Begin typing your search above and press return to search.

ఇన్ కం ట్యాక్స్ చట్టంలో పెను మార్పులకు డెడ్ లైన్ ఫిక్స్?

ఆదాయపు పన్ను చట్టం - 1961ని మరింత సింప్లిఫై చేయడానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది.

By:  Tupaki Desk   |   18 Sep 2024 4:30 PM GMT
ఇన్  కం ట్యాక్స్  చట్టంలో పెను మార్పులకు డెడ్  లైన్  ఫిక్స్?
X

ఆదాయపు పన్ను చట్టం - 1961ని మరింత సింప్లిఫై చేయడానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది. వచ్చే ఏడాది బడ్జెట్ కు ముందే.. 2025 జనవరిలోపే ఫాస్ట్ ట్రాక్ రివ్యూ చేపట్టాలని కేంద్రం ఆలోచన చేస్తుందని.. ఈ మేరకు అధికారులను కోరిందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

అవును... ఆదాయపన్ను చట్టం 1961 సమీక్షను వేగవంతంగా ట్రాక్ చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రయత్నిస్తోందని తెలుస్తోంది. వచ్చే ఏడాది కేంద్ర బడ్జెట్ కు ముందు.. జనవరి 2025 నాటికి ఈ సమీక్షను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందని అంటున్నారు. ఈ మేరకు చీఫ్ కమిషనర్ వీకే గుప్తా నేతృత్వంలోని కమిటీని కోరినట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం ఉన్న ఐటీ చట్టం - 1961 నుంచి కాలం చెల్లిన పలు సెక్షన్లు, సబ్ సెక్షన్లు, క్లాజులు సుమారు 120 వరకూ ఉన్నాయని.. అవన్నీ తొలగించబడతాయని భావిస్తున్నారు. ప్రధానంగా టెలికాం, ప్రత్యేక ఆర్థిక మండళ్లు (సెజ్), క్యాపిటల్ గెయిన్స్ లలో మినహాయింపులు, లేదా.. తగ్గింపులు ఇందులో ఉంటాయని అంటున్నారు.

ఈ క్రమంలో... పెండింగులో ఉన్న కేసులలో పాత క్లాజుల కోసం ప్రత్యేక అనుబంధాన్ని ప్రవేశపెట్టవచ్చని.. ఈ సమయంలో సరళీకృత చట్టాన్ని రూపొందించడంలో ఈ కమిటీ.. న్యాయ మంత్రిత్వ శాఖ సహాయాన్ని కూడా కోరవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ విషయంపై నిర్మలా సీతారామన్ జూలై 2024 బడ్జెట్ లో సవరణలను ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ విషయంలో మరోపక్క అంతర్జాతీయంగా అనుసరించే అత్యుత్తమ పద్దతులను కమిటీ పరిశీలిస్తోందని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సిబీడీటీ) చైర్మన్ రవి అగర్వాల్ గతంలోనే తెలిపారు. ఇదే సమయంలో దేశానికి కొత్త ప్రత్యక్ష పన్ను చట్టాన్ని అందించడంలో అత్యుత్తమ మార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు.

కాగా... ఈ విషయంపై స్పందించిన నిర్మలా సీతారామన్... బడ్జెట్ 2024-25తో తాము సాధించాలనుకుంటున్న లక్ష్యాలు నాలుగని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా... పన్నును సరళీకృతం చేయడం, పన్ను కచ్చితత్వాన్ని అందించడం, ట్యాక్స్ పేయర్స్ సేవలను మెరుగుపరచడం, వ్యాజ్యాన్ని తగ్గించడం అని తెలిపారు.