ఆదాయ పన్నుదారులు కోటిమందే.. 24 శాతం ఖజానా వాటా వారిదే
కొత్త పన్ను విధానంలో మార్పులతో రూ.12 లక్షల ఆదాయం పొందుతున్నవారికి రూ.80వేలు మేర ఆదాయపు పన్ను లబ్ధి చేకూరుతుందని నిర్మల బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.
By: Tupaki Desk | 2 Feb 2025 4:30 PM GMTఏటా బడ్జెట్ వస్తున్నదంటే భారత దేశమంతా ఎదురుచూసేది ఆదాయ పన్ను మినహాయింపు గురించే.. ఈసారి పన్ను శ్లాబు ఎంతకు పెంచుతున్నారు..? ఏమేం మినహాయింపులు ఇస్తున్నారు..? కొత్తగా ఉపశమనాలు కల్పించారు..? ఒకటే అంచనాలు. ఇలాంటి ఆశలకు ఈసారి కేంద్ర బడ్జెట్ లో పెద్ద బహుమానమే లభించింది. ఏకంగా 12 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లింపు అవసరం లేదంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లడ్డూ లాంటి వార్త చెప్పారు.
కొత్త పన్ను విధానంలో మార్పులతో రూ.12 లక్షల ఆదాయం పొందుతున్నవారికి రూ.80వేలు మేర ఆదాయపు పన్ను లబ్ధి చేకూరుతుందని నిర్మల బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. రూ.18 లక్షలు ఆదాయపు పొందుతున్న వారికైతే రూ.70 వేలు (ప్రస్తుతం 30 శాతం పన్ను అమల్లో ఉంది) మేలు చేకూరుతుందన్నారు. రూ.25 లక్షలు ఆదాయం ఉన్నవారికి సవరించిన శ్లాబుల ప్రకారం దాదాపు రూ.1.10 లక్షలు లబ్ధి జరుగుతుందని చెప్పారు. ప్రత్యక్ష పన్ను వసూళ్ల రూపంలో లక్ష కోట్ల రూపాయలు, పరోక్ష పన్నుల రూపంలో రూ.2600 కోట్లు ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుందని నిర్మల పేర్కొన్నారు.
మన దేశ జనాభా 140 కోట్ల పైనే.. అయితే, వీరిలో ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసేవారు ఎందరో ఊహించగలరా?.. కేవలం 7.5 కోట్ల మందే రిటర్న్స్ వేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం వీరి సంఖ్య ఇంతే. పైగా వీరిలో 6.5 కోట్ల మంది ఆదాయం రూ.12 లక్షల కంటే తక్కువే కావడం మరో గమనార్హమైన విషయం. అంటే నికరంగా కోటి మంది మాత్రమే కొత్త పన్ను విధానం ప్రకారం ఆదాయ పన్ను చెల్లించునున్నారన్నమాట.
12.75 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉండి పన్ను చెల్లిస్తున్న కోటి మందే భారత దేశ ప్రగతి చక్రాన్ని నడిపిస్తున్నారంటే నమ్మాల్సి ఉంటుంది. వీరే దేశానికి అధిక నిధులు సమకూరుస్తున్నారు. అప్పులు ద్వారా భారత దేశ ఖజానాకు 24 శాతం వాటా వస్తే.. ఆదాయ పన్ను ద్వారా 22 శాతం వస్తోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అంటే.. పన్ను చెల్లిస్తున్న కోటిమందే 22 శాతం ఆదాయం అందిస్తున్నారన్న మాట.