

By:  Tupaki Desk   |   17 Nov 2024 7:00 AM GMT
ఇజ్రాయెల్‌కు ఊహించని పరిణామం.. ప్రధాని లక్ష్యంగా..
X

దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతూనే ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ వాతావరణం కనిపిస్తూనే ఉంది. హెజ్బొల్లా అంతమే లక్ష్యంగా కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. హమాస్, హెజ్బొల్లా లక్ష్యంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడుల్లో ఇప్పటికే వందలాది మంది చనిపోయారు. ఆ మధ్య హెజ్బొల్లా అధినేత నస్రల్లాను హతమార్చి ఆ సంస్థను దారుణమైన దెబ్బతీశారు. తాజాగా.. ఇజ్రాయెల్‌కు ఊహించని దెబ్బతగిలింది.

ఇప్పటివరకు పైచేయి సాధిస్తూ వచ్చిన ఇజ్రాయెల్‌కు అనూహ్య పరిణామం ఎదురైంది. ఏకంగా ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నివాసంపై దాడి చేశారు. ఆయన స్వస్థలం సిజేరియాలో నిన్న అర్ధరాత్రి దాటిన తరువాత నెతన్యాహును టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడ్డారు. గుర్తు తెలియని వ్యక్తులు రెండు ఫ్లాష్ బాంబులను ఆయన నివాసంపై విసిరారు. అయితే.. ఈ రెండు కూడా ఆయన ఇంటి ఆవరణలోనే పడడంతో ఎలాంటి ప్రాణనష్టం కానీ, ఆస్తినష్టం కానీ సంభవించలేదు. అయితే.. ఈ ఘటన జరిగినప్పుడు ప్రధాని నెతన్యాహు గానీ, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఆ ఇంట్లో లేరు. కాగా.. ఈ ఫ్లాష్ బాంబులను ఎవరు విసిరారు..? ఈ దాడికి పాల్పడింది ఎవరు..? అనేది ఇంకా క్లారిటీ రాలేదు.

ఈ ఘటనపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని ఇజ్రాయెల్ పోలీసులు, షిన్‌బెట్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఏజెన్సీ అధికారులు వెల్లడించారు. మిలిటెంట్ గ్రూపులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. హైఫా నగరానికి దక్షిణం వైపుల 20 కిలోమీటర్ల దూరంలో సిజేరియా ఉంటుంది. తరచూ హెజ్బొల్లా ఈ ప్రాంతంపై దాడులు సాగిస్తుంటుంది. నెతన్యాహు నివాసం ఉంటున్న ప్రాంతాన్ని హైసెక్యూరిటీ జోన్‌గా ప్రకటించారు.

హమాస్, హెజ్బొల్లా లక్ష్యంగా ఇన్నాళ్లు రెచ్చిపోయిన ఇజ్రాయెల్‌కు ఇది ఊహించని పరిణామం అనే చెప్పాలి. గతంలోనే చాలా సార్లు నెతన్యాహుకు బెదిరింపులు వచ్చాయి. చంపేసి తీరుతామంటూ ఆ సంస్థలు ప్రకటించాయి. అయినప్పటికీ ఎక్కడా వెనక్కి తగ్గకుండా తమ దాడులను కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే.. నెతన్యాహు ఇంటిపై ఇలా బాంబులను కురిపించడం నెలరోజుల వ్యవధిలో ఇది రెండోసారి. కాగా.. ఈ దాడుల కోసం మూడు అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్స్‌ను వినియోగించినట్లుగా ఇజ్రాయెల్‌కు చెందిన హీబ్రూ అనే మీడియా కథనాన్ని ప్రచురించింది. మరోవైపు.. ఈ దాడిపై ఇజ్రాయెల్ సైతం తీవ్రంగా స్పందించింది. నెల రోజుల్లోనే రెండు సార్లు ప్రధాని లక్ష్యంగా చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. ఈ ఘటనపై ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇసాక్ హెర్జోగ్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.