కేంద్రం గుడ్‌న్యూస్.. సరోగసీ మదర్స్‌కూ సెలవులు
అనారోగ్యం కానీ.. వివిధ కారణాల వల్ల ఇబ్బందులు పడుతున్న మహిళలు గర్భం దాల్చేందుకు అవకాశాలు ఉండవు.
By: Tupaki Desk | 27 Sep 2024 12:30 PM GMTఅనారోగ్యం కానీ.. వివిధ కారణాల వల్ల ఇబ్బందులు పడుతున్న మహిళలు గర్భం దాల్చేందుకు అవకాశాలు ఉండవు. వారికోసమే సరోగసీ అనే పద్ధతి అమల్లోకి వచ్చింది. సాధారణ పద్ధతిలో పిల్లలు పుట్టే అవకాశం ఉన్నప్పటికీ.. కొన్ని కారణాల వల్ల అద్దె గర్భాన్ని ఆశ్రయిస్తుంటారు మహిళలు. గత కొన్ని సంవత్సరాలుగా సరోగసీ అనే పదం ప్రాచూర్యంలోకి వచ్చింది. చాలా మంది దంపతులు మమ్మీ డాడీ అని పిలిపించుకునేందుకు ఆ పద్ధతిలో వెళ్తున్నారు. సరోగసీ అంటే అద్దె గర్భం ద్వారా బిడ్డకు జన్మనివ్వడం.
ఇప్పటికే ఈ కల్చర్ మన దేశంలోనూ చాలా వరకూ పెరిగింది. అయితే.. చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇదే పద్ధతిని ఆశ్రయిస్తున్నారు. అయితే అలాంటి వారికోసం కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. 50 ఏళ్ల నాటి నిబంధనలను సవరించింది. సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్, 1972 సరోగసీని ఎంచుకునే కమిషన్ మదర్స్‌ను నవీకరించింది. సరోగసీ ద్వారా తల్లులైన ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు ఆరు నెలల లీవ్ ఆప్షన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికింద మహిళలకు 180 రోజులపాటు సెలవులు లభిస్తాయి. అలాగే.. తండ్రి కూడా 15 రోజులు పితృత్వ సెలవు కూడా తీసుకునే అవకాశం ఇచ్చింది. అయితే.. ఇందుకు ఓ నిబంధన సైతం విధించింది. ఇద్దరు పిల్లలకు మించి ఉంటే మాత్రం ఈ ఆప్షన్ వినియోగించుకునే అవకాశం లేదని సూచించింది.
ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గత వారమే నోటిఫికేషన్ జారీ చేసింది. అలాగే.. జూన్ 18 నుంచే ఈ సెలవులు అమల్లోకి వచ్చాయి. అయితే.. సరోగసీ వల్ల బిడ్డను కంటే మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలనే రూల్స్ ఇప్పటివరకు లేవు. కానీ.. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో వారిలో సంతోషం కనిపిస్తోంది.
ఒకవేళ సరోగసీ కోసం గర్భాన్ని అద్దెకిచ్చిన మహిళ సైతం ప్రభుత్వ ఉద్యోగి అయితే ఆమెకూ ఈ సెలవులు వర్తిస్తాయని సవరణల్లో పేర్కొంది. అయితే మహిళలు ఈ సెలవులు పొందాలంటూ రిజిస్టర్డ్ వైద్యులు లేక ఆస్పత్రుల నుంచి సరోగసీ తల్లి, కమిషనింగ్ తల్లీ తండ్రి మధ్య జరిగిన ఒప్పందాన్ని సమర్పించాల్సి ఉంటుంది. అలాగే.. చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్న వారు.. ఐదేళ్లు కలిసి ఉన్న దంపతులే దీనికి అర్హులు. భర్తకు 26 నుంచి 55 ఏళ్ల లోపు వయసు, భార్యకు 23 నుంచి 50 ఏళ్ల లోపు వయసు ఉండాలి.