స్కాన్ చేశామా.. పేమెంట్ కొట్టామా.. యూపీఐ సరికొత్త రికార్డ్స్!
అవును... ప్రస్తుతం చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయడం, పేమెంట్ చేయడం ఇప్పుడు ట్రెండ్ అనే చెప్పాలి
By: Tupaki Desk | 20 Dec 2023 3:15 AM GMTప్రస్తుతం నోట్ల చలామణి బాగా తగ్గిందనే చెప్పాలి. చిల్లర సమస్యో.. లేక, ఏటీఎం లలో చిన్న నోట్లు దొరకని ఇబ్బందో.. కారణం ఏదైనా కానీ... ఇప్పుడు చాలామంది ఏ చిన్న వస్తువు కొనాలన్నా యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా.. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూనిఫైడ్ ఫేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) యాప్స్ తో చెల్లింపులు సాగిస్తున్నారు. ఈ సమయంలో ఇవి ఏ స్థాయిలో ఉన్నాయనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
అవును... ప్రస్తుతం చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయడం, పేమెంట్ చేయడం ఇప్పుడు ట్రెండ్ అనే చెప్పాలి. దీంతో చిన్న బడ్డీ కొట్టు నుంచి మల్టీ ఫ్లెక్స్ వరకూ యూపీఐ పేమెంట్స్ హవా నడుస్తుంది. ఈ సమయంలో యూపీఐ పేమెంట్లకు సంబంధించి కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి భగవత్ కె కరాడ్ పార్లమెంట్ లో కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా యూపీఐ పేమెంట్ల వృద్ధిని తెలిపారు.
దేశీయంగా డిజిటల్ చెల్లింపుల వృద్ధిలో "యూపీఐ"దే ప్రధాన భూమిక అని భగవత్ కె కరాడ్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో చలామణిలో ఉన్న నోట్ల విలువలో వృద్ధి 7.8 శాతానికి తగ్గేందుకు ఈ చెల్లింపుల విధానం దోహదం చేసిందని ఆయన రాజ్యసభలో వెల్లడించారు. 2017-18లో యూపీఐ లావాదేవీల సంఖ్య 92 కోట్లుగా ఉండగా... 2022-23లో 8,375 కోట్లకు పెరిగాయని.. లావాదేవీల సంఖ్యాపరంగా 147 శాతం వార్షిక వృద్ధి అని అన్నారు.
ఇదే సమయంలో... యూపీఐ లావాదేవీల విలువ కూడా భారీగా పెరిగిందని చెప్పిన మంత్రి... 2017-18లోని రూ.1 లక్ష కోట్ల నుంచి 2022-23లో రూ.139 లక్షల కోట్లకు చేరిందని పేర్కొన్నారు. ఇది సుమారు 168 శాతం వృద్ధి అని వెల్లడించారు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) డిసెంబరు 11 వరకు యూపీఐ మొత్తం లావాదేవీల సంఖ్య 8,572 కోట్లుగా మంత్రి తెలిపారు.
అదేవిధంగా... యూపీఐతో రూపే క్రెడిట్ కార్డుల అనుసంధానానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. దీనివల్ల క్రెడిట్ కార్డులను తమతో తీసుకెళ్లకుండానే చిన్న విక్రయ కేంద్రాల్లో కూడా కొనుగోళ్లకు చెల్లింపులు చేసే అవకాశం వినియోగదారులకు ఉంటుందని మంత్రి తెలిపారు. ఫలితంగా రాబోయే కాలంలో ఈ పేమెంట్ల సంఖ్య భారీ ఎత్తున పెరగనుందని అంటున్నారు!
ఇక బ్యాంకింగ్ నియంత్రణ చట్టం- 1949లోని 35ఏ సెక్షన్ కింద 2023 డిసెంబరు 13 నాటికి 39 పట్టణ సహకార బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ కేంద్రానికి సమాచారం ఇచ్చిందని మంత్రి కరాడ్ పేర్కొన్నారు. ఇదే సమయంలో... గడిచిన తొమ్మిదేళ్లలో 57 బ్యాంకులను మూసివేసినట్లు వెల్లడించారు.
అదే విధంగా... పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంక్, యెస్ బ్యాంక్ లను పునరుద్ధరించినట్లు మంత్రి పేర్కొన్నారు.