నిర్మలమ్మ చెప్పిన రూ.17,500 ఎలా ఆదా అవుతుందో తెలుసా?
తాజాగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఈ సమయంలో... వేతన జీవికి స్వల్ప ఊరటనిస్తు కొత్త పన్ను విధానంలో మార్పులు తెచ్చింది
By: Tupaki Desk | 23 July 2024 12:38 PM GMTతాజాగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. ఈ సమయంలో... వేతన జీవికి స్వల్ప ఊరటనిస్తు కొత్త పన్ను విధానంలో మార్పులు తెచ్చింది. ఈ మేరకు ఐటీ శ్లాబ్స్ లో మార్పుతో పాటు, స్టాండర్డ్ డిడక్షన్ లోనూ మార్పులు చేశారు. ఇందులో భాగంగా... స్టాండర్డ్ డిడక్షన్ ప్రస్తుతం రూ.50 వేలుగా ఉండగా.. ఆ మొత్తాన్ని రూ.75 వేలకు పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
అంటే... స్టాండర్డ్ డిడక్షన్ మొత్తాన్ని 50శాతం పెంచినట్లు అయ్యిందని.. ఫలితంగా రూ.17,500 వరకూ పన్ను ఆదా చేసుకోవచ్చని ఆమె వెల్లడించారు. ఈ నేపథ్యంలో... ఆ రూ.17,500 ఎలా ఆదా అవుతాయనేది ఇప్పుడు చూద్దాం...! అంతకంటే ముందు పాత, కొత్త శ్లాబుల్లోని తేడాలను పరిశీలిద్దాం...!
పాత శ్లాబ్ విధానం ప్రకారం... సున్నా నుంచి రూ.3 లక్షల వరకు ఎటువంటి ట్యాక్స్ లేదు. ఇదే సమయంలో... రూ.3 నుంచి 6 లక్షల వరకూ 5 శాతం.., రూ.6 నుంచి 9 లక్షల వరకూ 10 శాతం.., రూ.9 నుంచి 12 లక్షల వరకూ 15 శాతం.., రూ.12 నుంచి 15 లక్షల వరకూ 20 శాతం.., రూ.15 లక్షల పైన 30 శాతం ట్యాక్స్ వర్తించింది!
ఈ క్రమంలో కొత్త శ్లాబ్ విధానాన్ని ఒకసారి పరిశీలిస్తే... ఇందులో కూడా సున్నా నుంచి రూ.3 లక్షల వరకు ఎటువంటి ట్యాక్స్ లేదు.. రూ.15 లక్షల పైన 30 శాతం ట్యాక్స్ లోనూ మార్పు లేదు! కాకపోతే... రూ.3 నుంచి 7 లక్షల వరకూ 5 శాతం.., రూ.7 నుంచి 10 లక్షల వరకూ 10 శాతం.., రూ.10 నుంచి 12 లక్షల వరకూ 15 శాతం.., రూ.12 నుంచి 15 లక్షల వరకూ 20 శాతం ట్యాక్స్ లలో మాత్రం స్వల్ప మార్పులు చేశారు.
ఇప్పుడు ఈ మారిన శ్లాబ్ విధానం ప్రకారం ఆ రూ.17,500 ఎలా ఆదా అవుతుందనేది ఇప్పుడు చూద్దాం...!
ఉదాహరణకు ఒక ఉద్యోగికి సంవత్సరానికి రూ.16,00,000 జీతం / ఆదాయం వస్తుందనుకుంటే... పాత శ్లాబుల ప్రకారం అతను రూ. రూ.1,65,000 ట్యాక్స్ చెల్లించాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం...!
పాత శ్లాబ్ ప్రకారం రూ. 50,000 స్టాండర్డ్ డిడక్షన్ పోనూ ఇక మిగిలిన రూ. 15 లక్షల 50 వేలకూ ఐటీ రిటన్స్ దాఖలు చేయాలి. ఇందులో...
రూ.3 లక్షల వరకూ ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదు.
రూ.3 నుంచి 6 లక్షల వరకూ 5 శాతం పన్ను చెల్లించాలి. అంటే... రూ.3 లక్షలపై 5శాతం లెక్కన రూ.15 వేలు పన్ను పడుతుంది.
రూ.6 నుంచి 9 లక్షల మధ్య ఆదాయం ఉంటే... రూ.3 లక్షలపైనా 10 శాతం చొప్పున రూ.30 వేల పన్ను పడుతుంది.
రూ.9 నుంచి 12 లక్షల ఆదాయానికి గానూ... రూ.3 లక్షలపై 15శాతం పన్ను లెక్కన రూ.45 వేలు పడుతుంది.
రూ.12 నుంచి 15 లక్షల ఆదాయానికి గానూ... రూ.3 లక్షలపై 20 శాతం అంటే... రూ.60వేలు పన్నుపడుతుంది.
ఇక రూ.15 లక్షల పైన ఉన్న రూ.50 వేల మొత్తానికీ 30 శాతం చొప్పున రూ.15,000 పన్ను పడుతుంది.
ఇవన్నీ కలిపితే... 15 వేలు + 30 వేలు + 45 వేలు + 60 వేలు + 15 వేలు = రూ.1,65,000 పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నమాట.
ఇప్పుడు మారిన శ్లాబ్ ప్రకారం రూ. 75,000 స్టాండర్డ్ డిడక్షన్ పోనూ ఇక మిగిలిన రూ. 15 లక్షల 25 వేలకూ ఐటీ రిటన్స్ రూ.1,47,500 దాఖలు చేయాలి. ఇందులో...
రూ.3 లక్షల వరకూ ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదు.
రూ.3 నుంచి 7 లక్షల వరకూ 5 శాతం పన్ను చెల్లించాలి. అంటే... రూ.4 లక్షలపై 5 శాతం లెక్కన రూ.20 వేలు పన్ను పడుతుంది.
రూ.7 నుంచి 10 లక్షల మధ్య ఆదాయం ఉంటే... రూ.3 లక్షలపైనా 10 శాతం చొప్పున రూ.30 వేల పన్ను పడుతుంది.
రూ.10 నుంచి 12 లక్షల ఆదాయానికి గానూ... రూ.2 లక్షలపై 15 శాతం పన్ను లెక్కన రూ.30 వేలు పడుతుంది.
రూ.12 నుంచి 15 లక్షల ఆదాయానికి గానూ... రూ.3 లక్షలపై 20 శాతం అంటే... రూ.60 వేలు పన్నుపడుతుంది.
ఇక రూ.15 లక్షల పైన ఉన్న రూ.25 వేల మొత్తానికీ 30 శాతం చొప్పున రూ.7,500 పన్ను పడుతుంది.
ఇవన్నీ కలిపితే... 20 వేలు + 30 వేలు + 30 వేలు + 60 వేలు + 7,500 = రూ.1,47,500 పన్ను చెల్లించాల్సి ఉంటుందన్నమాట.
అంటే రూ.50 వేల స్టాండర్డ్ డిడక్షన్ తో పాత శ్లాబ్ విధానం ప్రకారం రూ.1,65,000 పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండగా... వచ్చే ఏడాది నుంచి అమలులోకి వచ్చే నూతన శ్లాబ్ విధానం, రూ.75,000 స్టాండర్డ్ డిడక్షన్ ప్రకారం రూ.1,47,500 పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అంటే... రూ.1,65,000 - రూ.1,47,500 = రూ. 17,500 పన్ను ఆదా అవుతుందన్నమాట. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ చెప్పిన ఆదా లెక్క ఇదే!