Begin typing your search above and press return to search.

మొదట్లో ఒకే టైంలో.. ఆ తర్వాత ఎందుకు మారిందంటే?

మళ్లీ.. ఇప్పుడు తొలినాటి తరహాలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు మోడీ సర్కారు పట్టుదలతో ఉంది.

By:  Tupaki Desk   |   19 Sep 2024 9:30 AM GMT
మొదట్లో ఒకే టైంలో.. ఆ తర్వాత ఎందుకు మారిందంటే?
X

ఒకేసారి లోక్ సభ.. అసెంబ్లీ ఎన్నికల్ని దేశ వ్యాప్తంగా ఒకే ధఫాలో నిర్వహించేందుకు వీలుగా జమిలి సిస్టంను తెర మీదకు తీసుకొచ్చింది మోడీ సర్కార్. తాజాగా కేబినెట్ భేటీలో ఆమోద ముద్ర వేయటంతో.. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మోడీ సర్కారు బిల్లును ప్రవేశ పెట్టనుంది. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేవారు. ఆ తర్వాత కాలంలో ఆ చెయిన్ బ్రేక్ అయ్యింది. మళ్లీ.. ఇప్పుడు తొలినాటి తరహాలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు మోడీ సర్కారు పట్టుదలతో ఉంది.

స్వాతంత్య్రం వచ్చిన మొదట్లో ఏం జరిగింది? ఆ తర్వాతేం జరిగింది? అన్న వివరాల్లోకి వెళితే..

1951-52, 1957, 1962, 1967

ఈ సంవత్సరాల్లో లోక్ సభ.. అసెంబ్లీలకు ఒకే టైంలో ఎన్నికలు జరిగాయి. ఒకేసారి లోక్ సభకు.. రాష్ట్రాల శాసనసభలకు ఓకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా బిహార్.. బొంబాయి.. మద్రాస్.. మైసూర్.. పంజాబ్.. యూపీ.. పశ్చిమబెంగాల్ అసెంబ్లీలకు వాటి పదవీకాలానికి ముందే రద్దు చేశారు.

1961-70

ఈ పదేళ్ల కాలంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. దేశంలోని కొన్నిరాష్ట్రాల్లో అదే పనిగా ఎన్నికలు జరిగాయి. ఆ రాష్ట్రాల్లో బిహార్.. కేరళ.. పంజాబ్.. యూపీ.. పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లోని పరిస్థితులకు అనుగుణంగా మూడేసి సార్లు ఎన్నికలు జరిగిన పరిస్థితి.

1971-80

ఈ పదేళ్ల కాలంలో మరిన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. స్థానిక రాజకీయ పరిణామాలు.. కాంగ్రెస్ పార్టీ అధిక్యతను కాపాడుకోవటానికి పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అదే పనిగా మారాల్సిన దుస్థితి. దీనికి తగ్గట్లే ఈ పదేళ్ల కాలంలో ఏకంగా 14 రాష్ట్రాల్లో మూడేసి సార్లు ఎన్నికలు జరిగాయి. ఇక.. ఒడిశాలో అయితే ఏకంగా నాలుగుసార్లు ఎన్నికలు జరగటం గమనార్హం.

1981-90

ఐదు రాష్ట్రాల్లో మూడేసి సార్ల చొప్పున ఎన్నికలునిర్వహించారు.

1983

ఇక్కడో అంశాన్ని ప్రస్తావించాలి. అదే పనిగా రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహించాల్సి వస్తున్న నేపథ్యంలో.. ఎన్నికల సంఘం తన వార్షిక నివేదికలో జమిలి ఎన్నికల ఆలోచనను తెర మీదకు తీసుకొచ్చింది. కానీ.. దానిపై పెద్దగా నాటి ప్రభుత్వం ఫోకస్ చేయలేదు.

1991-2000

2 రాష్ట్రాల్లో మూడేసి సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. లోక్ సభ అయితే ఏకంగా నాలుగుసార్లు ఎన్నికలకు వెళ్లిన పరిస్థితి.

2000 తర్వాత నుంచి జమిలి ఎన్నికల అంశం పలుమార్లు చర్చకు వచ్చింది. వేర్వేరు ఎన్నికల నిర్వహణకు బదులుగా.. ఒకే టైంకు అన్ని ఎన్నికలు పూర్తి చేసే అంశంపై చర్చ మొదలైంది. ఇదే అంశాన్ని పలు రాజ్యాంగ వ్యవస్థలు సైతం సిఫార్పు చేశాయి. జమిలి ఎన్నికల అంశాన్ని రాజ్యాంగ పని తీరుపై రివ్యూ చేసేందుకు ఏర్పాటు చేసిన జాతీయ కమిషన్ కూడా పేర్కొంది. లా కమిషన్ కూడా పలుమార్లు జమిలి ఎన్నికలకు సిఫార్సు చేసింది. న్యాయశాఖల స్థాయి సంఘం సైతం ఇదే అంశాన్ని 2015లో పేర్కొనగా.. 2017లో నీతి ఆయోగ్ సైతం జమిలి ఎన్నికలపై సానుకూలత వ్యక్తం చేసింది. 2019లో దేశ రాజధానిలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలోనూ ఈ అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. తాజాగా కేంద్ర కేబినెట్ జమిలికి ఓకే చెప్పటంతో.. కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి.