ఎవరీ జ్ఞానేష్ కుమార్?
భారత ఎన్నికల సంఘానికి కొత్త సారథిగా జ్ఞానేష్ కుమార్ ఎంపికయ్యారు. అదే సమయంలో ఎన్నికల కమిషనర్ గా వివేక్ జోషి నియమితులయ్యారు.
By: Tupaki Desk | 18 Feb 2025 5:50 AM GMTభారత ఎన్నికల సంఘానికి కొత్త సారథిగా జ్ఞానేష్ కుమార్ ఎంపికయ్యారు. అదే సమయంలో ఎన్నికల కమిషనర్ గా వివేక్ జోషి నియమితులయ్యారు. సోమవారం అర్థరాత్రి 2 గంటల ప్రాంతంలో రెండు గెజిట్ నోటిఫికేషన్లు వేర్వేరుగా విడుదలయ్యాయి. ఉత్తర్వుల ప్రకటన వెలువడటానికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేత్రత్వంలో త్రిసభ్య కమిటీ భేటీ అయ్యింది. ఈ కమిటీలో సభ్యులుగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ.. కేంద్ర మంత్రి అమిత్ షా.. లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలు సభ్యులుగా ఉన్నారు.
చీఫ్ ఎన్నికల కమిషనర్ (సీఈసీ).. ఎన్నికల కమిషనర్ (ఈసీ) పదవులకు ఎంపిక చేయాల్సిన పేర్లపై చర్చలు జరిపారు. చివరకు సారథిగా జ్ఞానేష్ కుమార్.. ఎన్నికల కమిషనర్ గా వివేక్ జోషిల ఎంపిక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు. అయితే.. కొత్త చట్టం ప్రకారం సీఈసీని నియమించటంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్ పై ఈ నెల 19న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో సుప్రీం విచారణ ముగిసే వరకు కొత్త సీఈసీ నియామకంపై నిర్ణయాన్ని వాయిదా వేయాలని కమిటీలో సభ్యుడైన రాహుల్ గాంధీ సూచన చేసినట్లుగా చెబుతున్నారు. అయితే..అందుకు భిన్నంగా ఎంపిక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
దీంతో.. తాము ఎంపిక చేసిన పేర్లను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సిఫార్సు చేశారు. అందుకు ఆమె ఓకే చెప్పటం.. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనలు వెలువడ్డాయి. ఈసారి ఎంపికలో ప్రత్యేకత ఏమంటే.. ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించి 2023లో తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం చేపట్టిన మొదటి ఎంపికగా దీన్ని చెప్పాలి. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం సారథిగా ఉన్న రాజీవ్ కుమార్ పదవీ కాలం ఈ రోజు (మంగళవారం)తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎంపికల కమిటీ ఢిల్లీలోని ప్రధాని కార్యాలయంలో భేటీ అయ్యింది.
తాజా ఎంపికకు సంప్రదాయాన్నే ఫాలో అయినట్లు చెబుతున్నారు. ఇప్పటివరకు ఎన్నిక కమిషన్ లో ఎవరైతే సీనియరో.. వారికే చీఫ్ పదవిని కట్టబెడుతుంటారు. ఇదే విధాన్ని ఇప్పుడు కూడా ఫాలో అయ్యారని చెప్పాలి. రాజీవ్ కుమార్ తర్వాత అత్యంత సీనియర్ జ్ఞానేష్ కుమార్. అందుకే ఆయనకు ఈ పదవిని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఆయన చీఫ్ గా ఎంపిక కావటంతో ఆయన స్థానం ఖాళీ అయ్యింది. అందుకే వివేక్ జోషిని ఎంపిక చేశారు.
ఇక.. జ్ఞానేష్ కుమార్ విషయానికి వస్తే ఆయన కేరళ క్యాడర్ కు చెందిన ఐఏఎస్ అధికారి. 1988 బ్యాచ్ కు చెందిన వారు. ప్రస్తుతం ఆయన వయసు 6 1 ఏళ్లు. ఆయన ఈ పదవిలో 2029 జనవరి 26 వరకు కొనసాగుతారు. ఆయన కెరీర్ మొత్తంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన సందర్భం ఒకటి ఉంది. అదే 2019లో కేంద్ర ప్రభుత్వం (మోడీ సర్కారు) అధికరణం 370 కోసం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన బిల్లును రూపొందించటంలో ఆయనదే కీలక పాత్ర.
అప్పట్లో ఆయన కేంద్ర హోంశాఖలో సంయుక్త కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు అత్యంత సన్నిహితులుగా పేరుంది. ఆ తర్వాత ఆయన సహకార శాఖ కార్యదర్శిగా 2024 జనవరిలో రిటైర్ అయ్యాక.. ఎన్నికల కమిషనర్ గా నియమితులయ్యారు. ఆయన హయాంలోనే బిహార్.. తమిళనాడు.. పుదుచ్చేరి.. పశ్చిమ బెంగాల్.. అసోం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.