Begin typing your search above and press return to search.

అమరావతికి ఇచ్చే రూ.15 వేల కోట్లు ఎవరు కట్టాలి?

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం తమ ప్రధాన ప్రియారిటీలు ఏమిటనే విషయాన్ని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు.

By:  Tupaki Desk   |   21 Oct 2024 4:12 AM GMT
అమరావతికి ఇచ్చే రూ.15 వేల కోట్లు ఎవరు కట్టాలి?
X

ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం తమ ప్రధాన ప్రియారిటీలు ఏమిటనే విషయాన్ని చంద్రబాబు స్పష్టంగా చెప్పారు. ఇందులో భాగంగా... ఏపీలో ‘ఏ’ అంటే అమరావతి అని క్లారిటీ ఇచ్చారు. ఈ సమయంలో ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అమరావతికి ప్రపంచ బ్యాంక్ ద్వారా 15,000 కోట్ల రూపాయలు రుణం ఇప్పిస్తామని ప్రకటించింది! అన్నట్లుగానే ఆ దిశగా అడుగులు వేగంగా పడ్డాయి.

ఈ సమయంలో ఆ రూ.15,000 కోట్ల మొతంలో సుమారు రూ.13,440 కోట్లు వరల్డ్ బ్యాంకు (డబ్ల్యూబీ), ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) లు సమకూరుస్తుండగా.. మిగిలిన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుందని చెబుతున్నారు. ఇక ఈ మొత్తాన్ని తిరిగి డాలర్ల రూపంలో చెల్లించాలనే చర్చా తెరపైకి వచ్చింది. అయితే... ఈ రుణాన్ని కేంద్రమే భరిస్తుందని.. కేంద్రమే తిరిగి చెల్లిస్తుందని చెబుతున్నాయి టీడీపీ వర్గాలు.

అవును... రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుందని.. బ్యాంకులకు రుణాన్ని తిరిగి కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని చెబుతూ... అమరావతి అప్పును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలనే విషయాన్ని టీడీపీ వర్గాలు ఖండిస్తున్నాయి. ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే సమకూర్చుతున్నట్లు చెబుతున్నాయి! అంటే... కేంద్రమే ఏపీ కోసం అప్పు చేసి ఇస్తుందన్నమాట!

ఇదే సమయంలో... కేంద్ర అర్థికశాఖను రుణగ్రహీతగా.. సీఆర్డీఏ ప్రాజెక్టు అమలు ఏజెన్సీగా ఈ రుణాన్ని ప్రపంచ బ్యాంక్ ఇస్తుందని.. "ప్రోగ్రామ్ ఫర్ రిజల్ట్స్ ఫైనాన్సింగ్" విధానంలో ఈ రుణాన్ని సమకూరుస్తుందని చెబుతున్నారు! అంటే... రూ.15 వేల కోట్ల బాధ్యత మొత్తం కేంద్రానిదే.. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు అనేది వారు చెబుతున్న మాట!

ఒక్కమాటలో చెప్పాలంటే... ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం ప్రకటించిన రూ.15,000 కోట్లు రాష్ట్ర అప్పు కాదు.. కేంద్రం ఇస్తున్న గ్రాంటు అని చెబుతున్నారు! అయితే... ఇక్కడే పలువురు పలు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు. బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మళా సీతారామన్ స్పందిస్తూ... మల్టీ లేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీల ద్వారా రూ.15 వేల కోట్లు ఆర్థిక సాయాన్ని అందిస్తామని చెప్పారని గుర్తుచేస్తున్నారు!

ఈ లెక్కన చూసుకుంటే... ఏజెన్సీలు అనేవి అప్పులే ఇస్తాయి తప్ప రాష్ట్ర ప్రభుత్వాలకు గ్రాంటులు ఇవ్వవు కదా అనేది ఇక్కడ కీలక పాయింట్. ఇస్తాము అనేదానికీ, ఇప్పిస్తాము అనేదానికీ ఉన్న స్పష్టమైన తేడా గమనించాలని పలువురు సూచిస్తున్నారు.

ఇలా కేంద్రం ఇప్పిస్తామని చెబుతూ... రాష్ట్రం మాత్రం ఇప్పించిన సొమ్మును కేంద్రమే తిరిగి కట్టుకుంటుందని చెబుతూ... ముసుగులో గుద్దులాటలాడుతున్నట్లుగా ప్రజలను కన్ఫ్యూజన్ లో పెట్టడం ఎందుకనేది ఇక్కడ ప్రశ్న అని అంటున్నారు ఆ పలువురు! ఈ విషయంలో నిర్మాలా సీతారామన్ నుంచి స్పష్టమైన ప్రకటన చేయించి.. అధికారికంగా ఓ రాతపూర్వక ఒప్పంద పత్రం ఒకటి కేంద్రంతో చేయించుకుంటే బాగుటుంది కదా అనేది సామాన్యుడు సూచన!

అలాకాని పక్షంలో 2014 - 19 మధ్య కాలంలో మొదట జరిగిన పొగడ్తలు, ప్రశంసలు.. ఆ టెర్మ్ పూర్తయ్యే సమయానికి చెడిన పొత్తుల ఫలితంగా.. చివర్లో ఎదురైన పరిస్థితులు రిపీట్ కాకుండా ఉన్నట్లు ఉంటుందని.. ముందు జాగ్రత్త దేనికైనా మంచిదనేది మరికొందరి సూచనగా ఉంది. ఏది ఏమైనా... పత్రికల్లో కథనాలకంటే... కేంద్రంలోని పెద్దల అధికారిక ప్రకటనల వార్తలే స్పష్టత ఇస్తాయని చెబుతున్నారు పరిశీలకులు.

మరి ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చొరవ తీసుకుంటారా.. కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఈ కన్ఫ్యూజన్ ని చెరిపేస్తారా.. లేక, లోన్ కు గ్రాంట్ కూ మధ్య ఆంధ్రులను అయోమయంలోనే ఉంచుతారా అనేది వేచి చూడాలి.